Abn logo
Jun 3 2020 @ 03:48AM

కార్మిక హక్కుల హననం

కరోనా సంక్షోభాన్ని అడ్డంపెట్టుకొని భారతదేశంలో అనేక రాష్ట్రాలు కార్మికచట్టాలకు చిల్లులుపొడిచేందుకు ప్రయత్నించడం పట్ల అంతర్జాతీయ కార్మిక సంఘం (ఐఎల్‌వో) తీవ్ర అభ్యంతరాన్నీ, ఆవేదననీ వెలిబుచ్చింది. ఐఎల్‌వోలో సభ్యదేశంగా భారతదేశం 47 తీర్మానాలను ఆమోదించడం ద్వారా కార్మికుల వేతనాలు, పనిపరిస్థితులు, పనిగంటలు తదితర అనేక హక్కుల పరిరక్షణకు కట్టుబడింది. కార్మికులను యజమానుల దయాదాక్షిణ్యాలకు వదిలేకుండా ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటుందన్న ప్రధానమైన ఒప్పందాన్ని కూడా భారతదేశం గౌరవించింది. కార్మికుల పక్షాన బలంగా ఉంటానని ఘనమైన ప్రమాణాలు చేసిన భారత్‌ ఇలా చరిత్రలో ఎన్నడూ లేనంతస్థాయిలో కీలకమైన కార్మిక చట్టాలను సైతం తుడిచిపెట్టేయడం ఐఎల్‌వోకు ఆశ్చర్యం కలిగించింది. ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కూడా ఆయా రాష్ట్రాలు కార్మిక సంఘాలను సంప్రదించకపోవడం దానికి అభ్యంతరకరంగా తోచింది. వివిధ రాష్ట్రాలు తీసుకున్న కార్మికవ్యతిరేక నిర్ణయాలను ఐఎల్‌వో దృష్టికి సవివరంగా తెస్తూ, దాని తక్షణ జోక్యాన్ని అభ్యర్థిస్తూ దాదాపు పది ప్రధాన కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో, కార్మికుల హక్కులకు కట్టుబడవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి ఆ సంస్థ డైరక్టర్‌ జనరల్‌ తన సుదీర్ఘ లేఖలో విజ్ఞప్తి చేశారు. 


ఐఎల్‌వోలో సభ్యదేశంగా కార్మికచట్టాలను రద్దుచేయడం కుదరదని అంటూనే, చట్టాలను సంస్కరించడానికీ, ఏకంగా రద్దుచేయడానికీ ఎంతో తేడా ఉన్నదని ఇటీవల నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌ అన్నారు. చట్టాలను ఇలా ఏకపక్షంగా ఎత్తివేయడం కాక, సంస్కరించే పేరిట వాటిని బలహీనపరచాలన్నది ఆయన ప్రకటన ఉద్దేశం కావచ్చు. ప్రధానంగా బీజేపీ పాలితరాష్ట్రాలు, వాటిని అనుసరిస్తూ మరికొన్ని రాష్ట్రాలు ఇటీవల వరుసపెట్టి కీలకమైన కార్మిక చట్టాలను నిర్వీర్యపరచిన విషయం తెలిసిందే. పనిగంటలను ౮నుంచి పన్నెండు చేయడం, ఉద్యోగులను నియమించడం, తొలగించడంలోనూ, కార్మికుల వేతనాలు, ఇతరత్రా ప్రయోజనాలు లెక్కగట్టడంలోనూ, కోతవేయడంలోనూ యాజమాన్యాలకు అవి నిరంకుశమైన అధికారాలు దఖలుపరిచాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒకే ఆర్డినెన్సుతో 38 కార్మికచట్టాల్లో మూడు మాత్రమే అమలులో ఉంచి, మిగతావన్నింటినీ మూడేళ్ళపాటు రద్దుచేసింది. పనిప్రదేశాల్లో కార్మికులకు కల్పించే కనీస సౌకర్యాలు, ఆరోగ్య, భద్రతా నిబంధనలను మధ్యప్రదేశ్ మాయం చేసింది. చాలా రాష్ట్రాలు లేని అధికారాలు దఖలుపరచుకొని ఈ నిర్ణయాలు తీసుకున్నందువల్ల కేంద్రప్రభుత్వం వారికి అండగా ఉన్నదన్న అనుమానాలు సహజం. కార్మికచట్టాలను మార్చని రాష్ట్రాలపై కేంద్రం నుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయని కూడా కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న పారిశ్రామికవేత్తలకు కార్మికులతో గొడ్డుచాకిరీ చేయించాలన్న ఉద్దేశం ఇది. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం వలసకార్మికులు ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా అడ్డుపడటం ద్వారా స్థానిక పారిశ్రామికవేత్తలకు కారుచవుకగా శ్రామిక శక్తిని సమకూర్చే ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే చిన్న పరిశ్రమల్లో పరిస్థితులు ఘోరంగా ఉన్న నేపథ్యంలో, కార్మికచట్టాల నిర్వీర్యంతో ఇక పెద్దవాటిలో కూడా హక్కులకు దిక్కులేకుండాపోతుందని అర్థం. 


అమెరికా చైనా కొట్లాట మధ్య దేశంలోకి పెట్టుబడులు ప్రవహించాలంటే ఇప్పుడున్న కార్మికచట్టాలు ప్రధాన అడ్డంకని కట్టుకథలు చెబుతూ పాలకులు ఈ హక్కుల హననానికి పాల్పడుతున్నారు. చాలా దేశాలతో పోల్చితే మనదేశంలో కార్మికుల వేతనాలు, హక్కులు తక్కువే. అయినా పెట్టుబడులేమీ ప్రవహించలేదు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ అని మోదీ ఎప్పుడో ఘోషించినా కొత్తగా వచ్చిపడినవేమీ లేవు. కరోనాకు ముందుకాలంలోనే పెట్టుబడుల వాతావరణం లేకపోగా, ఇప్పుడు ఆ పరిస్థితి మరింత దిగజారింది. అయినా, పరిశ్రమల యజమానులను, కార్పొరేట్లను సంతృప్తిపరచేందుకు కార్మికులమీదే పాలకులు తమ ప్రతాపం చూపుతున్నారు. ‘ఆత్మనిర్భరత’ పేరుతో అన్నిరంగాలను ప్రైవేటుకు తెరిచేసి, లాభాలు గడిస్తున్నవాటితో సహా దాదాపు 250 ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నది. దేశ ఆర్థిక వ్యవస్థను తమ ఇష్టారాజ్యంగా కొల్లగొట్టడానికి విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకు గేట్లు తెరిచిన నేపథ్యంలో, వారికి గొడ్డుచాకిరీ చేసే కార్మికులను అందించేందుకు ఉన్న ఆ కొన్ని చట్టాలనూ చట్టుబండలు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement