ఉదయానికల్లా చనిపోతా..!

ABN , First Publish Date - 2020-07-07T08:46:34+05:30 IST

కరోనా బారిన పడిన ఓ ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఐసోలేషన్‌లో చేరితే సరైన వైద్యం అంద లేదు.

ఉదయానికల్లా చనిపోతా..!

ఐసోలేషన్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఆవేదన.. వాట్సాప్‌ చాటింగ్‌

చికిత్స పొందుతూ ఆ మరుసటి రోజే మృతి


ఒంగోలు (కార్పొరేషన్‌), జూలై 6: కరోనా బారిన పడిన ఓ ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఐసోలేషన్‌లో చేరితే సరైన వైద్యం అంద లేదు. శ్వాస ఆడడం లేదని, వెంటిలేటర్లు పనిచేయడం లేదని, ఇలా అయితే రేపు ఉదయానికల్లా చనిపోతానంటూ స్నేహితులతో  చాటింగ్‌ చేశాడు. భయపడ్డట్టే.. సోమవారం ఆ టెక్నీషియన్‌ చనిపోవడం తీవ్ర దుమారం రేపింది. ప్రకాశం జిల్లా రిమ్స్‌ ఆస్పత్రిలో ఈ ఘటన చోటేచేసుకుంది. కురిచేడు మండలం, అలవలపాడుకు చెందిన యువకుడు సంతమాగులూరు పీహెచ్‌సీ నుంచి 3నెలల క్రితం మార్కాపురం ఏరియా ఆసుపత్రికి బదిలీపై వచ్చాడు. ఈ క్రమంలో కరోనా సోకడంతో గత నెల 26న రిమ్స్‌లోని ఐసోలేషన్‌కు తరలించారు. అక్కడ సరైన వైద్యసేవలు లేకపోవడంపై బాధితుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై జిల్లా ల్యాబ్‌ టెక్నీషియన్ల వాట్సాప్‌ గ్రూప్‌లో ఆదివారం చాటింగ్‌ చేశాడు.


తాను రోజురోజుకు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నానని, బహుశా సోమవారం ఉదయానికల్లా చనిపోతానని ఆందోళన వ్యక్తం చేశాడు. చెప్పినట్లుగానే సోమవారం ఉదయం ఆ యువకుడు మృతిచెందాడు. దీంతో రిమ్స్‌లోని మెడికల్‌ కాలేజి ల్యాబ్‌ టెక్నీషియన్లు ధర్నా నిర్వహించారు. మృతిచెందిన టెక్నీషియన్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని, అలాగే విధుల్లో మరణించినందున రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా,  మృతుని భార్యకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-07-07T08:46:34+05:30 IST