కొరవడుతున్న పశువైద్యం

ABN , First Publish Date - 2022-09-26T06:46:32+05:30 IST

గిద్దలూరు నియోజకవర్గంలోని పలు పశువైద్యశాలలు పశుపోషకులకు నామమాత్రపు సేవలు అందిస్తున్నాయి. కొన్ని చోట్ల వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

కొరవడుతున్న పశువైద్యం
కొమరోలులోని పశువైద్యశాల

ఇన్‌చార్జుల ఏలుబడిలోనే వైద్యశాలల నిర్వహణ

నామమాత్రపు సేవలతోనే సరిపెట్టుకోవాల్సిన ధైన్యం

గిద్దలూరు, సెప్టెంబరు 25 : గిద్దలూరు నియోజకవర్గంలోని పలు పశువైద్యశాలలు పశుపోషకులకు నామమాత్రపు సేవలు అందిస్తున్నాయి. కొన్ని చోట్ల వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని చోట్ల వెటర్నరీ అసిస్టెంట్‌, కాంపౌండర్‌, అటెండర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్‌చార్జి డాక్టర్లు ఎప్పుడు వస్తారో తెలియక పశుపోషకులు ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరోలు, తాటిచెర్ల, అర్థవీడు మండలంలోని పాపినేనిపల్లి పశువైద్యశాలల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గిద్దలూరు మండలంలోని పొదలకొండపల్లి పశువైద్యాధికారి కొమరోలు పశువైద్యశాలకు వారానికి 3 రోజులు వెళ్లే విధంగా, అలాగే బేస్తవారపేట మండలం పూసలపాడు పశువైద్యాధికారి కొమరోలు మండలంలోని తాటిచెర్ల పశువైద్యశాలకు వారానికి 3 రోజులు వెళ్లే విధంగా, అర్థవీడు మండలం పాపినేనిపల్లి పశువైద్యశాలకు అర్థవీడు పశువైద్యాధికారి వారానికి మూడు రోజులు వెళ్లే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో వారంలో సగం రోజులు మాత్రమే ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల పశువైద్యశాలలతోపాటు పొదలకొండపల్లి, పూసలపాడు, అర్థవీడు పశువైద్యశాలల్లో సైతం సమస్య ఏర్పడింది. గిద్దలూరు మండలంలోని పొదలకొండపల్లి పశువైద్యశాలలో వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టు, గిద్దలూరు, సంజీవరాయునిపేట, ముండ్లపాడు పశువైద్యశాలల్లో అటెండర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాచర్ల, అనుమలవీడు పశువైద్యశాలల్లో వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టులు, ఆకవీడు, చోళ్ళవీడులోని గ్రామీణ పశువైద్యశాలల్లో అటెండర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పశువైద్యశాలల విషయానికి వస్తే అటెండర్‌ పోస్టు కూడా చాలా ముఖ్యం. యడవల్లి వైద్యశాలలో వీఎల్‌వో పోస్టు ఖాళీగా ఉంది. బేస్తవారపేట మండలంలో సోమవారపేటలో కాంపౌండర్‌ పోస్టు, అర్థవీడు మండలం అర్థవీడు, పాపినేనిపల్లెలో వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుడిమెట్ట, ఉయ్యాలవాడ ఆర్‌బీకెలలో వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉండగా గోపాలమిత్రలు తాత్కాలికంగా పశువైద్యసేవలు అందిస్తున్నారు. మొత్తం మీద కొమరోలు, తాటిచెర్ల పశువైద్యశాలల్లో మూడు నెలలుగా ఇన్‌చార్జ్‌ వైద్యులే దిక్కుకాగా పాపినేనిపల్లెలో సైతం చాలా నెలలుగా డిప్యుటేషన్‌పై వెళ్ళిన డాక్టర్‌ పోస్టు ఖాళీగా ఉంది. రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం ఖాళీగా ఉన్న డాక్టర్‌, వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేసి పశుపోషకుల ఇబ్బందులను తీర్చాల్సి ఉంది. 

కొమరోలు : మండలంలోని కొమరోలు, తాటిచర్ల పశు వైద్యశాలల్లో ఇన్‌చార్జ్‌ల పరిపాలనలో ఉండడంతో మండ లంలోని 14 గ్రామ పంచాయతీల్లోని పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. మండలంలోని రెండు పశువైద్యశాలల్లోని కొమరోలు వైద్యాధికారి రెండు నెలల కిందట, తాటిచర్ల వైద్యాధికారి గత సంత్సరకాలం నుంచి  పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో వైద్యశాలకు వచ్చే పశుపోషకులకు సరైన వైద్యం అందక ప్రైవేటు వైద్యం చేయుంచుకొని అప్పులభారిన పడి నష్టపోతున్నారు. ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాటుచేసిన రైతుభరోసా కేంద్రంలోని సిబ్బందికి పశువైద్యంపై సరైన అవగాహన లేకపోవటం, రైతులను సరిగా పట్టించుకునే ఓపికలేక పోవటంతో పశుపోషకులు కొందరు సొంతవైద్యం చేసుకుని పశువులను చేతులార చంపుకున్న ఘటనలు మండలంలో చాలా ఉన్నాయి. మండల కేంద్రమైన కొమరోలు, తాటిచర్ల వైద్యశాలల్లో ఒక్క వైద్యాధికారే కాకుండా లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్‌, వెటర్నిరీ అసిస్టెంటు, అటెండర్‌ పోస్టులు ఖాలీగా ఉండటంతో పశుపోషకులు వారి సంఘాల ద్వార పలు సందర్బలు ఉన్నతాధి కారులకు  తెలిపినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా ఽఉన్నతాధికారులు స్పందించి రెండు పశు వైద్యశాలలకు వైద్యాధికారులను, సిబ్బందిని రెగ్యులర్‌గా నియమించాలని కోరుతున్నారు. కనీసం కొమరోలు, తాటిచర్ల వైద్యశాలల్లో కనీసం ఒక్క వైద్యశాలకైనా రెగ్యులర్‌ పశువైద్యాధికారిని నియమిం చాలని కోరుతున్నారు.

Updated Date - 2022-09-26T06:46:32+05:30 IST