సీసీఐలో శ్రమదోపిడీ!

ABN , First Publish Date - 2022-05-15T06:28:28+05:30 IST

సీసీఐలో శ్రమదోపిడీ!

సీసీఐలో శ్రమదోపిడీ!
తాండూరు మండలం కరన్‌కోట్‌ గ్రామ సమీపంలోని ప్రభుత్వరంగ సీసీఐ కర్మాగారం


  • సీసీఐ కాంట్రాక్టు కార్మికులకు అందని వేతనాలు
  • మూడేళ్లుగా 35మందికి అందని గ్రాట్యుటీ డబ్బులు

తాండూరురూరల్‌, మే, 14 : తాండూరు మండలం కరన్‌కోట్‌ గ్రామ సమీపంలోని ప్రభుత్వ రంగ సిమెంటు కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు సకాలంలో అందడం లేదు. దీంతో కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ కార్మిక చట్టం  ప్రకారం ప్రతినెలా 7వ తేదీ లోపు ఒప్పంద కార్మికులకు వేతనాలు అందాల్సి ఉంది. అయితే ఒక్కో నెల 18 నుంచి 24వ తేదీ వరకు కూడా అందకపోవడంతో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరన్‌కోట్‌ సీసీఐ కర్మాగారంలోని రామిల్‌, కోల్‌మిల్‌, ప్యాకింగ్‌ ప్లాంట్‌, కూలర్‌, కిలన్‌, మైన్స్‌, ఫైనాన్స్‌, విభాగాల్లో ప్రస్తుతం 400 మంది వరకు కాంట్రాక్టు కార్మికులు ఆయా  విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ప్రతినెలా రూ.45లక్షల వరకు వేతనాలు రావాల్సి ఉంది. మరోపక్క ప్రభుత్వ పరంగా అందాల్సిన బెల్లం, కొబ్బరి నూనె, ష్యూస్‌(బూట్లు), హెల్మెట్‌తో పాటు పారితోషికం డబ్బులు అందడం లేదు. సీసీఐ యాజ మాన్యం ఒప్పంద కార్మికులను పట్టించుకోకపోవడంతో కార్మికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిశ్రమలో పనిచేస్తున్న  39 మంది కార్మికులకు ఇప్పటి వరకు గ్రాట్యుటీ డబ్బులు రావాల్సి ఉంది. వీరిలో నలుగురు కార్మికులు లేబర్‌ కోర్టు చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆ నలుగురు కార్మికులు గ్రాట్యుటీ అందకుండానే మృతి చెందారు. కార్మికుల సమస్యలపై చర్చించాలన్నా  సీసీఐ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కార్మిక నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క సీసీఐ ఒప్పంద కార్మికులకు వేతనాలను దుర్గా కన్‌స్ట్రక్షన్స్‌తోపాటు స్కాడ్‌-7 సంస్థల నుంచి విడుదలవుతుంటాయి. ఇప్పటికైనా సీసీఐ కార్మికుల సమస్యలపై కార్మిక విభాగం ఉన్నతాధికారులు స్పందించి సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఒప్పంద కార్మికులు కోరుతున్నారు. 

 కాంట్రాక్ట్‌ కార్మికులు హక్కులు కోల్పోతున్నారు

కరన్‌కోట్‌ సీసీఐ కర్మాగారంలో 400 మంది కాంట్రాక్ట్‌ కార్మికులు కార్మిక హక్కులను కోల్పోతున్నారు. రిటైర్మెంట్‌ అయిన కార్మికులకు 1972 చట్టం ప్రకారం గ్రాట్యుటీ డబ్బులు ఇవాల్సి ఉంది. అయితే సీసీఐ యాజమాన్యం 2012లో కార్మిక సంఘంతో ఒప్పందం కుదుర్చుకుని కాలయాపన చేస్తోంది. 39 మంది కార్మికులకు గ్రాట్యుటీ డబ్బులు రావాల్సి ఉన్నా మూడేళ్లగా ఇవ్వడం లేదు. పీఎ్‌ఫలు 3 రకాలుగా విభజించారు. మొదట కార్మికులకు ఢిల్లీ పీఎఫ్‌ ఉండేది. రెండోసారి గుల్బర్గా చేశారు. మూడోసారి గుంటూరుకు మార్చారు. కనీసం రుణం తీసుకుందామన్న ఇవ్వడం లేదు. కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నా యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదు. 

                               - శరణప్ప, సీసీఐ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి

Updated Date - 2022-05-15T06:28:28+05:30 IST