సిలిండర్లు ఓపెన్‌ చేసి.. చస్తానంటూ బెదిరించిన మహిళ

ABN , First Publish Date - 2022-04-24T14:02:23+05:30 IST

ఇంట్లో సిలిండర్లు ఓపెన్‌ చేసి ఆత్మహత్య చేసుకుంటానని ఓ మహిళ బెదిరింపులకు దిగడంతో స్థానిక మనలిలో 8 గంటలు హైడ్రామా నెలకొంది. మనలి ఈవేరా

సిలిండర్లు ఓపెన్‌ చేసి.. చస్తానంటూ బెదిరించిన మహిళ

పెరంబూర్‌(చెన్నై): ఇంట్లో సిలిండర్లు ఓపెన్‌ చేసి ఆత్మహత్య చేసుకుంటానని ఓ మహిళ బెదిరింపులకు దిగడంతో స్థానిక మనలిలో 8 గంటలు హైడ్రామా నెలకొంది. మనలి ఈవేరా పెరియార్‌ వీధికి చెందిన రమేష్‌ కన్నన్‌ మనలి మండలంలో తాత్కాలిక పారిశుధ్య కార్మికుల సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య రేణుక (42) ఇంట్లోనే బ్యూటీ పార్లర్‌ నడుపుతోంది. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రమేష్‌ కన్నన్‌కు మరో మహిళతో సంబంధాలున్నట్లు సమాచారం. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో, శుక్రవారం రేణుక హఠాత్తుగా ఇంటి తలుపులు మూసివేసి హాల్‌లో సోఫాలో కూర్చొని చుట్టూ మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉంచుకొని, వాటి మూత తీసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెండు వాహనాలతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఆమెతో మాట్లాడేందుకు యత్నించారు. వారి మాట వినని రేణుక ఒక సిలిండర్‌ మూత తీసివేయడంతో ఆ ప్రాంతమంతా గ్యాస్‌ వాసన చెలరేగింది. దీంతో, ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేసిన అధికారులు, ఆరు అంబులెన్స్‌లు సిద్ధం చేశారు. మనలి 21వ వార్డు అన్నాడీఎంకే కౌన్సిలర్‌ రాజేష్ శేఖర్‌ రేణుకతో ఫోన్‌లో మాట్లాడినా ఫలితం లేకపోయింది.  రేణుక తల్లి అమరావతి, సోదరి కందస్వామి, ఆమె స్నేహితులతో రేణుకతో ఫోన్‌ మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ హైడ్రామా రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. తన భర్త, ఆ మహిళను తీసుకొచ్చిన తర్వాతే తలుపులు తీస్తానని రేణుక భీష్మించుకుంది. దీంతో కరెంటు లేక ఆ ప్రాంత ప్రజలు ఇళ్ల ముందే గడిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ ప్రాంత ప్రజలు చుట్టుపక్కల ఇళ్ల వారిని ఖాళీ చేయించారు. రాత్రి 8 గంటల సమయంలో అగ్నిమాపక సిబ్బంది తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లగా, వారిని చూసిన రేణుక మరో సిలిండర్‌ మూత తీసేందుకు యత్నించింది. అంతలో వెనుక వైపు తలుపులు పగులగొట్టి ఇంట్లో ప్రవేశించిన మరో బృందం ఆమెపై పైపుల ద్వారా నీటిని చల్లడంతో, ఆ వేగానికి ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆ సమయంలో సిబ్బంది సిలిండర్‌ మూతలు బిగించారు. స్పృహ తప్పిన రేణకను అంబులెన్స్‌ ద్వారా ఆస్పత్రికి తరలించారు. సుమారు 8 గంటల హైడ్రామా తర్వాత ఎలాంటి ఉపద్రవం తలెత్తకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2022-04-24T14:02:23+05:30 IST