Patna High Court : ఎదిరించకపోవడం అంటే ఆ ఘోరాన్ని సమ్మతించడం కాదు

ABN , First Publish Date - 2022-06-27T21:24:54+05:30 IST

కామాంధుడు కర్కశంగా అత్యాచారం చేస్తున్న సమయంలో బాధితురాలు

Patna High Court : ఎదిరించకపోవడం అంటే ఆ ఘోరాన్ని సమ్మతించడం కాదు

పాట్నా : ఓ కామాంధుడు కర్కశంగా అత్యాచారం చేస్తున్న సమయంలో బాధితురాలు శారీరకంగా నిరోధించకపోవడాన్ని ఆ దుశ్చర్యకు ఆమె అంగీకారం తెలిపినట్లుగా భావించకూడదని పాట్నా హైకోర్టు తెలిపింది. బాధితురాలి శరీరంపై గాయాలు లేకపోవడాన్నిబట్టి, ఎటువంటి నిరోధం లేదని, ఇరువురి సమ్మతితో లైంగిక చర్య జరిగిందని చేసిన వాదనను జస్టిస్ ఏఎం బదర్ సింగిల్ జడ్జి బెంచ్ తోసిపుచ్చింది.  


బాధితురాలు వివాహిత అని, ఆమెకు సుమారు నాలుగేళ్ళ వయసుగల కుమారుడు ఉన్నాడని, ఆమె సొంత ఇంటిలోనే ఆమెపై ఓ వ్యక్తి దాడి చేశాడని హైకోర్టు జూన్ 22న ఇచ్చిన తీర్పులో పేర్కొంది. ఇటువంటి పరిస్థితుల్లో నిందితుని చర్యను నిరోధించడం ఆమెకు సాధ్యం కాకపోవచ్చునని పేర్కొంది. అంతేకాకుండా కేవలం నిరోధించనంత మాత్రానికి సమ్మతి తెలిపినట్లుగా పరిగణించడం సాధ్యం కాదని వివరించింది. 


లైంగిక చర్యలో భాగస్వామ్యానికి ఇష్టాన్ని ప్రదర్శించే నిర్ద్వంద్వ, బుద్ధిపూర్వక అంగీకారం రూపంలో సమ్మతి ఉండాలని భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 375 (అత్యాచారం) నిబంధన స్పష్టంగా చెప్తోందని తెలిపింది. 


నిందితుడిని దోషిగా ప్రకటిస్తూ 2017 మార్చి 9న సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అపీలును హైకోర్టు విచారించి, ఈ తీర్పు చెప్పింది. ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), సెక్షన్ 452 (ఇంట్లోకి చొరబడటం), సెక్షన్ 323 (ఉద్దేశపూర్వకంగా గాయపరచడం), సెక్షన్ 506 (నేరపూరిత బెదిరింపు) ప్రకారం ఆరోపణలు రుజువైనట్లు సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. దోషికి పదేళ్ళ కఠిన కారాగారవాస శిక్షను విధించింది. 


బాధితురాలు బిహార్‌లోని జముయి జిల్లాలోని ఓ గ్రామంలో ఇటుక బట్టీలో పని చేస్తూ, జీవిస్తున్నారు. ఆ ఇటుక బట్టీ యజమాని ఈ కేసులో దోషి. 2015 ఏప్రిల్ 9న  ఆమె పని పూర్తి చేసుకుని, తనకు వేతనం చెల్లించాలని ఆ యజమానిని కోరారు. అయితే తాను తర్వాత ఇస్తానని ఆయన ఆమెకు చెప్పాడు. అదే రోజు రాత్రి వేళలో అతను ఆమె ఇంటికి వెళ్లి, ఆమెను ఓ గదిలోకి ఈడ్చుకెళ్ళి, దారుణంగా అత్యాచారం చేశాడు. ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో ఆ గ్రామస్థులు నిందితుడిని పట్టుకుని, ఓ చెట్టుకు కట్టేశారు. అనంతరం ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)ను నమోదు చేశారు. 


అత్యాచారం చేసినట్లు, ఇంట్లోకి అక్రమంగా చొరబడినట్లు నమోదైన ఆరోపణలు రుజువయ్యాయని, అయితే ఉద్దేశపూర్వకంగా గాయపరచినట్లు, నేరపూరితంగా బెదిరించినట్లు నమోదైన ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు లేవని Patna High Court తీర్పులో పేర్కొంది. 


Updated Date - 2022-06-27T21:24:54+05:30 IST