Abn logo
Mar 16 2020 @ 13:36PM

ఇళయరాజా, రెహ్మాన్ అనుసరించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

తెలుగు సినిమా‌‌ పాటను అంతర్జాతీయం చేసిన‌ సంగీతదర్శకులు కె.వి.మహాదేవన్. ఈ ఒక్క‌‌ విషయం‌ చాలు ఎన్నిసార్లైనా‌ వారిని స్మరించుకోవడానికి.‌ మళ్లీ మఱోసారి కె.వి. మహాదేవన్‌ను స్మరించుకుందాం రండి. 


కె.(కృష్ణన్ కోవిల్) వి.(వెంకటాచల బాగవతార్) మహాదేవన్‌ 1918లో పుట్టారు. వారు పుట్టింది‌ మార్చ్ నెల 14‌గా పరిగణించబడుతోంది. మార్చ్‌‌ 20న పుట్టారు అని ఒక మాట ఉంది. కానీ వారి కుటుంబం మార్చ్ 4‌ వారి జన్మదినం అని‌ తెలియజేసింది. కె.వి. మహాదేవన్‌పై విశేషమైన‌ పరిశోధన చేసి తమిళ్‌లో 800 పుటలకు పైగా రెండు‌ పుస్తకాల్ని వ్రాసిన‌ రచయిత వామనన్ ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. కె.వి.మహాదేవన్‌పై ఇప్పటికే తెలుగులో ఒక్క పుస్తకమైనా వచ్చి ఉండాల్సింది. రాకపోవడం లోటు.‌  


తెలుగు పాటను అంతర్జాతీయం‌ చేసిన‌ మహాదేవన్‌ తమిళ్‌ వారు. వారు సంగీతం చేసిన శంకరాభరణం తెలుగు సినిమా పాటలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనే కాదు అంతర్జాతీయంగా వినుతికెక్కాయి. విశ్వవ్యాప్తం అయ్యాయి. మనదేశంలో శంకరాభరణం సినిమా పాటలు మఱే ఇతర భాష సినిమా పాటలకన్నా ఎక్కువగా రాణించాయనడం అతిశయోక్తి కాదు సరైన ఉక్తి. 


సంగీత దర్శకులుగా కె.వి. మహాదేవన్ తొలిచిత్రం‌ 1942లో వచ్చిన‌ తమిళ్‌ చిత్రం ఆనందన్. ఆ తరువాత 2‍, 3 తమిళ్‌‌ సినిమాలు చేసినా ఏవీ విజయవంతం కాకపోవడంతో వారు హెచ్.ఎం.వి.లో ఆస్థాన సంగీత దర్శకులుగా ఉద్యోగం చేశారు. అంతకుముందు అంగరై విశ్వనాద బాగవతార్ అన్న శాస్త్రీయ సంగీత గాయకునికి కచేరీలలో పక్కపాట పాడుతూండే వారు. అంతకుముందు బూదపాండి అరుణాచలకవి రాయర్ అనే గురువు వద్ద శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నారు. 


కె.వి. మహాదేవన్ నటులుగా సినిమా‌రంగ ప్రవేశం చేశారు. అంతకు ముందు‌ నాటకాల్లో నటించే వారు. నాటకాల్లో కొన్ని‌ స్త్రీ పాత్రలు కూడా వేశారు. 

1942లో సినిమా సంగీత దర్శకుడయినా కూడా 1952 లో కుమారి అన్న తమిళ్ సినిమా‌తో‌ వారికి సంగీత దర్శకునిగా ఒక గుర్తింపు వచ్చింది. తెలుగులో వారి తొలి చిత్రం 1958లో వచ్చిన దొంగలున్నారు జాగ్రత్త. ముందడుగు (1958) సినిమాతో కె.వి. మహాదేవన్ తెలుగులో‌ సంగీత దర్శకునిగా ఊపునందుకున్నారు. అటు తరువాత 1962లో వచ్చిన మంచి మనసులు సినిమాతో వారు సంగీతదర్శకునిగా స్థిరపడిపోయారు. మూగమనసులు, దాగుడుమూతలు (1964) వారిని తెలుగులో ఒక ఉన్నతమైన సంగీతదర్శకునిగా నిలిపాయి. దాగుడుమూతలు‌ సినిమాలోని "గోరొంక గూటికే చేరావు చిలక" పాట ఒక విశేషమైన పాట. అప్పటికి ఒక కొత్త వన్నే (new texrure)లో ఉంటుంది ఆ పాట. మూగమనసులు సినిమాలో "ఈనాటి‌ ఈ బంధమేనాటిదో", "పాడుతా తీయగా చల్లగా" లాంటి‌ గొప్ప పాటలున్నా  "గోదారి‌గట్టుంది..." పాట ఒక  ప్రత్యేకమైన పాట. ఆత్మబలం (1964) సినిమాతో ఆత్రేయ, కె.వి.మహాదేవన్‌ల కలయిక మెఱవడం మొదలయింది. తెలుగు, తమిళ్ భాషల్లో వచ్చిన వీరాభిమన్యు సినిమా పాటలు మహోన్నతమైనవి. ఆ సినిమాలో శహన రాగంలో వారు చేసిన "చూచి, వలచి, చెంతకు పిలిచి ..." పాట ఉన్నతమైనది. శహన రాగంలో ఇంత గొప్ప పాట మఱెవరూ చెయ్యలేదు. వీణ ఎస్.‌బాలచందర్ ఈ‌ రాగంలో చెప్పుకో తగ్గట్టుగా ఓ తమిళ్ పాట‌ చేశారు కానీ కె.వి‌. మహాదేవన్ చేసినదే గొప్పగా ఉంటుంది. సుమంగళి(1965)సినిమాలో‌ని "కనులు కనులతో కలబడితే..." పాట‌ ఎంతో‌ గొప్ప పాట. ఈ పాట‌ ముందు 1962లో‌ తమిళ్ ‘సారదా’ అనే సినిమాలో వచ్చింది. గాయకులు కె.జె. ఏసుదాస్ ఈ‌ పాట‌ను ఒక‌ గొప్ప పాటగా  ప్రశంసించారు. ఒక పాటను ఇలా ఆలోచించి నిర్మించడం చాలా గొప్ప విషయం. కె.వి. మహాదేవన్ ఒక‌ గొప్ప సంగీత దర్శకులు కాబట్టే ఇలాంటి పాటను చెయ్యగలిగారు. కన్నెమనసులు సినిమాలో "ఈ ఉదయం నా హృదయం" పాట ఒక గొప్ప  ఆలోచించనకు ఆకృతి.‌ తేనె మనసులు సినిమాలో "ఏం ఎందుకని సిగ్గెందుకని ఆలు మగల మధ్య జరిగేది తెలియందెవరికని" పాట‌ను వారు స్వరపఱిచిన విధానం‌ చాలా గొప్పది. కె.విశ్వనాథ్, బాపు, వంటి దర్శకులకు ఎన్నో‌ గొప్పపాటలు చేశారు కె.వి.మహాదేవన్. ఉండమ్మా బొట్టుపెడతా అన్న  కె.విశ్వనాథ్ సినిమాలో "రావమ్మా‌ మహాలక్ష్మి రావమ్మా" అన్న‌ తెలుగుతనపు హరిదాసు పాటను చేశారు మహాదేవన్. బాపుకు ముత్యాలముగ్గు సినిమాలో "ముత్యమంత పసుపు ముఖమెంతో ఛాయ" , గోగులు పూచే గోగులు పూచే ఓ‌ లచ్చా గుమ్మాడి" వంటి గొప్ప తెలుగుతనపు పాటలు చేశారు వారు. సీతామలక్ష్మి సినిమాలోని "మావి చిగురు తినగానే కోవిల పలికేనా" ‌పాట‌ ఎంతో ఉన్నతమైన పాట.‌ కె.విశ్వనాథ్‌కు మహాదేవన్ సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, శుభోదయం,‌ సిరివెన్నెల వంటి సినిమాల్లో మహోన్నతమైన సంగీతాన్ని సృష్టించారు. సిరివెన్నెల‌ పాటలు ఎంతో విశేషమైనవి.‌ ప్రేమనగర్ సినిమాలో "తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా..." ‌ఒక‌ విశేషమైన‌ పాట. ఏకవీర సినిమాలోని‌ "ప్రతిరాత్రి వసంత రాత్రి..." ‌పాట ఎంతో మధురమైన పాట. 


అడవిరాముడు సినిమాలో  మహాదేవన్ చేసిన "ఆరేసుకో బోయి పారేసుకున్నాను హరి" పాట తెలుగునాట విపరీతమైన జనాదరణ పొంది అప్పట్లోనే కోటిరూపాయల పాట అయింది‌. మహాదేవన్ ధక్కారిత్మ్ లేదా ధక్కారిథం ను విస్తృతంగా వాడారు.‌ ఈ ధక్కా‌రిత్మ్‌ను ఉత్తరాది సంగీత దర్శకులు కూడా వాడలేదు. ధక్కా రిత్మ్ వల్ల పాటకు ఒక ఊపు (swing) వచ్చి‌‌ జనరంజకంవుతుంది. త్రిశ్రం తాళాన్ని విరివిగా వాడేవారు మహాదేవన్. ఈ త్రిశ్రాన్ని ఇళయరాజా కూడా ఎక్కువగా వాడేవారు. ఈ‌ విషయంలో తనకు‌‌ మహాదేవన్‌ ఆదర్శమని ఇళయరాజా చెప్పేవారు. అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన సంగీత దర్శకులు ఏ. ఆర్. రహ్మాన్ మహాదేవన్‌ను అనుసరించిన‌ సందర్భాలున్నాయి. మహాదేవన్ పెళ్లిచూపులు (1983) సినిమాలో చేసిన "దాసోహం దాసోహం" ‌పాటలోని‌ కొంతభాగాన్ని ఏ.ఆర్.రహ్మాన్ ఇందిర తమిళ్ సినిమాలో‌ "ఓడకార మారిముత్తు,.."  పాటలో వాడుకున్నారు.


తెలుగులో సినిమా పాట అన్నది జనరంజకం అవడానికి మహాదేవన్ ఒక ప్రధానమైన మూలకం. తెలుగులో సినిమా‌ పాట గొప్పగా పండడానికి మహాదేవన్ ఒక‌ ఇంధనం. మహాదేవన్ వల్ల సినిమా‌ పాట తెలుగులో విస్తృతమయింది. మహాదేవన్ పాట‌ బలంగా, ప్రబలంగా తెలుగు జనం నోట పలికింది. తెలుగు సినిమా పాటల్లో కె.వి.మహాదేవన్ ముద్ర చాలా ముఖ్యమైనది.


మహాదేవన్ తమిళ్‌లోనూ గొప్ప‌ సంగీతం చేశారు.‌ తెలుగు, తమిళ్‌లకు వేఱు వేఱు పంధాలను ఎన్నుకున్నారు వారు. ఇది మఱే‌ సంగీత దర్శకుడూ చెయ్యనిది. తమిళ్‌లో ప్రధాన గాయకులైన టి.ఎం‌.‌సౌందరరాజన్ గాత్రధర్మం, పి.బి. శ్రీనివాస్ గాత్రధర్మం వల్ల‌ ఎలాంటి‌ పాటలు రూపొందగలవో అలాంటి‌ పాటల్ని రూపొందించారు మహాదేవన్.‌ టి.ఎం.‌ సౌందరరాజన్‌కు‌ సరళ రేఖలుగా ఉండే పాటల్ని చేసేవారు. పి.బి.శ్రీనివాస్ చేత అందుకు భిన్నమైన పాటలు పాడించే వారు. పొన్ని తిరునాళ్ అన్న సినిమాలో పహాడి రాగంలో ఉర్దూ‌ గజల్ లాంటి పాటను పి.బి. శ్రీనివాస్‌కు చేశారు. "ఏన్ సిరిత్తాయ్ ఎన్నై పార్తు" పాట అది. కవి వ్రాసిన పాటను తీసుకుని దాన్ని చదవడానికే పట్టే సమయంలోనే  గొప్ప‌ బాణి కట్టేశారు మహాదేవన్. ముత్యాల ముగ్గు సినిమాలో "ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు" పాట కూడా ఉర్దూ గజల్ స్థాయిలోనే మహాదేవన్ చేశారు. దర్శకులు బాపు కోరిక మేఱకు  "బాత్ కర్ నీ ముఝే ముశికిల్..." అన్న మెహ్ దీ హసన్ గజల్‌ను మనసులో పెట్టుకుని ఆ పాటను చేసినట్టుగా అనిపిస్తుంది. మహాదేవన్ తమిళ్‌లో పి.బి. శ్రీనివాస్‌తో పాశ్చాత్య పోకడలో "తోళ్‌ కండేన్ తోళే కండేన్..." (సినిమా ఇదయ కమలం) పాటను పాడించారు.  "ఎన్నై పార్తా పరిహాసం..." ‌(సినిమా‌ సింగమలై తీవు),‌‌ "నినైప్పదర్కు నేరమిల్లై..." ‌(సినిమా‌‌ నినైప్పదర్కు నేరమిల్లై) వంటి‌ విలక్షణమైన పాటల్ని‌ పి.బి.‌ శ్రీనివాస్ చేత‌‌ పాడించారు. టి.ఎం. సౌందరరాజన్ చేత "కణ్ణెదిరే తోన్ఱినాళ్ కని  ముగత్తై కాట్టినాళ్..."( సినిమా ఇరువర్ ఉళ్ళం) అన్న మెత్తటి‌‌ గొప్ప పాట‌ పాడించారు. తిరువిళైయాడల్ సినిమాలో "పాట్టుం నానె బావముం నానే..."‌ అన్న తాను పాడిన‌ కె.వి.‌ మహాదేవన్ పాట తన జీవితంలోనే తాను పాడిన గొప్ప‌ పాట అని టి.ఎం. సౌందరరాజన్ ఈ రచయితతో చెప్పారు. పి.సుశీల చేత తమిళ్‌లో అద్భుతాల్ని పాడించారు మహాదేవన్. "గంగై కరై తోట్టం కన్ని పెణ్గళ్ కూట్టం..." (సినిమా‌ వానంబాడి)‌, "మన్నవన్‌ వందానడి‌ తోళ్షి,.." (సినిమా తిరువరుట్ సెల్వర్), "మలర్గళ్ ననైందన..." ‌(సినిమా‌‌ ఇదయకమలం) వంటి‌ పాటలు వాటిల్లో కొన్ని.‌ మహాదేవన్ తమిళ్ష్ లో కొన్ని  ఉన్నతమైన‌ రాగమాలికలు చేశారు. ‘శంకరాభరణం’, బాపు ‘త్యాగయ్య’ సినిమాలలో లాగా తమిళ్‌లో కొన్ని పాటల్లో మహాదేవన్‌ సాంద్రమైన కర్ణాటక‌ సంగీతాన్ని వాడారు. తెలుగులో‌‌ 280కు పైగా, తమిళ్‌లో 200‌‌ సినిమాలకు పైగా సినిమాలకు సంగీతం  చేశారు మహాదేవన్. కొందఱు ఇతర సంగీత దర్శకుల్లాగా ఒక భాషలో చేసిన స్వీయ సంగీతాన్ని మఱో భాషలో ఎక్కువగా వాడలేదు మహాదేవన్. 

మహాదేవన్ మంచి తాళ‌ జ్ఞానం కలవారు. అందువల్ల వీరు ముందు‌ సాహిత్యాన్ని తీసుకుని ఆపై‌ బాణి‌ కడతారు‌. ఆ తాళ జ్ఞానంతో ఎటువంటి రచననైనా‌ మంచి పాటగా మలచగలిగే వారు. ముఖ్యంగా ఆత్రేయ వచనంలా‌‌ వ్రాసిన‌ సాహిత్యాన్ని కూడా గొప్ప పాటలుగా మలిచారు కె.వి.మహాదేవన్. మహాదేవన్ వల్లే గేయత్వం‌ (lyricism) లేని ఆత్రేయ రచనలు‌‌ పాటలుగా ప్రజలలో నిలిచాయి. 


ముందుగా సాహిత్యాన్ని తీసుకుని  స్వర పఱచడం వల్ల వీరు పెద్దగా అనుకరణ కానీ వేఱే పాటలకు నకలు (copy) చెయ్యడం కానీ చెయ్యలేదు. వీరిపై ఇంగ్లిష్ ,‌ హిందీ సంగీతాల ప్రభావం పెద్దగా లేదు. సాహిత్యానికి మాత్రమే సంగీతం చేశారు. భాషకు తగిన స్వర రచన చేశారు. వారికి తెలుగు రాదనే అపోహ ఉంది. అది తప్పు వారికి తెలుగు బాగా వచ్చు. సాహిత్యాన్ని అర్థం చేసుకున్నాకే వారు బాణిలు కట్టేవారు.  భావాన్ని అందించే సంగీతం వారిది.


మన దేశంలో  జాతీయ‌ ఉత్తమ సినిమా సంగీత‌దర్శకులు ‌పురస్కారాన్ని అందుకున్న మొదటి వారు కె.వి. మహాదేవన్. కందన్ కరుణై‌ (1967) అనే తమిళ్ సినిమాకు వారికి‌ ఈ పురస్కారం వచ్చింది. ఇంకా‌ ఎన్నో పురస్కారాల్ని అందుకున్నారు కె.వి.మహాదేవన్.


మహాదేవన్‌ భారీగా‌ వాద్య‌సంగీతాన్ని వాడలేదు. వాద్య‌ సంగీతాన్ని తగినట్టుగా మాత్రమే వాడారు. ప్రయోగాల జోలికి పోలేదు. పాట పొలుపుగా ఉండడం కోసం నిలబడ్డారు. నైపుణ్యం (finesse) కన్నా చక్కదనం (fineness)తోనూ, వైభవం (grandeur) కన్నా ఇంపు, సొంపులకు ప్రాధాన్యతతోనూ పాటల్ని చేశారు మహాదేవన్. ఈ లక్షణాలు సి.రామచంద్ర, రోషన్ వంటి‌ హిందీ సినిమా‌ సంగీత దర్శకుల్లో ఉన్నాయి. 


ఎంతో, ఎంతో చెప్పుకోవచ్చు తెలుగు సినిమా పాటకు మామ‌ అయిన‌ మహాదేవన్‌ గుఱించి.1918లో పుట్టిన మహాదేవన్ 2001లో‌ వెళ్లిపోయారు. కానీ తెలుగు, తమిళ్ పాటల్లో వారి స్థానం ఎప్పటికీ చెల్లిపోనిది. ముఖ్యంగా మహాదేవన్ తెలుగు పాటల్లో  మోగుతూనే ఉంటారు. తెలుగు సినిమా పాటల ఆకాశంలో ఒక నిండు పున్నమి చందమామ మహాదేవన్.


"తిరై‌ ఇసై‌ తిలగం" అని మహాదేవన్ కు తమిళ్‌లో‌ బిరుదు‌ ఉంది.‌ అంటే‌ ‘సినిమా‌ సంగీత‌ తిలకం’ అని అర్థం.‌ మహాదేవన్ తమిళ్, తెలుగు చలనచిత్ర గీతాలపై‌ చెఱిగిపోని తిలకం.

రోచిష్మాన్
9444012279
[email protected]

Advertisement
Advertisement
Advertisement