Kuwait పేరిట అత్యంత చెత్త రికార్డు.. ప్రవాసుల విషయంలో..

ABN , First Publish Date - 2021-12-30T17:34:20+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ ఓ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది.

Kuwait పేరిట అత్యంత చెత్త రికార్డు.. ప్రవాసుల విషయంలో..

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ ఓ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. ప్రవాసులకు సంబంధించి అత్యంత చెత్త గమ్యస్థానంగా కువైత్ నిలిచింది. అయితే, కువైత్‌కు ఇలా నిలవడం ఇదేమీ మొదటిసారి కాదు. గడిచిన ఎనిమిదేళ్లలో వరుసగా ఏడోసారి ఈ చెత్త రికార్డు ఆ దేశం పేరిట నమోదు కావడం గమనార్హం. ఓ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం 'ఎక్స్‌పాట్ ఇన్‌సైడర్ సర్వే'లో 59 దేశాలకు గాను కువైత్ చివరి స్థానం నిలబెట్టుకుంది. అటు జీవన నాణ్యత సూచికలో కూడా కువైత్‌కు 59వ ర్యాంకు దక్కింది. ఇక వరల్డ్ వైడ్‌గా చూసుకున్న కూడా కువైత్ వైపు ప్రవాసులు అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఏకంగా 46 శాతం మంది వలసదారులు ఆ దేశంలో నివాసం చాలా కష్టమని చెబితే, 45 శాతం మంది మాత్రం అక్కడ సెటిల్ కావడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారంగా చెప్పుకొచ్చారు. 


ఇక విశ్రాంతి, వ్యక్తిగత ఆనందం, ప్రయాణం, రవాణా ఉపవర్గాలు తదితర విషయాల్లో కూడా కువైత్ చాలా దారుణ ఫలితాలను నమోదు చేసింది. పని, విశ్రాంతి విభాగంలో 58వ స్థానం.. కెరీర్ అవకాశాలు, సంతృప్తి విషయంలో 57వ స్థానంలో నిలిచింది. అటు ఆ దేశంలో ఉద్యోగం చేస్తున్న ప్రతి 10 మంది ప్రవాసుల్లో ముగ్గురి కంటే ఎక్కువ మంది తమ జాబ్ పట్ల సంతృప్తిగా లేమని చెప్పారు. కాగా, 2021లో తైవాన్, మెక్సికో, కోస్టారికా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రవాస గమ్యస్థానాలుగా నిలిచాయి. ఈ దేశాలు స్థిరపడటం, మంచి వ్యక్తిగత ఆర్థిక సహాయంతో ప్రవాసులను ఆకర్షిస్తున్నాయి. కువైత్‌లో ఉన్న లాంగ్ వర్కింగ్ అవర్స్ కారణంగా ప్రవాసులు ఇక్కట్లు పడుతున్నారు. దీంతో వారికి వర్క్, సాధారణ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకోవడం కుదరడం లేదు. కువైత్‌తో పాటు జపాన్‌లోని ప్రవాసులు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు 'ఎక్స్‌పాట్ ఇన్‌సైడర్ సర్వే' వెల్లడించింది.   

Updated Date - 2021-12-30T17:34:20+05:30 IST