కువైత్ సిటీ: ఇప్పటికే వర్క్ పర్మిట్ల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న కువైత్.. తాజాగా మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇకపై వర్క్ పర్మిట్లను విద్యార్హతను బట్టి కేటాయించనున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) వెల్లడించింది. ఇలా విద్యార్హతను బట్టి ఉద్యోగాలను 1,855 రకాలుగా విభజించింది. అలాగే ఆయా ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలను పెట్టింది. ఈ మేరకు పీఏఎం తన అధికారిక వెబ్సైట్లో ప్రత్యేక సెక్షన్‌ను పొందుపరిచింది. కనుక ఈ కొత్త క్వాలిఫికేషన్ లింకింగ్ పద్దతిలో అభ్యర్థి సమర్పించే విద్యార్హత జాబ్ టైటిల్‌కు సరిపోతేనే వారికి వర్క్ పర్మిట్ జారీ లేదా రెన్యువల్ చేయడం జరుగుతుంది.
దీనిలో భాగంగా డైరెక్టర్, ఇంజనీర్, డాక్టర్, నర్స్, వాతావరణ శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, రసాయన శాస్త్రవేత్త, భూగర్భ శాస్త్రవేత్త, బోధకుడు, ఉపాధ్యాయుడు, గణిత శాస్త్రజ్ఞుడు, గణాంకవేత్త ఇలా పలు కేటగిరీ ఉద్యోగాలన్నింటికీ విద్యార్హతగా బ్యాచిలర్ డీగ్రీని లేదా దీనికి సమానమైన క్వాలిఫికేషన్ ఉండాలని పేర్కొంది. ఇక టెక్నిషీయన్, ట్రైనర్, సూపర్వైజర్, చెఫ్, పెయింటర్, రీఫరీ వంటి ఉద్యోగాలకు కనీస విద్యార్హత డిప్లోమా ఉండాలని తెలియజేసింది.