Delhi: కేంద్రం ఈడీని పావుగా వాడుకుంటోంది: కేవీపీ

ABN , First Publish Date - 2022-07-21T21:15:38+05:30 IST

ఈడీని కేంద్రం పావుగా వాడుకుంటోందని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు విమర్శించారు.

Delhi: కేంద్రం ఈడీని పావుగా వాడుకుంటోంది: కేవీపీ

ఢిల్లీ (Delhi): ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)ని కేంద్రం పావుగా వాడుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు (KVP Ramachandra Rao) విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈడీ విచారణలో కథా, స్క్రీన్‌ప్లే, నిర్మాత ప్రధాని మోదీ (PM Modi) అని, ఎన్ఫోర్సర్ అమిత్‌షా (Amit Shah) అని, ఈడీ అధికారులు కేవలం నిమిత్తమాత్రులేనని అన్నారు. భారత్ జోడో యాత్రను ఓవర్‌ షాడో చేయడమే బీజేపీ (BJP) లక్ష్యమని, గాంధీ (Gandhi), నెహ్రూ (Nehru) పేర్లను రాజకీయాల్లో లేకుండా చేయాలనే ఒక వ్యర్థ ప్రయత్నం తప్ప ఇందులో వాళ్ళు సాధించేది ఏమీ లేదని అన్నారు. దీనివల్ల గాంధీ, నెహ్రూ ఫ్యామిలీకి ఇమేజ్ (Image) పెరుగుతుందే తప్ప డ్యామేజ్ (Damage) ఉండదన్నారు. కాంగ్రెస్ (Congress) నేతల్లో మరింత యూనిటీ వస్తుందన్నారు. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ అగ్ర నేతలు ఈడీ విచారణ నుంచి బయటపడతారని కేవీపీ రామచంద్రరావు ఆశాభావం వ్యక్తం చేశారు.


నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (sonia gandhi) గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ (Enforcement Directorate) అధికారుల ముందు హాజరయ్యారు. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ)లోని క్రిమినల్‌ సెక్షన్ల కింద ఆమె వాంగ్మూలాలను ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికలో సోనియా, రాహుల్‌ల షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వీరి పాత్రలకు సంబంధించి ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సోనియా ఈడీ అధికారుల ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. 

Updated Date - 2022-07-21T21:15:38+05:30 IST