కువైట్‌లో న‌మోదైన‌ తొలి క‌రోనా మ‌ర‌ణం భారతీయుడిదే..!

ABN , First Publish Date - 2020-04-05T13:17:30+05:30 IST

కువైట్‌లో శ‌నివారం తొలి క‌రోనా మ‌ర‌ణం న‌మోదైంది. ఇక్కడ న‌మోదైన‌ తొలి మరణం భారతీయుడిదే.

కువైట్‌లో న‌మోదైన‌ తొలి క‌రోనా మ‌ర‌ణం భారతీయుడిదే..!

కువైట్‌: ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న క‌రోనావైర‌స్ గ‌ల్ఫ్‌లోనూ విజృంభిస్తోంది. సౌదీ అరేబియా, ఖ‌తార్‌, యూఏఈలో ఈ వైర‌స్ ప్ర‌భావం అధికంగా ఉంది. అటు కువైట్‌లో శ‌నివారం తొలి క‌రోనా మ‌ర‌ణం న‌మోదైంది. ఇక్కడ న‌మోదైన‌ తొలి మరణం భారతీయుడిదే. అలాగే 62 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 479కి చేరింది. కాగా, ఈ మ‌హ‌మ్మారి నుంచి శ‌నివారం 11 మంది కోలుకుని డిశార్జ్ అయ్యారని, దీంతో కువైట్‌లో కొవిడ్‌-19 బారిన ప‌డి కోలుకున్న వారి సంఖ్య 93 చేరింద‌ని ఆ దేశ ఆరోగ్యశాఖ‌ మంత్రి డాక్ట‌ర్ షేక్ బ‌సెల్ అల్ స‌భా పేర్కొన్నారు.


క‌రోనా క‌ట్ట‌డికి ఇప్ప‌టికే కువైట్ స‌ర్కార్ అనేక చ‌ర్య‌లు చేప‌ట్టింది. మ‌సీదులు, మాల్స్‌, స్కూల్స్, పార్క్‌ల‌ను మూసివేసింది. ప్ర‌జా ర‌వాణాను నిలిపివేయ‌డంతో పాటు అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేసింది. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో జ‌న‌స‌మూహాల‌పై నిషేధం విధించింది. ప్ర‌భుత్వ ఆంక్ష‌ల‌ను అధిగ‌మించే వారిప‌ట్ల అధికారులు క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మిస్తున్నారు. దీంతో ప్ర‌జ‌లు పూర్తిగా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. 


ఇదిలాఉంటే కువైట్‌లో కరోనా సోకిన భారతీయుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. శనివారం వరకు నమోదయిన 479 కేసులలో భారత్‌కు చెందిన 148 మంది ఉన్నారు. భారతీయులు ఇరుకైన గదులలో ఉండటంతో వ్యాధి శరవేగంగా వ్యాపిస్తోందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీనిపై కువైట్‌లో విదేశీ వ్యవహారాల మంత్రి షేఖ్‌ అహ్మద్‌ నాసర్‌ అల్‌ సభా మన విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. వీలయినంత త్వరగా ప్రత్యేక విమానాలను అనుమతించాలని కోరినట్లు సమాచారం. మహ్బులలో 540 మంది భారతీయులు నివసించే కార్మిక క్యాంపులో వ్యాధి సోకిన ఒకరిని క్వారంటైన్‌ చేశారు. ఆ తర్వాత పరీక్షించగా మరికొంతమందిలోనూ పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారందరినీ రెండు ప్రత్యేక ఆసుపత్రులకు తరలించారు.   

Updated Date - 2020-04-05T13:17:30+05:30 IST