లింక్‌ పంపి వైద్యుడి ఖాతా ఖాళీ చేశారు!

ABN , First Publish Date - 2021-02-26T13:45:28+05:30 IST

ఓ లింక్‌ పంపించి వైద్యుడి ఖాతాలో నుంచి రూ.3.45 లక్షలు కొట్టేశారు

లింక్‌ పంపి వైద్యుడి ఖాతా ఖాళీ చేశారు!

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : ఫోన్‌ నెంబర్‌కు కేవైసీ చేయాలంటూ ఓ లింక్‌ పంపించి వైద్యుడి ఖాతాలో నుంచి రూ.3.45 లక్షలు కొట్టేశారు సైబర్‌ దొంగలు. నందగిరిహిల్స్‌కు చెందిన మెడవరం జగదీశ్‌ ప్రతా‌ప్‌వర్మ విశ్రాంత వైద్యుడు. ఈ నెల 23న ఆయనకు ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. సెల్‌ నెంబర్‌కు సంబంధించి కేవైసీ పూర్తి చేయాలని చెప్పాడు. ఇందుకు పది రూపాయలు చెల్లించాలన్నాడు. అది కూడా ఆన్‌లైన్‌లో కడితే సరిపోతుందన్నారు. ఇది నమ్మిన వైద్యుడు సమ్మతించాడు. కొద్దిసేపటికి ఇండస్‌ ఇండియా బ్యాంకు పేరిట ఓ లింక్‌ ఆయన ఫోన్‌కు వచ్చింది. దాన్ని వైద్యుడు క్లిక్‌ చేశాడు. పదిరూపాయలు చెల్లించాడు. ఇది జరిగిన కొద్ది సేపటికే ఆయన ఖాతాలో నుంచి మూడుమార్లు 98 వేలు, 49 వేలు, రెండు వేల రూపాయలు డ్రా అయిపోయాయి. ఆందోళన చెందిన తనకు వచ్చిన ఫోన్‌ నెంబర్‌కు ఫోన్‌ చేశాడు. కానీ కలవలేదు. తాను మోసపోయినట్టు గ్రహించాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-02-26T13:45:28+05:30 IST