ఫ్యామిలీ వీసాలపై కండీషన్స్ అప్లై అంటున్న Kuwait.. కొత్త షరతులివే..!

ABN , First Publish Date - 2021-11-10T18:58:15+05:30 IST

కువైత్ ఇటీవల ఎంట్రీ వీసాలతో సహా అన్ని రకాల వీసాల జారీని ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఫ్యామిలీ వీసాలపై కండీషన్స్ అప్లై అంటున్న Kuwait.. కొత్త షరతులివే..!

కువైత్ సిటీ: కువైత్ ఇటీవల ఎంట్రీ వీసాలతో సహా అన్ని రకాల వీసాల జారీని ప్రారంభించిన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రవాసులకు వీసాల మంజూరును షురూ చేసినట్లు గత శనివారం ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. కమర్షియల్, వర్క్, ఫ్యామిలీ వీసాల కోసం వలసదారులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే, తాజాగా ఫ్యామిలీ వీసాల విషయంలో కొత్తగా మరికొన్ని షరతులు విధించింది. ఇంతకుముందు ప్రకటించినట్లుగానే 16 ఏళ్లలోపు వయసు ఉన్న ఉద్యోగుల పిల్లలకు వీసాలు ఇస్తామని చెప్పిన కువైత్.. అది కేవలం టీచింగ్, హెల్త్‌కేర్ సెక్టార్లకు చెందిన వారికే మాత్రమేనని కండీషన్ పెట్టింది. ఈ మేరకు రెసిడెన్సీ ఎఫైర్స్ మినిస్ట్రీకి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. 


ఫ్యామిలీ వీసాకు ఇంతకుముందు ఉన్న షరతులివే..

ప్రవాసుడి భార్య, 16 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే ఈ వీసాలు జారీ చేయనున్నట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. అంతేగాక ఈ వీసా కోసం శాలరీ కండీషన్ కూడా పెట్టింది. వర్క్‌ పర్మిట్‌లో 500 కువైటీ దినార్లు(రూ.1.23లక్షలు) ఉన్నవారికి మాత్రమే ఫ్యామిలీ వీసా మంజూరు చేయనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. అంతేగాక వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్(క్యూఆర్ కోడ్‌తో ఉన్నది) సమర్పించడం తప్పనిసరి. ఇకపోతే టూరిస్ట్ వీసాల జారీ ప్రక్రియకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గకపోవడంతో అంతర్గత మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలాఉంటే.. ఇటీవల ప్రభుత్వం వీసాల మంజూరును ప్రారంభించినట్లు ప్రకటించడంతో ఒక్కరోజులేనే 7వేల మంది వీసాల కోసం దరఖాస్తు చేశారు. వీటిలో 45శాతం కమర్షియల్ విజిట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 


Updated Date - 2021-11-10T18:58:15+05:30 IST