ఉండలేక.. వెళ్లలేక!

ABN , First Publish Date - 2022-07-20T10:09:14+05:30 IST

గోదావరి వరద బాధితుల పాలిట కొన్ని పునరావాస కేంద్రాలు మొక్కుబడిగా మారిపోయాయి! అక్కడ వారికి సరైన తిండి దొరకడం లేదు.

ఉండలేక.. వెళ్లలేక!

  • పునరావాస కేంద్రాల్లో సరైన తిండి దొరక్క పస్తులు.. 
  • సరుకుల్లేక ఇంట్లో పొయ్యి వెలిగించలేని దైన్యం
  • కాలనీలు, ఇళ్లలో పేరుకుపోయిన బురద, చెత్తతో కంపు
  • పిల్లాపాపలతో దిక్కుతోచని స్థితిలో వరద బాధితులు
  • భద్రాద్రి ముంపు ప్రాంతాల్లో మోటార్లతో బయటకు నీళ్లు 
  • వైకుంఠధామాలూ నీళ్లలోనే.. అంత్యక్రియలకు కష్టం
  • ‘పరిహారం’లో గందరగోళం.. జాబితాలో నకిలీలు
  • పునరావాస కేంద్రాల్లో ఉన్నవారే అర్హులా? 
  • బంధుమిత్రుల ఇళ్లలో ఉన్నవారు కాదా? 
  • న్యాయం చేయాలంటూ బాధితుల ఆందోళన


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): గోదావరి వరద బాధితుల పాలిట కొన్ని పునరావాస కేంద్రాలు మొక్కుబడిగా మారిపోయాయి! అక్కడ వారికి సరైన తిండి దొరకడం లేదు. పస్తులు ఉండలేక సొంత గూటికైనా వెళదామని అక్కడికి చేరుకుంటే.. కూలిన ఇళ్లు, పాడైన వస్తువులు, పనికిరాకుండా పోయిన బియ్యం, ఇతర నిత్యావసరాలు చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉండలేక.. ఇళ్లకు వెళ్లలేక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. బాధితుల్లో ఎవరిని కదిలించినా కన్నీరు పెడుతున్నారు. కొన్ని పునరావాస కేంద్రాల్లో టిఫిన్‌, భోజనం ఏదైనా బాధితులకు చాలడం లేదు. గంటలకొద్దీ క్యూలో నిల్చున్నా ఆహారం అయిపోయిందని చెప్పి సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. పిల్లలు, వృద్ధులైతే ఆకలికి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ‘‘మేమంటే ఆకలికి తట్టుకుంటాం. పిల్లలెలా తట్టుకోగలరు? సరైన తిండి దొరక్క వారు ఆకలితో అలమటిస్తున్నారు. ఉప్మా తెచ్చారు.. కాసేపటికే అయిపోయిందన్నారు. ఎవరికి పెట్టారో తెలియదు. అడిగితే మళ్లీ వస్తుందని చెబుతున్నారు. రాత్రి భోజనం విషయంలో కూడా ఇలాగే చేశారు. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.


రొట్టెలిచ్చి తినండి అంటున్నారు. వరద ముంచెత్తి కష్టాల్లో ఉన్న మా పట్ల ఇలానేనా వ్యవహరించేది?’’ కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని నన్నపనేని మోహన్‌ జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన  పునరావాస కేంద్రంలో ఆశయ్రం పొందుతున్న మాణిక్యం జ్యోతి అనే వరద బాధతురాలి ఆవేదన ఇది. ఈ పునరావాస కేంద్రంలో  మంగళవారం అల్పాహారంలో భాగంగా ఉప్మా సిద్ధం చేయగా సరిపోకపోవడంతో బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఆకలితో ఉన్న మిగిలిన వారి కోసం ఉప్మా తెప్పించేందుకకు ప్రయత్నించగా సాధ్యపడకపోవడంతో రొట్టెలు తెప్పిస్తామని చెప్పారు. దీంతో బాధితుల అసహనం అగ్రహంగా మారింది.  ‘ఏం తినాలి. పిలగాళ్లకు ఏం పెట్టాలి? ఉప్మా వచ్చిందన్నారు.. అయిపోయిందన్నారు. ఆ ఉప్మాను ఎవరికి పెట్టారు? లైన్లో నిల్చొని రెండుగంటలైంది.


ఇంతోటి దానికి లైన్లో నిల్చోవాలా? దుకాణానికి పోతే ఆ రొట్టె మాకు దొరకదా? ఈ రొట్టె కోసమేనా మమ్మల్ని ఇక్కడకు తీసుకొచ్చింది?’ అంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  తర్వాత ఉప్మా తెప్పించినా దానిని పంపిణీ చేసే సమయంలో ఆంక్షలు పెట్టడంతో చాలా మంది కోపోద్రిక్తులై అక్కడి నుంచి వెళ్లిపోయారు. సోమవారం రాత్రి భోజన సమయంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైతే రాత్రి పది గంటల వరకు భోజనాల పంపిణీ ప్రక్రియ సాగిందని కొందరు అధికారులే పేర్కొనడం గమనార్హం. మరోవైపు.. కొత్తగూడెం ప్రాంతంలో భారత వాయుసేన బృందం సహాయక చర్యలు చేపడుతోందని కేంద్రం పేర్కొంది. చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల్లో హెలికాప్టర్‌ ద్వారా 790 కిలోల సామాగ్రిని కిందికి వదిలారని ప్రకటనలో పేర్కొంది. 


నేలమట్టమైన ఇళ్లను చూసి.. 

గోదావరి వరదలతో సర్వం కోల్పోయిన బాధితుల ఆవేదన అంతా ఇంతా కాదు. ఇళ్లు కూలి.. వస్తువులు కొట్టుకుపోయి.. కట్టుబట్టలతో మిగితామని.. తమెకవరు దిక్కు అంటూ బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వర్షాలు ఆగిపోయి.. వరద తగ్గడంతో పునరావస కేంద్రాల నుంచి తిరుగుముఖం పట్టిన బాధితులు. నేలమట్టమైన ఇళ్లను చూసుకొని భోరుమంటున్నారు. గోదావరి వరద చర్ల మండలంలో సుమారు 25 గ్రామాలను ముంచెత్తింది. వీటిలో కొన్ని గ్రామాల్లో ఇళ్లన్నీ పూర్తిగా మునిగిపోగా మరికొన్ని గ్రామాల్లో సగం ఇళ్లు నీట మునిగాయి. మండల వ్యాప్తంగా 1,311 కుటుంబాలకు చెందిన 4,490మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఏ గ్రామంలో చూసినా సుమారు 60నుంచి 80ఇళ్లు నేలకూలాయి.  వరద తగ్గిన తర్వాత ఏ ఇంట్లో చూసినా బురద తప్ప ఏమీ కనిపించడం లేదు.


ఇళ్లల్లోని వస్తువులు కొట్టుకుపోవడంతో ప్రతీ ఇంటికి సుమారు రూ.50వేల నుంచి రూలక్షకు పైగా నష్టం వాటిళ్లినట్లు తెలుస్తోంది. కట్టుబట్టలతో మిగిలామని.. కనీసం వండుకోవడానికి బియ్యం కూడా లేవని, అధికారులు పట్టించుకోవడంలేదని కొత్తపల్లి గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చర్ల మండలంలోని వరద బాదితుల్లో చాలా మందికి ప్రభుత్వం పంపిణీ చేసిన 25 కేజీల ఉచిత బియ్యం అందలేదు  ఇక ఇన్నాళ్లు వరద నీటిలో మునిగిన  అశ్వాపురం మండలంలోని బట్టామల్లయ్యగుంపు, పాములపల్లి, కుమ్మరిగూడెం, నెల్లిపాక, చింతిర్యాల గ్రామాల్లోకి ఇప్పుడిప్పుడే బాధితులు వెళుతున్నారు. బురద పేరుకుపోయిన ఇళ్లను చూసి ఆవేదన చెందుతున్నారు. తాగునీరు, విద్యుత్తు వసతి లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. నెల్లిపాకలో డేగల సత్యవాణి అనే జాలరి ఇల్లు ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయింది. బట్టామల్లయ్య గుంపులో భుజంగరావుకు చెందిన 40బస్తాల ధాన్యం కొట్టుకుపోయింది. పాములపల్లిలో జానకిరావుకు చెందిన పది క్వింటాళ్ల బియ్యం తడిసిపోయింది. 


ఆ రెండు జిల్లాల్లో ఇంకా.. 

కొత్తగూడెం జిల్లాలోనే కాదు వర్షాలు, వరదలు మిగిల్చిన నష్టం నుంచి ప్రజలు ఇంకా కోలుకోవడం లేదు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో నీట మునిగిన మంచిర్యాల, నస్పూర్‌, చెన్నూర్‌, గోదావరిఖని, మంథనిలోని పలు కాలనీ వాసులు ఇళ్లకు వెళుతున్నారు. కాలనీల్లో, ఇళ్లలో బురరద పేరుకుపోవడం, ఆ పరిసరాలు కంపుకొడుతుండటంతో శుభ్రం చేసుకుంటున్నారు. ఇళ్లను శుభ్రం చేసుకునేందుకు రెండు, మూడు రోజుల సమయం పడుతోంది. ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్‌ తదితర విద్యుత్తు ఉపకరణాలు పాడైపోయాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ నగర్‌, ఎల్‌ఐసీ కాలనీ, రాంనగర్‌, పాత మంచిర్యాల, సాయికుంట రెడ్డి కాలనీ, ఒడ్డెర కాలనీ, ఇందిరానగర్‌ కాలనీల ప్రజలు ఇళ్లకు చేరుతున్నా.. చాలా ఇళ్లలో పొయ్యి వెలిగే పరిస్థితి లేదు. ఆదిలాబాద్‌ జిల్లాలో 50కిపైగా గిరిజన గ్రామాలకు విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. నిర్మల్‌ జిల్లాలో ముంపునకు గురైన 19 గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 


భద్రాద్రిని వీడని వరద నీరు 

వరద తగ్గినా భద్రాచలాన్ని వరద నీరు వీడటం లేదు. విస్తాకాంప్లెక్స్‌, చప్టా దిగువన అన్నదానసత్రం, కల్యాణమండపం రోడ్డు, చప్టా దిగువ తదితర ప్రాంతాల్లోని ఇళ్లు వారం రోజులుగా నిటమునిగే ఉన్నాయి. నీటి పారుదల శాఖ అధికారులు సింగరేణి నుంచి 1080 హార్స్‌ పవర్స్‌తో కూడిన 16 మోటార్లు తెచ్చి నీటిని తోడుతున్నారు. దీనికి తోడు 1000 హార్స్‌పవర్‌ గల ఇంకొన్ని మోటార్లు తెచ్చి నీటిని తోడుతున్నారు. ఈ ప్రాంతాలన్నీ రోజుల తరబడి నీళ్లలో ఉండటంతో ఇళ్లు నీరుపట్టాయని.. కూలిపోయే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 


అంత్యక్రియలకూ తిప్పలు 

  గోదావరి వరదలతో చాలా చోట్ల వైకుంఠధామాలు నీట మునగడంతో అంత్యక్రియలకు ఇబ్బందులెదురవుతున్నాయి. కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడులో మూడు రోజుల క్రితం నాటు పడవ బోల్తా పడటంతో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతిచెందగా వరద కారణంగా ఆ శివార్లో ఎక్కడా అంత్యక్రియల నిర్వహణ సాధ్యపడలేదు. ఫలితంగా గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలోని లక్ష్మీపురం గ్రామానికి  చెందిన శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిపారు.  బూర్గంపాడుకే చెందిన అంజనరావు అనే ప్రభుత్వ ఉద్యోగి అనారోగ్యంతో మృతి చెందగా సోమవారం ఆయన ఆంత్యక్రియలను 7 కిలోమీటర్ల దూరంలోని మోరంపల్లిబంజర గ్రామంలోని శ్మశానవాటికలో జరిపారు. బూర్గంపాడు గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నేత కన్నెబోయిన వెంకన్న(48)  మృతి చెందితే ఆయన అంత్యక్రియలు కూడా మోరంపల్లిబంజర గ్రామ శ్మశానవాటికలోనే జరపాల్సి వచ్చింది. 


బాత్‌రూమే ఇల్లు 

వికారాబాద్‌ జిల్లా పూడూర్‌ మండలం కంకల్‌ గ్రామంలోని దళితుడైన గోనె కుమార్‌కు చెందిన చిన్న పెంకుటిల్లు కూలిపోయింది. పక్కనే ఉన్న బాత్‌రూంలో  ఇప్పుడు ఆయన.. తన భార్య, చిన్న కూతురుతో  కలిసి ఉంటున్నాడు. ప్రభుత్వం తనకు డబుల్‌ బెడ్‌ రూం ఇవ్వలేదని, దళితబంధు కూడా రాలేదని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. 

Updated Date - 2022-07-20T10:09:14+05:30 IST