హా.. హా..క్సిజన్‌

ABN , First Publish Date - 2021-05-07T17:08:33+05:30 IST

అనంతపురం జిల్లాలో..

హా.. హా..క్సిజన్‌

ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు ఆక్సిజన్‌ కొరత 

సరిపడా సరఫరా చేయని ప్రభుత్వం

బాధితులను పంపించేస్తామంటున్న ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు

గాల్లో దీపాల్లా కరోనా బాధితుల ప్రాణాలు

దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు


ఆంధ్రజ్యోతి-విజయవాడ: అనంతపురం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోయారు.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆక్సిజన్‌ నిల్వలు నిండుకోవడంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న బాధితులను తీసుకుపోవాలంటూ కుటుంబ సభ్యులపై ఆసుపత్రి నిర్వాహకులు ఒత్తిడి తెచ్చిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. సరిగ్గా ఇలాంటి పరిస్థితులే కృష్ణాజిల్లాలోనూ నెలకొన్నాయి. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు అనేక ప్రైవేటు ఆసుపత్రులకు ఎడాపెడా అనుమతులు ఇచ్చేస్తున్న ప్రభుత్వం వాటికి అవసరమైన ఆక్సిజన్‌ సరఫరాలో విఫలమవుతోంది. దీంతో అక్కడ చికిత్స పొందుతున్న బాధితుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి. 


విజయవాడ బందరురోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 40మందికి పైగా కరోనా బాధితులు ఆక్సిజన్‌పైనే చికిత్స పొందుతున్నారు. బుధవారం ఉదయానికి రావాల్సిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ రాలేదు. ఆక్సిజన్‌ నిల్వలు మధ్యాహ్నం వరకే సరిపోతాయి. నిర్వాహకులు మార్కెట్‌లో సిలిండర్లు కొనుగోలుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం లేక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆక్సిజన్‌ అందించకపోతే బాధితులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడటంతో ఆసుపత్రి వర్గాలు, బాధితులు, కుటుంబ సభ్యుల్లో ఒకటే ఉత్కంఠ. సంఘటన గురిం చి తెలుసుకున్న పెనమలూరు పోలీసులు హుటాహుటిన నాలుగు ఆక్సిజన్‌ సిలిండర్లు తీసుకొచ్చి నిర్వాహకులకు అందజేయడంతో తాత్కాలికంగా ఉత్కంఠకు తెరపడింది. అయితే అవి కేవలం 3 గంటల వరకే సరిపోతాయని, ఈలోగా ట్యాంకరు రాకుంటే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని చెప్పడంతో బాధితులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. ఈలోపు ఆక్సిజన్‌ ఆ్యంకర్‌ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. లేకుంటే భారీమూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది. జిల్లాలోని ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రులు నిండిపోవడంతో దశల వారీగా 73 ప్రైవేటు ఆసుపత్రులకు అధికారులు అనుమతులు ఇచ్చారు. 4,600 పైగా బెడ్స్‌ను కేటాయించారు. వీటిలో ఐసీయూ, వెంటిలేటర్‌ బెడ్స్‌పై చికిత్స పొందుతున్న బాధితులకు సరిపడినంతగా ఆక్సిజన్‌ సరఫరా చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ తామేం చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారంటూ ఆసుపత్రుల నిర్వాహకులు వాపోతున్నారు. 


ఊపిరి ఆడక.. 

కరోనా వైరస్‌ ప్రధానంగా శ్వాసక్రియ వ్యవస్థను దెబ్బతీస్తుండటంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి బాధితులు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. మృత్యువుతో పోరాడుతున్న బాధితుల ప్రాణాలు ఇప్పు డు ప్రాణవాయువుపైనే ఆధారపడి ఉన్నాయి. గంటల్లోనే ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోతున్న బాధితులను వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసి ఆక్సిజన్‌ అం దిస్తే ప్రాణాలు నిలబడే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్‌కు ఎన్నడూ లేనివిధంగా డిమాండ్‌ ఏర్పడటంతో అనేకమంది బాధితులకు ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. 


ప్రభుత్వ నిర్వాకం వల్లే.. 

జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల నిర్వాహకులు తమ అవసరాలకు సరిపడగా ఆక్సిజన్‌ను సప్లయిర్స్‌ నుంచి నేరుగా తీసుకునేవారు. ప్రస్తుతం ఆక్సిజన్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడటంతో ప్రైవే టు సప్లయర్స్‌ ఇష్టానుసారంగా ఆక్సిజన్‌ను అమ్ముకునే వీల్లేకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు ప్రభుత్వమే ఆక్సిజన్‌ కేటాయిస్తుంది. కానీ అవసరమైనంత ఆక్సిజన్‌ను సరఫరా చేయకపోవడంతో ఆసుపత్రుల యాజమాన్యాలు దినదినగండంగా రోజులు నెట్టుకువస్తున్నాయి. పెద్ద కార్పొరేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు ఏదోవిధంగా ఆక్సిజన్‌ సమకూర్చుకుంటున్నప్పటికీ.. ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్స్‌, చిన్నచిన్న ఆసుపత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్స్‌లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు ఆక్సిజన్‌ సరఫరా లేకపోవడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 


రూ. 210 సిలిండరు రూ. 1000 పైనే.. 

మార్కెట్‌లో ప్రైవేట్‌ ఆక్సిజన్‌ డీలర్ల దగ్గర సిలిండర్లు కొనుగోలు చేద్దామంటే వారు రూ. 210 ల సిలిండరును ఏకంగా రూ. 1000 లకు పెంచేశారు. ఎంతైనా ఖర్చు పెట్టి కొని బాధితుల ప్రాణాలను కాపాడదామన్నా సిలిండర్లు దొరకటం లేదు. ప్రభుత్వ ఏజెన్సీలు, అధికారులు యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్‌ సరఫరా చేయకపోతే బాధితుల ప్రాణాలకు ముప్పు తప్పదని వాపోతున్నారు. దీంతో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు బాధితులను డిశ్చార్జి చేసేసే ప్రయత్నాల్లో ఉన్నారు. లేదంటే ఆక్సిజన్‌ తెచ్చుకోండి చికిత్స చేస్తాం అని మాట్లాడుతున్నారు. ఇలా బాధితులను డిశ్చార్జి చేసేస్తే.. వారందరికీ ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్స్‌ సమకూర్చే పరిస్థితి లేదు. ఎప్పుడు ఎలాంటి వార్తలు వినాలోనని అందరూ భయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా అధికారులు యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్‌ సరఫరా చేసి బాధితుల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Updated Date - 2021-05-07T17:08:33+05:30 IST