Advertisement
Advertisement
Abn logo
Advertisement

హైవే విస్తరణ పనులకు కంకర కొరత

- 60కి.మీ.ల దూరం నుంచి కంకర రవాణా

- మైనింగ్‌ పాలసీపైన ప్రభుత్వం స్పష్టతనివ్వకపోవడమే కారణం

- ఇప్పటికీ పెండింగ్‌లోనే క్వారీ అనుమతులు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): మంచిర్యాల-చంద్రాపూర్‌ జాతీయ రహదారి విస్తరణ పనులకు కంకర కొరత గుదిబండలా తయారయ్యింది. ఈ రహదారి నిర్మాణ పనులను దక్కించుకున్న సంస్థ ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న గుండి గ్రామంలో గుట్ట నుంచి రోడ్డు నిర్మాణానికి అవసరమైన కంకరను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు క్వారీ తవ్వకాల కోసం మైనింగ్‌ శాఖకు లీజు కోసం దరఖాస్తు చేసింది. గతేడాదిగా ఈ దరఖాస్తు ప్రభుత్వం వద్దే పెండింగ్‌లో ఉంది. దీంతో నిర్మాణ పనుల పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్టు మారింది. 96కి.మీ.ల నిడివిలో మంచిర్యాల నుంచి వాంకిడి మండలం గోయగాం సరిహద్దుల వరకు విస్తరించనున్న ఈ జాతీయ రహదారి విస్తరణ పనులను జాతీయ రహదారుల సంస్థ రెండు భాగాలుగా విభజించి టెండర్ల ప్రక్రియను నిర్వహించింది. హైబ్రిడ్‌ యాన్యూటి మాడల్‌(హామ్‌) పద్ధతిలో నిర్వహించనున్న ఈ రహదారి పనులకు మంచిర్యాల నుంచి రేపల్లెవాడ వరకు ఒక సంస్థకు అప్పగించింది. రేపల్లెవాడ నుంచి వాంకిడి మండలం గోయగాం వరకు 56కి.మీ.ల నిడివిలో టీబీబీఎల్‌ సంస్థ పనులు నిర్వహిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిన నాటి నుంచే ఆసిఫాబాద్‌ జిల్లాలో కంకర ప్రధాన సమస్యగా మారింది. రోడ్డు నిర్మాణానికి అవసరమైన నాణ్యత గల కంకర జిల్లాలో అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్‌ గుండి శివారులో ఉన్న దేవుని గుట్టపై నిర్మాణానికి సరిపడా పరిమాణంలో కంకర లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని గుర్తించారు. దాంతో నిర్మాణ సంస్థ క్రషింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు రైతులతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. అయితే కంకరను వెలికితీసేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ మైనింగ్‌ పాలసీకి సంబంధించి ఇప్పటివరకు స్పష్టత రాకపోవడంతో మైనింగ్‌శాఖ మెటల్‌ తవ్వకాలకు అనుమతిని ఇవ్వలేదు. ఫలితంగా నిర్మాణ పనులకు కంకర ప్రధాన సమస్యగా మారింది. దీంతో గుత్తేదారు కౌటాల ప్రాంతంలోని క్వారీలనుంచి లీడ్‌ను తరలించాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడనుంచి తరలిస్తున్న మెటల్‌తో చిన్నచిన్న స్ట్రక్చర్ల పనులు జరుగుతున్నాయి. దాంతో పాటు ఇక్కడి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా నల్ల మట్టిని తీసివేసి మొరంతో పునాది పటిష్టం చేసే నిర్మాణాలు చేపట్టారు. అయితే నిర్మాణ పనుల వేగం పెరిగితే కౌటాల నుంచి 60కి.మీ.ల దూరం లీడ్‌ను రవాణా చేయడం సాంకేతికంగా సమస్యలను సృష్టించే పరిస్థితి ఉందంటున్నారు. ఇటీవల ప్రభుత్వం మైనింగ్‌ పాలసీపై సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసినప్పటికీ పూర్తిస్థాయిలో స్పష్టత వస్తే తప్ప గుండిలో క్వారీ ప్రారంభమయ్యే పరిస్థితి లేదు. ఇక్కడి మెటల్‌ అందుబాటులోకి వస్తేతప్ప రోడ్డు పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు. 

51ఎకరాల్లో నాణ్యమైన కంకర..

జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టిన డీబీఎల్‌ సంస్థ చేయించిన సర్వేలో గుండి గుట్ట విస్తరించి ఉన్న మొత్తం 200ఎకరాల్లో సుమారు 51ఎకరాల్లో రోడ్డు నిర్మాణానికి కావ లసిన నాణ్యత కలిగిన కంకర విస్తరించి ఉన్నట్లు నిపుణులు తేల్చారు. దీంతో నిర్మాణ సంస్థ ఇక్కడ క్రషర్‌ ఏర్పాటు చేసేందుకు లీజుల కోసం ఐదు దరఖాస్తులు చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆ ప్రాంతంలో క్రషర్ల ఏర్పాటుకు యంత్రాలను దిగుమతి చేసి బిగించేందుకు సిద్ధంగా ఉంచింది. అంతేకాదు, తవ్విన మెటీరియల్‌ను నిల్వ చేసేందుకు డంప్‌యార్డు కోసం రైతుల నుంచి మూడు సంవత్సరాలకు లీజు ప్రాతిపదికపై భూమిని కూడా సేకరించి సిద్ధంగా ఉంచుకుంది. ప్రభుత్వ అనుమతి రావడమే తరువాయి తవ్వకాలు జరిపేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు.

Advertisement
Advertisement