మామిడి ఎగుమతులపై కొరవడిన అవగాహన

ABN , First Publish Date - 2022-05-27T06:03:49+05:30 IST

కొవిడ్‌ కారణంగా మన దేశం నుంచి రెండేళ్లుగా మామిడి ఎగుమతులు ఆగిపోయాయి. ఈ ఏడాది అమెరికా మార్కెట్‌లోకి మామిడి ఎగుమతులకు ఆ దేశ వ్యవసాయ మంత్రిత్వ శాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో మన ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుందని...

మామిడి ఎగుమతులపై కొరవడిన అవగాహన

కొవిడ్‌ కారణంగా మన దేశం నుంచి రెండేళ్లుగా మామిడి ఎగుమతులు ఆగిపోయాయి. ఈ ఏడాది అమెరికా మార్కెట్‌లోకి మామిడి ఎగుమతులకు ఆ దేశ వ్యవసాయ మంత్రిత్వ శాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో మన ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుందని రైతులు సంబరపడ్డారు. కానీ వాతావరణ పరిస్థితులు, గాలివాన ప్రభావంతో మామిడి పంట 25 శాతం మాత్రమే చేతికందింది. ఫలితంగా మామిడి ధరలు ఆకాశాన్నంటాయి. సాధారణంగా జూన్‌ నెలలో మామిడికాయలు పక్వానికి వస్తాయి. ఇమాంపసంద్‌ (హిమాయత్‌), బేనీషా, ఆల్ఫోన్‌జో (బాదామి), మల్లిక, సువర్ణరేఖ వంటి రకాల పట్ల విదేశీయులు ఆసక్తి చూపుతున్నారు. అమెరికా, యూరప్‌, జపాన్‌, కెనడా, న్యూజిలాండ్‌, సింగపూర్‌, మలేసియా దేశాల్లో మన మామిడికి గిరాకీ ఉంది. కానీ నాసిరకం కాయల వల్ల మామిడి ఎగుమతికి గండి పడింది. అమెరికాకు ఎగుమతి చేసే మామిడి కాయల్ని చీడపీడలు లేకుండా క్యాన్సర్‌ నివారణకు అనుసరించే ఇరాడియేషన్‌ (ఐ.టి) పద్ధతిలో ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలి. ప్రస్తుతం ఈ ట్రీట్‌మెంట్‌ దేశం మొత్తంలో రెండు, మూడు కేంద్రాలకు మాత్రమే పరిమితమయింది. ఆంధ్రప్రదేశ్‌లో మామిడి అధికంగా ఉత్పత్తి అవుతున్నందున దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రబిందువైన తిరుపతిలో ఐ.టి. కేంద్రం నెలకొల్పాలి. జపాన్‌, యూరోపియన్‌ దేశాలు వేపర్‌హీట్‌ ట్రీట్‌మెంట్‌ (ప్రత్యేక ఆవిరిశుద్ధి) విధానంతో మామిడికాయలు స్వీకరిస్తుండగా, మలేసియా, సింగపూర్‌ వంటి దేశాలు హాట్‌వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ద్వారా 48 డిగ్రీల వేడినీళ్లలో 20 నిమిషాల పాటు ఉంచిన కాయల్ని ఆమోదిస్తున్నాయి. విదేశాల్లో మన మామిడికి స్థానిక ధరలపై 10 రెట్లు అధికంగా లభిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కానీ ఎగుమతిదార్లు తోటల్లో రంగు, సైజు ఉన్న నాణ్యమైన కాయలకు టన్ను ఒకటికి స్థానిక ధరపై అదనంగా ఐదువేల రూపాయలు మాత్రమే చెల్లించి అధికలాభాలు గడిస్తున్నారు. 


మామిడిని ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం లేదు. రైతులు సొసైటీలుగా ఏర్పడి ఎగుమతి చేయాలంటే ప్రభుత్వం వారికి సరియైన అవగాహన కల్పించి, ప్రోత్సాహకాలు అందజేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు మామిడి అధికోత్పత్తితో పాటు, చీడపీడలులేని నాణ్యమైన దిగుబడి సాధించేలా ఉద్యానశాఖ కృషి చేయాలి. రైతులు స్వయంగా మామిడికాయల్ని ఎగుమతి చేసి లబ్ధిపొందేలా అవగాహన కల్పించాలి. రైతుల ఆదాయాన్ని పెంచడంలో ప్రధానపాత్ర పోషిస్తున్న ఉద్యాన పంటల అభివృద్ధికి నేషనల్‌ హార్టికల్చర్‌ మిషన్‌ తోడ్పడాలి.

గుండాల రామకృష్ణయ్య

Updated Date - 2022-05-27T06:03:49+05:30 IST