లద్దాఖ్‌లో 20 వేల పాక్‌ సైన్యం!

ABN , First Publish Date - 2020-07-02T06:52:17+05:30 IST

ఓవైపు భారత్‌, చైనా లద్దాఖ్‌లో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు చర్చలు జరుపుతుండగా.. మరోవైపు పాకిస్థాన్‌ గిల్గిట్‌-బల్టిస్థాన్‌లో

లద్దాఖ్‌లో 20 వేల పాక్‌ సైన్యం!

పాక్‌ ఉగ్రమూకలతో చైనా చర్చలు?..

భారత్‌ ఉక్కు పడవలు


న్యూఢిల్లీ, జూలై 1: ఓవైపు భారత్‌, చైనా లద్దాఖ్‌లో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు చర్చలు జరుపుతుండగా.. మరోవైపు పాకిస్థాన్‌ గిల్గిట్‌-బల్టిస్థాన్‌లో తన సైన్యాన్ని సమీకరిస్తోంది. ఆర్మీ వర్గాల సమాచారం ప్రకారం.. చైనాకు మద్దతుగా ఇప్పటికే 20వేలమంది బలగాలను ఉత్తర లద్దాఖ్‌కు తరలించింది. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు గాను పాకిస్థాన్‌కు చెందిన అల్‌ బదర్‌ ఉగ్రసంస్థతో చైనా సైన్యం సంప్రదింపులు జరుపుతోంది. భారత్‌పై రెండు చోట్ల నుంచి ఒకేసారి దాడి చేయాలనేది పాక్‌ యోచనగా కనిపిస్తోంది. చైనా ప్రోద్బలంతో మరింత మంది ఉగ్రవాదుల్ని భారత్‌లోకి పంపేందుకు పాక్‌ కుట్ర పన్నుతున్నుతోంది. మరోవైపు.. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా మరిన్ని బలగాలను మోహరించింది. వీటితో పాటు, టిబెట్‌, షిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లలో ఉన్న మరో 10వేలమంది బలగాల కదలికల్ని భారత సైన్యం నిశితంగా పరిశీలిస్తోంది. సుదీర్ఘ ప్రతిష్టంబనకు తాము సిద్ధంగా ఉన్నామని ఆర్మీ వర్గాలు పేర్కొంటున్నాయి. లద్దాఖ్‌ సరస్సులోని చైనా నౌకలకు దీటుగా భారత్‌ కూడా అత్యధిక సామర్థ్యం కలిగిన 12 ఉక్కు పడవల్ని మోహరించనుంది. భారీ బరువుల్ని మోసే సామర్థ్యం కలిగిన సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ విమానాల్లో నౌకాదళం వీటిని తరలించనున్నట్లు సమాచారం. మరోవైపు.. బాలాకోట్‌ మెరుపుదాడుల్లో వినియోగించిన స్పైస్‌-2000 బాంబుల్ని ఇజ్రాయెల్‌ నుంచి అత్యవసరంగా మరిన్ని కొనుగోలు చేయాలని భారత్‌ నిర్ణయించింది. మిరేజ్‌-2000 యుద్ధవిమానాల నుంచి ప్రయోగించే ఈ బాంబులు.. 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా సునాయాసంగా ఛేదించగలవు. ఇక.. సరిహద్దుల్లో పరిస్థితుల్ని సమీక్షించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, శుక్రవారం లద్దాఖ్‌ను సందర్శించే అవకాశం ఉందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. తమ దేశంలోని నాలుగు అమెరికా సంస్థలు సిబ్బంది, వ్యాపార సమాచారాన్ని, పలు అంశాలపై పూర్తి వివరాల్ని సమర్పించాలని చైనా ఆదేశించింది. ఈ మేరకు.. ది అసోసియేటెడ్‌ ప్రెస్‌(ఏపీ), యునైటెడ్‌ ప్రెస్‌ ఇంటర్నేషనల్‌, సీబీఎస్‌, నేషనల్‌ పబ్లిక్‌ రేడియో సంస్థలకు చైనా విదేశాంగ శాఖ నోటీసులు జారీ చేసింది. కాగా, గత నెల 15న సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఉద్రిక్తతల్లో తమ సైనికులు 40మంది చనిపోయినా చైనా ఒప్పుకోలేదని.. అలా ఒప్పుకొంటే సైన్యంలో తిరుగుబాటు మొదలవుతుందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భయపడుతున్నారని కమ్యూనిస్టు పార్టీ మాజీ నేత తనయుడు జియాన్లీ యాంగ్‌ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. భారత్‌లోని జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో చైనా సంస్థలు పాల్గొనకుండా నిషేధం విధిస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల్లోనూ(ఎంఎ్‌సఎంఈ) చైనా సంస్థలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 


ఉద్రిక్తతల తగ్గింపునకు ప్రాధాన్యం 

చైనా, భారత్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని దశలవారీగా.. వేగంగా సాధారణ స్థితికి తీసుకురావడమే ప్రాధాన్యతగా ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు మంగళవారం జరిగిన కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి భేటీలో, పరస్పర అంగీకారమైన పరిష్కారానికి వచ్చేందుకై సైనికపరంగా, దౌత్యపరంగా పలు సమావేశాలు జరగాలని నిర్ణయించాయి. భారత్‌లోని చుల్‌షుల్‌ సెక్టార్‌లో ఉదయం 11గంటలకు మొదలైన చర్చలు, సుదీర్ఘంగా 12గంటల పాటు సాగాయి. భారత్‌ తరపున 14కార్ప్స్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌ హాజరుకాగా.. చైనా తరపున టిబెట్‌ మిలిటరీ జిల్లా కమాండర్‌ మేజర్‌ జనరల్‌ లియూ లిన్‌ పాల్గొన్నారు.చైనా, భారత్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని దశలవారీగా.. వేగంగా సాధారణ స్థితికి తీసుకురావడమే ప్రాధాన్యతగా ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు మంగళవారం జరిగిన కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి భేటీలో, పరస్పర అంగీకారమైన పరిష్కారానికి వచ్చేందుకై సైనికపరంగా, దౌత్యపరంగా పలు సమావేశాలు జరగాలని నిర్ణయించాయి. భారత్‌లోని చుల్‌షుల్‌ సెక్టార్‌లో ఉదయం 11గంటలకు మొదలైన చర్చలు, సుదీర్ఘంగా 12గంటల పాటు సాగాయి. భారత్‌ తరపున 14కార్ప్స్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌ హాజరుకాగా.. చైనా తరపున టిబెట్‌ మిలిటరీ జిల్లా కమాండర్‌ మేజర్‌ జనరల్‌ లియూ లిన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-02T06:52:17+05:30 IST