భక్తులు కొనే లడ్డూలు ‘హాంఫట్‌’!

ABN , First Publish Date - 2022-09-30T05:30:00+05:30 IST

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రి వేడుకలకు వచ్చే భక్తులకు అందించే లడ్డూ ప్రసాదం పంపిణీలో సంబంధిత సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

భక్తులు కొనే లడ్డూలు ‘హాంఫట్‌’!

  సిబ్బంది చేతివాటం

పాయకాపురం, సెప్టెంబరు 30 : ఇంద్రకీలాద్రిపై  కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రి వేడుకలకు వచ్చే భక్తులకు అందించే లడ్డూ ప్రసాదం పంపిణీలో సంబంధిత సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అమ్మ ప్రసాదమైన లడ్డూలను విక్రయించేందుకు దేవస్థానం కింద భాగంలో 13 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో లడ్డూ వెల రూ.15గా నిర్ణయించి భక్తులకు అమ్ముతున్నారు. అయితే ఈ లడ్డూల కౌంటర్లలో పనిచేసే కొంతమంది సిబ్బంది భక్తులకు ఇచ్చే లడ్డూలను తప్పుడు లెక్కలు వేసి తక్కువ ఇస్తున్నారు. 15 లడ్డూలు కావాలని డబ్బులిచ్చి టోకెన్‌లు తీసుకున్న వారికి 13 లడ్డూలు ఇవ్వడం, 12 లడ్డూలు కావాలని టోకెన్లు ఇచ్చిన వారికి 10 లేదా 11 లడ్డూలను మాత్రమే సంచుల్లో వేసేసి కౌంటర్ల వద్ద రద్దీ తక్కువగా ఉన్నా కూడా పదండి పదండంటూ కావాలని హడావుడి సృష్టిస్తూ భక్తులను  అయోమయానికి  గురిచేస్తున్నారు. సిబ్బంది తీరుపై అనుమానం వచ్చిన కొంతమంది భక్తులు పక్కకు వెళ్లి లడ్డూలు లెక్కవేయగా ఒకటి రెండు తగ్గుతున్నాయి. దీంతో వారంతా వెనక్కి వెళ్లి లడ్డూలు మాకు తక్కువ వచ్చాయని చెప్పడంతో తిరిగి వారికి మౌనంగా లడ్డూలు ఇచ్చి పంపేస్తున్నారు. 

  అమ్మ ప్రసాదంలో ఇలా చేయడం దారుణం 

అమ్మవారి సన్నిదిలో ఇలా లడ్డూలు కాజేయడం చాలా దారుణం. నేను 10 లడ్డూలకు డబ్బులు చెల్లించి టోకెన్‌ ఇస్తే నా సంచిలో 9 మాత్రమే లడ్డూలు వేశారు. అదేంటని వెళ్లి అడిగితే ఇస్తునారు. లేకపోతే తమ ఖాతాలోకి వేసేస్తున్నారు. 

- నాగార్జున, భక్తుడు, రేపల్లె

 కావాలనే తగ్గించి ఇస్తున్నారు

అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని కావాలనే సిబ్బంది తగ్గించి ఇచ్చి భక్తులను మోసం చేస్తున్నారు. క్యూలైన్లలో భక్తులు ఎక్కువుగా లేకపోయినా హడావుడిగా లడ్డూలు లెక్కవేసి సంచుల్లో వేసేసి బయటకు  పంపేస్తున్నారు. 12 లడ్డూలకు నేను టోకెన్‌ ఇవ్వగా 11 మాత్రమే వేసి వెళ్లిపోమన్నారు. తీరా లడ్డూ తగ్గిందని లెక్కవేసి అడిగితే అప్పుడు ఇచ్చి పంపుతున్నారు. 

 - చంద్ర, రాజమండ్రి 


Updated Date - 2022-09-30T05:30:00+05:30 IST