Abn logo
Sep 26 2021 @ 00:50AM

మేధావుల్లోనూ అవగాహనారాహిత్యమా!

వార్తలలో ఘటనలు, విశేషాలు ఉన్నప్పుడు కాస్త భావస్ఫోరకంగా చెప్పవచ్చు. కానీ తామే సంచలనాన్ని సృష్టిస్తున్నట్లు వార్తలను ప్రజల ముందుంచడం, వార్తావిశేషాల కార్యక్రమాలను రూపొందించడం వంటి పనులు టీఆర్పీ రేటింగ్‌కు ఉపయోగపడతాయని భావిస్తున్నవారు భాషకు జరిగే నష్టాన్ని తెలుసుకోవడం లేదు. తెలుగు భాష పట్ల ప్రభుత్వానికి, తెలుగు సమాజానికి బాధ్యత ఉన్నట్లే పత్రికల వారికీ, దృశ్యమాధ్యమాల వారికీ బాధ్యత ఉంది. దాన్ని ఛానెళ్ళు విస్మరించకూడదు.


ఈనెల 12వ తేదీన ‘భాషానిష్ఠలేని తెలుగు ఛానళ్ళు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో రాసిన వ్యాసానికి ప్రతివాదంగా గోవిందరాజు చక్రధర్ వ్యాసం 19వ తేదీన వచ్చింది. నేటి ఛానళ్ళలో ఇంగ్లీషుమయంగా వస్తున్న వార్తలను, వాటిని నాటకీయంగా, ప్రదర్శనాత్మకంగా అందించడాన్ని ఆయన సమర్థించారు. ఈ దృష్ట్యా ఆయన ఆలోచనలపై తిరిగి రాయవలసిన అవసరం ఏర్పడింది. కోస్తాఆంధ్ర ప్రాంతపు మాండలిక భాష ప్రామాణిక భాష ఎందుకు అయిందో ఇతర మాండలికాలు ఎందుకు కాలేదో చక్రధర్‌ సరిగ్గానే అంచనా వేశారు. అయితే ఇటీవలి కాలంలో తెలుగు ఛానళ్లలో భాష పట్ల శ్రద్ధ చూపకపోవడం వార్తారచన, వార్తా నివేదనలో విచ్చలవిడిగా అవసరానికి మించి ఇంగ్లీషు వినియోగించడం, అదే ఫేషన్ అనుకునేలా వార్తలను, ఇతర కార్యక్రమాలను యాంకరీమణులు వీక్షకులముందు ప్రదర్శించడం ఆయనకు సమర్థనీయంగా ఎందుకు  అనిపించిందో ఆశ్చర్యంగా ఉంది. ఇటీవలి కాలంలో మాధ్యమాలలో కనబడుతున్న భాషా అశ్రద్ధ వల్ల తెలుగుకు రాబోయే ప్రమాదం గురించి కానీ, నేటి భాషాచాలనం పరిస్థితి గురించి కానీ చక్రధర్‌కు అర్థం కాలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ సందర్భంగా సామాజికభాషాశాస్త్రం చెప్పే కొన్ని ఆలోచనలను ఇక్కడ ప్రస్తావించాలి. ఏ భాషకు కూడా అంతర్గతంగా గొప్ప, తక్కువ అనే విలువలు ఉండవు. మనుషులు లేదా ఆయా సమాజాలే ఆయా భాషలకు విలువలను తెస్తాయి, ఆపాదిస్తాయి. పైన చక్రధర్ చెప్పిన ప్రామాణిక భాషగా ఒక మాండలికం కావడం, మరొకటి కాకపోవడం అలాంటిదే.


రెండు భాషాసమాజాలు ఒక చోట కలిసి జీవించేటప్పుడు ఆ రెండు భాషల పదాలు కలిసిపోతాయి. భారతీయ భాషలలోని ఒక భాష పదాలు మరొక భాషలో ఉండడానికి కారణం ఇదే. కానీ ఇంగ్లీషు పదాలు చేరడానికి భిన్నమైన చరిత్ర ఉంది. ఇక్కడ ఇంగ్లీషు ప్రజలు మనతో కలిసి నివసించలేదు. ఇక్కడికి వచ్చిన అధికారుల ద్వారా అది అధికార భాషగా ఎన్నో దశాబ్దాలు ఉండడం వల్ల, ఇంగ్లీషు చదువుల వల్ల విద్యావంతుల భాషలో అది చేరింది. రేడియో మాధ్యమం, పత్రికల ద్వారా ఐదారు దశాబ్దాల క్రితమే ఇంగ్లీషు పదాలు తెలుగులో చేరాయి. తెలుగులో ప్రజల వ్యవహారంలో స్థిరపడిన ఇంగ్లీషు పదాలతో కలిపి వార్తలు చెప్పవద్దని, ప్రసారం చేయవద్దని నేను కానీ మరొకరు కానీ చెప్పడం లేదు. కానీ టీవీ మాధ్యమంలో ఇలా ప్రజల వ్యవహారానికి మాత్రమే పరిమితమై వార్తలు రూపొందడంలేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో కొత్త సాంకేతిక విజ్ఞానం కొత్త ప్రసారసాధనాల ద్వారా అతివేగంగా వార్తలు అందడం కారణంగా ప్రతిరోజు కొన్ని వందల ఇంగ్లీషుపదాలు అంతర్జాతీయ సమాజం నుంచి తెలుగు ఇతర భారతీయ భాషలలోనికి వస్తున్నాయి. 


ఒక ఉదాహరణ చూద్దాం. కరోనా వచ్చింది. కరోనా చుట్టూ ఎంతో పదజాలం ఇంగ్లీషు నుంచి ఇతర భారతీయ భాషలలోకి వచ్చింది. కరోనా అనేది ఒక జబ్బుపేరు. దాన్ని అలాగే వాడదాం. కానీ ఐసోలేషన్, హోమ్ ఐసోలేషన్, క్వారంటైన్, వ్యాక్సినేషన్, వ్యాక్సిన్, మ్యుటేషన్, డబుల్ మ్యుటేషన్, డోస్, ఫస్ట్‌వేవ్, సెకండ్‌వేవ్, పాండమిక్.. ఇలా ఇంకా చాలా పదాలు మొట్టమొదటగా వార్తాసంస్థలకే చేరతాయి. వాటి ద్వారా టీవీ మాధ్యమాల నుంచి, పత్రికల నుంచి ప్రజలకు చేరతాయి. కానీ ఇలా ప్రతిరోజు వచ్చే ఇంగ్లీషుపదాలు అన్నింటిని ప్రజలకు బట్వాడా చేసే మాధ్యమాలు ప్రధానంగా టీవీ ఛానెళ్ళు. ఇవి తెలుగులో వార్తలు అందించాలని అనుకుంటే ఈ పదాలను ఎంతవరకు వీలైతే అంతవరకు తెలుగులోనికి అనువదించి వార్తలలో అందించాలి. కరోనా పదాన్ని అనువదించమనడం లేదు. జనవ్యవహారంలో ఎప్పుడో స్థిరపడిన పదాల గురించి మనం ఇక్కడ మాట్లాడడం లేదు, అలాంటి ఇంగ్లీషు పదాలను వాడవద్దని అనడం లేదు. కానీ కొత్తగా వస్తున్న సాంకేతికత, దానిచుట్టూ వచ్చిన పదాలను చాలావరకు అనువదించి ప్రజలకు అందించవచ్చు.


తమిళం, కన్నడం, కొంతవరకు హిందీ ఈ పని చేస్తున్నాయి. తమిళ పత్రికలు అనువాదం విషయంలో అనుమానం వస్తే అక్కడి తమిళ భాషాసంస్థలను సంప్రదిస్తాయని తెలిసింది. హిందీ వారు కూడా కేంద్రప్రభుత్వం సంస్థ CSTTని సంప్రదించే అలవాటుందని తెలుస్తోంది. కాని తెలుగు ఛానెళ్లు ఈ పని చేయడం లేదు, అలాంటి అధికారిక సంస్థలూ లేవు. వీలైనంత వరకు తమ వద్దకు వచ్చిన ఇంగ్లీషు పదాలను అనువాదం చేసే ప్రయత్నం చేయకుండా యథాతథంగా జనాలమీదికి తోసేస్తున్నారు. జనం వాటిని స్వీకరించి వాడుతున్నారు. దీన్ని చూసి చక్రధర్ లాంటి విద్యావంతులే జనంలో వాడుకలో ఉన్నవాటిని ఛానెళ్ళు వాడుతున్నట్లు భ్రమపడుతున్నారు. ఇది సరికాదు. వారి అవగాహన తప్పు. ప్రతి తెలుగు ఛానల్, ప్రతి తెలుగు పత్రికకు ప్రధానమైన జీవన వనరు తెలుగు భాష. కాబట్టి భాష పట్ల ఛానళ్లకు, పత్రికలకు బాధ్యత ఉంది. ఆధునిక భాషావికాసంలో వీటి పాత్ర చాలా ఉంది. కొత్తగా అంతర్జాతీయ సమాజం నుంచి మనకు చేరే పదాలను వార్తలలో వీలైనంతవరకు తెలుగులో అనువదించి ప్రజలకు అందించవలసిన బాధ్యత, తద్వారా భాషావికాసానికి తోడ్పడవలసిన బాధ్యత ఛానళ్లకు, పత్రికలకు ఉంది.


ప్రజల వ్యవహారంలో స్థిరపడిన ఇంగ్లీషు పదాలను ఇంకా ఇతర అన్యదేశ్యపదాలను వాడవద్దనే మూర్ఖత్వం ఏ భాషావేత్తకూ లేదు. ‘వెల్ కమ్ టు న్యూస్’, ‘షార్ట్‌బ్రేక్’, ‘వెల్‌కమ్ బ్యాక్’, ‘స్టేట్యూన్డ్’ అని తెలుగువార్తలు చెప్పే వారు జనవ్యవహారాన్ని చెబుతున్నారా? ఇలా అనమని జనం చెప్పారా? వీటికి తెలుగు పదాలు హాయిగా కొన్ని ఛానళ్ళు వాడుతున్నాయి కదా. ఇలా విచ్చలవిడిగా ఇంగ్లీషుపదాలు అవసరం లేని ప్రతిచోటా వాడడం, ఇదే ఫ్యాషన్ అనుకునేలా ప్రజలకు చెప్పడం, తప్పనిసరిగా వదిలివేయాలి. 


వార్తలలో ఘటనలు, విశేషాలు ఉన్నప్పుడు కాస్త భావస్ఫోరకంగా చెప్పవచ్చు. దాన్ని కాదనరు కానీ ఆ బాధను అంత విపరీతంగా నటించి చెప్పడం, కేకలు వేసినట్లు మాట్లాడడం, ఏదో తామే సంచలనాన్ని సృష్టిస్తున్నట్లు వార్తలను ప్రజల ముందుంచడం, వార్తావిశేషాల కార్యక్రమాలను రూపొందించడం వంటి పనులు టీఆర్పీ రేటింగ్‌కు ఉపయోగపడతాయి అని భావిస్తున్నారే కానీ, భాష పట్ల జరిగే నష్టాన్ని తెలుసుకోవడం లేదు. ఇక చక్రధర్ చేసిన గంగవ్వ ప్రస్తావన కొన్ని ఇతర అంశాలు అసందర్భాలు. అవగాహన లేకపోవడమే. పరిపాలనలో తెలుగు లేక చదువులోనూ తెలుగు లేకపోతే పది కోట్లమంది మాట్లాడే తెలుగు చచ్చిపోదు, నిజమే కానీ పది సంవత్సరాలలో తెలుగు చదవడం, రాయడం రాని తరం తయారవుతుంది. అప్పుడు తెలుగు పత్రికలు మూతపడవలసిందే.


తెలుగు ఛానళ్ల ఉనికి కూడా ఎలా ఉంటుందో అవి ఆలోచించుకోవాలి. కాబట్టి తెలుగు భాష పట్ల ప్రభుత్వానికి, తెలుగు సమాజానికి బాధ్యత ఉన్నట్లే పత్రికల వారికి, దృశ్యమాధ్యమాల వారికి బాధ్యత ఉంది. దాన్ని ఛానెళ్ళు విస్మరించకూడదు. మేధావులు ఈ వాస్తవాలను గ్రహించాలి.


-ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి