కార్మికుల.. సంక్షామం

ABN , First Publish Date - 2021-08-31T05:25:24+05:30 IST

రెండేళ్లుగా ఇసుక కష్టాలతో పనులు లేవు.. ఆపై కరోనా కష్టాలు.. మరోవైపు పెరిగిపోతున్న ధరలతో కార్మికుల కుటుంబాలు అల్లలాడిపోతున్నాయి.

కార్మికుల.. సంక్షామం

పాలకుల వాగ్దానాలు నీటిమూటలే

ఇతర అవసరాలకు సంక్షేమ నిధులు

సంక్షేమ బోర్డును రద్దు చేసిన ప్రభుత్వం 

రెండేళ్లుగా విడుదల కాని సంక్షేమ నిధులు

జిల్లాలో దాదాపు రూ.40 కోట్ల మేర బకాయిలు

ప్రభుత్వ చర్యలతో దిక్కుతోచని స్థితిలో కార్మిక కుటుంబాలు


కూలి పనులతో జీవనం సాగించే కార్మికుల సంక్షేమం మరిచారు. ఎన్నికలకు ముందు కార్మికుల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారింస్తామన్నారు.. గత పాలకులకంటే మెరుగ్గా కార్మికుల ఉన్నతికి పెద్దపీట వేస్తామని అధికారంలోకి వచ్చారు. ఇంకేం తమ జీవితాలు బాగుపడతాయని ఆశించిన కార్మికుల కుటుంబాలు  రోడ్డునపడ్డాయి. పాలకుల వాగ్దానాలు నీటిమూటలుగా మారాయి. సంక్షేమం అటుంచి.. కష్టం వచ్చినప్పుడు అక్కరకు వస్తాయని దాచుకున్న కార్మికుల సంక్షేమ నిధులు కూడా పక్కదారి పట్టాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వైపు నుంచి అండ దొరక్క.. సంక్షేమ నిధి అందుబాటులో లేక జిల్లాలోని వేలాది కార్మిక కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. 


4,800 దరఖాస్తుల పెండింగ్‌

కార్మిక కుటుంబాల్లోని పిల్లల పెళ్లిళ్లు, కాన్పులు, అనారోగ్యంతో పాటు 12 రకాల అవసరాలకు సంక్షేమ నిధి నుంచి కార్మికులకు చెల్లించాలి. ఇందుకు సంబంధించి జిల్లాలో 4,800 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పెండింగ్‌ దరఖాస్తులకు మోక్షం కలగాలంటే ఇప్పటికిప్పుడు రూ.8 నుంచి 10 కోట్లు కావాలి.  



గుంటూరు(తూర్పు), ఆగస్టు 30: రెండేళ్లుగా ఇసుక కష్టాలతో పనులు లేవు.. ఆపై కరోనా కష్టాలు.. మరోవైపు పెరిగిపోతున్న ధరలతో కార్మికుల కుటుంబాలు అల్లలాడిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో అసంఘటిత కార్మికుల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన పాలకులు.. ఆ విషయాన్ని మరిచారు. ఆపై వారు దాచుకున్న నిధులను కూడా పక్కదారి పట్టించేశారు. కార్మికుల సంక్షేమంపై రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా పాలకులు పట్టించుకోవడంలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. అసలు కార్మికుల సంక్షేమం మాటే ప్రస్తుత ప్రభుత్వం మరిచిందనే ఆరోపణలు కూడా కార్మిక వర్గాల నుంచి వస్తున్నాయి. కార్మికుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం కార్మిక సంఘ నాయకులు, ఆయా శాఖల అఽధికారులు, కార్మికులతో కలసి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డు ద్వారానే కార్మికులకు అవసరమైన నిధులను విడుదల చేసేవారు. వైసీపీ అధికారంలోకి రాగానే సంక్షేమ బోర్డును పూర్తిగా రద్దు చేసింది. దీంతో ఆగ్రహం చెందిన కార్మికులు, సంఘాల నాయకులు ఆందోళనలు చేశారు. కార్మిక శాఖ మంత్రి ఒక్కడే ఉండేలా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసింది. సంక్షేమ బోర్డు అంటే ఆయా శాఖల పరిధిలోని అందరూ ఉండాలి గాని ఒక్క వ్యక్తితో బోర్డును ఏర్పాటు చేయడం పైగా ఆయన కూడా మంత్రి కావడం విడ్డూరంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక కార్మిక సంక్షేమ నిధి కూడా పక్కదారి పట్టిందని కార్మికులు వాపోతున్నారు. వివిధ అవసరాల నిమిత్తం నగదు కోసం రెండుళ్లుగా కార్మికులు పెట్టుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నిధిపైనే ఆశపెట్టుకున్న కార్మికుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. నిధుల్లేక పోతే సరేగాని ఉన్న నిధులను ఇతర అవసరాలకు వాడుకుని   రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసమని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


జమ కాని లేబర్‌ సెస్‌

పట్టణాలు, నగర పాలక సంస్థ పరిధిలో భవన నిర్మాణదారుల నుంచి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా సెస్‌ వసూలు చేస్తుంది. భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చే సమయంలో రూ.10 లక్షలు, ఆపై విలువగల నిర్మాణాలకు వసూలు చేసే ఫీజులో ఒక శాతాన్ని లేబర్‌సెస్‌గా తీసి కార్మిక సంక్షేమ మండలికి చెల్లించాలి. ఈ బాధ్యత ఆయా మున్సిపల్‌, నగరపాలక సంస్థ అధికారులదే. ఈ నిధిలో నుంచి కార్మికుల అవసరాలకు వెచ్చించాలి. అయితే 2016 ఏప్రిల్‌ నుంచి 2019 మార్చి మధ్య జిల్లాలోని పురపాలక పట్టణాల్లో వసూలు చేసిన దాదాపు రూ.40 కోట్లు సంక్షేమ మండలికి ఇంతవరకు జమకాలేదు. వీటిలో అత్యధికంగా ఒక్క గుంటూరులోనే రూ.18.82 కోట్లు ఉన్నాయి. దాదాపు ఐదేళ్ల నుంచి సంక్షేమ మండలికి నిధులు చెల్లించకపోవడం, ఆ నిధులు పక్కదారి పట్టడం వంటి విషయాలు లోకాయుక్త దృష్టికి వెళ్లింది. ఈ నిధులను తక్షణం చెల్లించాలని పట్టణ స్థానిక సంస్థలను ఆదేశించింది. ఈ నెల 30వ తేది(సోమవారం) లోగా నిధులను జమ చేయాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. అయితే సోమవారం కృష్ణాష్టమి పర్వదినం పేరిట మున్సిపల్‌ అధికారులు గడువు కోరినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో నిధులు చెల్లింపుపై శుక్రవారం పురపాలక అధికారులు సమావేశం నిర్వహించారని.. ఆ మొత్తం ఎలా చెల్లించాలో తెలియక సమావేశాన్ని మధ్యలోనే ముగించారని సమాచారం. జిల్లాలోని మిగిలిన మున్సిపాలిటీల  పరిస్థితి ఎలా ఉన్నా అధిక మొత్తంలో బకాయిలు ఉన్న గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. సంక్షేమ నిధులు నిలిచిపోవడంతో కార్మికులతో పాటు ఆశాఖ అధికారులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అటు మున్సిపల్‌ అధికారులను అడగలేక, ఇటు కార్మికులకు సర్దిచెప్పలేక కార్మికశాఖ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  


సంక్షేమం మరిచారు 

కార్మికుల సంక్షేమ నిధుల్ని పక్కదారి పట్టించారు. సంక్షేమ బోర్డును లేకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. కార్మికుల సంక్షేమం మరిచిన ఇటువంటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ లేదు. కార్మికుల సంక్షేమ కోసం ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. సంక్షేమ నిధుల నిలిచిపోవడంతో జిల్లాలో అనేక కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సంక్షేమ నిధులు విడుదల చేయాలని  ఆందోళనలకు  పిలుపునిచ్చాం. 

-  దండా లక్ష్మీనారాయణ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు



Updated Date - 2021-08-31T05:25:24+05:30 IST