ఉపశమనమేది ?

ABN , First Publish Date - 2020-08-09T11:58:35+05:30 IST

కరోనా బాధితులకు ఉపశమనాన్ని ఇచ్చే అంశాలపై ఎవరూ దృష్టిసారించడం లేదు.

ఉపశమనమేది ?

 ఐసోలేషన్‌ కేంద్రంలో ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత

తాగునీరు, ఆహారం అంతంత మాత్రమే

హమీగానే మిగిలిన కొవిడ్‌ పరీక్ష కేంద్రం

పాజిటివ్‌ బాధితుల ఆవేదన


గూడూరు, ఆగస్టు 8 :  కరోనా బాధితులకు ఉపశమనాన్ని ఇచ్చే అంశాలపై ఎవరూ దృష్టిసారించడం లేదు.  ప్రభుత్వ అధికారులు సైతం దాటవేసే ధోరణిలోనే ఉంటున్నారేతప్ప  సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గూడూరు  ఏరియా ఆసుపత్రిలో  ఆక్సిజన్‌ సిలిండర్లు కొరత నెలకొంది. ఆసుపత్రిలో చిన్న ఆక్సిజన్‌ సిలిండర్లు 16 ఉన్నాయి. పెద్ద ఆక్సిజన్‌ సిలిండర్లు ఆరు ఉన్నాయి. అయితే గాంధీనగర్‌లోని ఐషోలేషన్‌ కేంద్రంలో సిలిండర్లు అందుబాటులో లేవు. దీంతో పాజిటివ్‌ బాధితుడి పరిస్థితి విషమిస్తే అందుబాటులో ఉన్న రెండు మొబైల్‌ సిలిండర్లు వినియోగించే అవకాశం ఉంది. బెడ్‌లు మాత్రం 512 ఉండగా అందుకు అనుగుణంగా ఆక్సిజన్‌ సిలిండర్లు లేవు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆందోళన బాధితుల్లో వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో దాతలు సైతం ఆక్సిజన్‌ సిలిండర్లు అందజేసి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. అవసరమైన మేర ఆక్సిజన్‌ సిలిండర్లు ఉంటే ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు సైతం అంటున్నారు.


వసతుల మృగ్యం

 గాంధీనగర్‌లోని ఐషోలేషన్‌ కేంద్రంలో వసతులు లేవని బాధితులు ఆవేదన చెందుతున్నారు. వేళకురాని ఆహారంతో పాటు తాగునీరు సైతం సక్రమంగా లేవని బాధితులు వాపోయారు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. ఒక వైపు వైరస్‌ సోకి తాము ఆందోళన  చెందుతుంటే మరోవైపు వసతులు లేమి తమను  మరింత  ఆవేదనకు గురిచేస్తున్నద న్నారు.  ఇదేమని అడిగితే గూడూరులో వైద్యాధికారులు సరైన సమాధానం ఇవ్వకుండా  దాట వేస్తున్నారని పేర్కొన్నా రు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని స్థితి ఏర్పడిం దన్నారు.


హమీగానే పరీక్ష కేంద్రం

గూడూరులో కొవిడ్‌-19 పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తామన్న   ప్రభుత్వం ఇచ్చిన హమీ ఇంతవరకు నేరవేరలేదు. ఇక్కడ పరీక్షలు చేయించుకున్న వారు పాజిటివ్‌వో, నెగెటివ్‌వో తెలుసుకునేందుకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అయితే శాంపిల్స్‌ తీసుకునే వరకు సిబ్బంది ఉంటున్నారే కానీ ఆ తరువాత రోజుల తరబడి ఫలితాలు చెప్పే వారే లేకుండా పోయారని  వారంటున్నారు. వెంటనే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని వారు కోరారు.


కలెక్టర్‌కు నివేదిస్తాం.. పాశిం సునీల్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే, గూడూరు

 గూడూరులో కొవిడ్‌ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హమీని నెరవేర్చాలి. పేదలకు సమాధానం చెప్పేలా వైద్యాధికారులు వ్యవహరించాలి. ఆక్సిజన్‌ సిలిండర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. ఈ అంశాలను కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళతాం.

Updated Date - 2020-08-09T11:58:35+05:30 IST