లేడీ బాండ్‌ వచ్చేసింది..

ABN , First Publish Date - 2021-11-25T05:30:00+05:30 IST

అరవై ఎనిమిదేళ్ళుగా నవలా ప్రపంచంలో, యాభై తొమ్మిదేళ్లుగా వెండి తెరమీదా గూఢచారి అంటే.......

లేడీ బాండ్‌ వచ్చేసింది..

అరవై ఎనిమిదేళ్ళుగా నవలా ప్రపంచంలో, యాభై తొమ్మిదేళ్లుగా వెండి తెరమీదా గూఢచారి అంటే... జేమ్స్‌బాండ్‌.ఇయాన్‌ ఫ్లెమింగ్‌తో మొదలైన ‘బాండ్‌’ బ్రాండ్‌ స్పై థ్రిల్లర్స్‌ రచన ఆయన తరువాత కూడా కొనసాగుతోంది. అయితే వాటిని రాసినవాళ్ళంతా పురుషులే. ఇప్పుడు ఒక మహిళ కలం నుంచి తొలిసారిగా బాండ్‌ నవలు రాబోతున్నాయి. ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న ఆ రచయిత్రి... కిమ్‌ షెర్వుడ్‌.


బడిలో పాఠాలు, ఇంట్లో కథల పుస్తకాలు... ఇవే కిమ్‌ షెర్వుడ్‌ వ్యాపకాలు. ‘‘చిన్నప్పుడు బడిలో, కాలేజీలో పాఠాలు వినేదాన్ని. ఇప్పుడు పాఠాలు చెబుతున్నా. పుస్తకాలు చదవడమే కాదు, రాస్తున్నా. నాకూ, చదువుకూ, పుస్తకాలకూ ఉన్న సంబంధం అలాగే కొనసాగుతోంది’’ అంటారు కిమ్‌ షేర్‌వుడ్‌. వెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ యూనివర్సిటీలో సీనియర్‌ లెక్చరర్‌గా పని చేస్తున్న ఆమె తొలి నవల ‘టెస్ట్‌మెంట్‌’ అయిదేళ్ళ క్రితం వెలువడి, ప్రశంసలు పొందింది. ‘బాత్‌ నోవెల్‌ అవార్డ్‌’ అందుకుంది. అంతేకాదు... బాండ్‌ నవలలు రాసే ఛాన్స్‌ దక్కేలా చేసింది.


తాతయ్యను విసిగించేదాన్ని...

‘‘నేను లండన్‌లో పుట్టి పెరిగాను. బాండ్‌ సినిమాలన్నా, నవలలన్నా నాకెంతో ఇష్టం. నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు.. మీకు ఇష్టమైన రచయిత గురించి రాయాలని మా ఇంగ్లీష్‌ టీచర్‌ అసైన్‌మెంట్‌ ఇచ్చారు. అప్పుడు నేను రాసింది ఇయాన్‌ ఫ్లెమింగ్‌ గురించి. ఆ రిపోర్ట్‌ ఇప్పటికీ నా దగ్గరుంది. రచయిత్రిని కావాలనే కోరిక అలా నాలో మరింత బలపడింది. నా తొలి నవల కూడా వచ్చింది. కానీ బాండ్‌ నవల రాయాలనే నా జీవితాశయం నెరవేరుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అంతేకాదు, బాండ్‌ పట్ల నా ఆకర్షణకు మరో కారణం కూడా ఉంది. మా తాతయ్య జార్జి బేకర్‌ ప్రసిద్ధ నటుడు. మూడు బాండ్‌ సినిమాల్లో కనిపించారు. ఆ సినిమాల విశేషాలు చెప్పాలని తాతయ్యను పదేపదే అడిగి విసిగించేదాన్ని’’ అని గుర్తుచేసుకున్నారు ముప్ఫై రెండేళ్ళ కిమ్‌.


‘007’ కాదు... సరికొత్త ’00’

‘‘బాండ్‌ నవలల కోసం నా ఏజెంట్లను ఇయాన్‌ ఫ్లెమింగ్‌ పబ్లికేషన్స్‌ లిమిటెడ్‌ తరఫున కొందరు ప్రతినిధులు సంప్రతించారు. ఈ సంగతి తెలియగానే నాకు నోట మాట రాలేదు. ఇప్పటివరకూ అధికారికంగా వెలువడిన దాదాపు నలభై జేమ్స్‌బాండ్‌ నవలలను ఆరుగురు రచయితలు రాశారు. వాళ్ళలో సెబాస్టియన్‌ ఫౌల్క్స్‌, కింగ్‌ స్లే అమిస్‌, ఆంథోనీ హార్విట్జ్‌ లాంటి దిగ్గజాలున్నారు. కానీ... ఒక్క మహిళ కూడా లేరు. ఆ ఘనత నాకు దక్కడం, వారి సరసన నా పేరు చోటు చేసుకోబోతూండడం గౌరవంగా భావిస్తున్నాను’’ అని చెప్పారు కిమ్‌.  మరో విశేషం ఏంటంటే... ఇప్పటివరకూ వచ్చిన నవలల్లో ప్రధానమైన పాత్ర జేమ్స్‌బాండ్‌ 007. అయితే కిమ్‌ రాయబోతున్న నవలల్లో కొత్త ‘00’ ఏజెంట్స్‌ ఉంటారు. ప్రపంచానికి తలెత్తిన ఒక ముప్పును తప్పించడం కోసం పోరాడతారు. ఇలా సరికొత్త ‘00’ ఏజెంట్లకు శ్రీకారం చుట్టి, బాండ్‌ విస్తృతిని పెంచబోతున్నందుకు సంతోషంగా ఉంది’’ అంటున్నారు కిమ్‌.


ఆయనే స్ఫూర్తి...

‘‘నా రచనలకు ఇయాన్‌ ఫ్లెమింగ్స్‌ నుంచి స్ఫూర్తి తీసుకుంటాను. అన్ని బాండ్‌ నవలల్లో ‘007’ ప్రధాన ఆకర్షణగా ఉంటాడు. కానీ ఫ్లెమింగ్‌ నవలల్లో అనేకమంది ఇతర గూఢచారుల ప్రస్తావన వస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కార్యసాధనకోసం పాటుపడుతున్న కథానాయకుల బృందంగా... ‘00’ ఏజెంట్లను తీర్చిదిద్దడానికి ఇది నాకు ప్రేరణ అవుతుంది. అయితే, బాండ్‌కు నమ్మకమైన సెక్రటరీ మనీ పెన్నీ, గూఢచారుల బాస్‌ ‘ఎం’ లాంటి పాత్రలు కూడా నేను రాయబోతున్న మూడు నవలల్లో ఉంటాయి’’ అని చెబుతున్నారామె. 


స్ర్తీవాదం జోడించి.. సమకాలీనంగా

కాగా ఇప్పటి వరకూ వచ్చిన బాండ్‌ నవలల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యత చాలా తక్కువ. ఈ నేపథ్యంలో, యువ మహిళా రచయితగా జేమ్స్‌బాండ్‌ నవలలకు స్త్రీవాద దృక్పథాన్ని కూడా కిమ్‌ జోడించాలనుకుంటున్నారు. ‘‘ఫ్లెమింగ్‌ నవలల కాలం కన్నా మనం చాలా భిన్నమైన కాలంలో ఉన్నాం. ఆయన రాసిన అంశాల్లో కొన్ని ఇప్పుడు మనకు కనిపించవు. బ్రిటన్‌ సామ్రాజ్యవాద కాలంలో... అంతర్జాతీయంగా బ్రిటన్‌కు ఉన్న ప్రాధాన్యాన్ని ఆయన వర్ణించారు. కానీ ఆ పరిస్థితి మారింది. ఒక క్లాసిక్‌ సిరీ్‌సను సమకాలీనంగా తీర్చిదిద్దడం కత్తిమీద సాము. దాన్ని సమర్థవంతంగా నిర్వహించగలననుకుంటున్నా’’ అంటున్న కిమ్‌ రాస్తున్న ట్రయాలజీలో మొదటి నవల వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో విడుదలవుతుంది. 


 ఇప్పటి వరకూ వచ్చిన బాండ్‌ నవలల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యత చాలా తక్కువ. ఈ నేపథ్యంలో, యువ మహిళా రచయితగా జేమ్స్‌బాండ్‌ నవలలకు స్త్రీవాద దృక్పథాన్ని కూడా కిమ్‌ జోడించాలనుకుంటున్నారు

Updated Date - 2021-11-25T05:30:00+05:30 IST