కువైత్ సిటీ: విదేశీయులకు రెసిడెన్సీ పరిమితుల విషయమై కువైత్‌లో తెరపైకి కొత్త ప్రతిపాదన వచ్చింది. దేశంలోని ప్రవాసుల రెసిడెన్సీని ఐదేళ్లకు పరిమితం చేయాలనేదే ఈ కొత్త ప్రతిపాదన. దీనిపై తాజాగా కువైత్ పార్లమెంట్లో కూడా చర్చ జరిగినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఈ సందర్భంగా విదేశీయుల నివాస చట్టాల సవవరణ విషయమై కూడా పార్లమెంట్ చర్చించినట్లు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదన అమలుకు సమయం పట్టే అవకాశం ఉందని పార్లమెంట్‌కు చెందిన అంతర్గత, రక్షణ కమిటీ అభిప్రాయపడింది. ఇక నివాస పరిమితి ప్రతిపాదన అమలైతే కువైత్‌లోని విదేశీ పెట్టుబడుదారులకు 15ఏళ్ల వరకు రెసిడెన్సీ అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలాఉంటే.. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం కువైత్‌లో 3.5 మిలియన్ల మంది ప్రవాసులు ఉన్నట్లు సమాచారం. ఆ దేశ మొత్తం జనాభా 4.6 మిలియన్లు ఉంటే.. అందులో 3.5 మిలియన్ల మంది వలసదారులే ఉండడం గమనార్హం. అటు ప్రవాసుల కారణంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో గత కొంతకాలంగా వలసదారులకు పరిమితులు విధించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. దీనిలో భాగంగానే కువైటైజేషన్ వంటి పాలసీని కూడా తీసుకొచ్చింది కువైత్. అలాగే దేశంలో చట్ట విరుద్ధంగా ఉంటున్న ప్రవాసులపై కూడా కొన్నాళ్లుగా కువైత్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తరచూ తనిఖీలు నిర్వహిస్తూ రెసిడెన్సీ గడువు ముగిసినా ఇంకా అక్రమంగా నివాసం ఉంటున్న వారితో పాటు ఇతర కేసులకు సంబంధించిన వారిని గుర్తించి వెంటనే దేశం నుంచి బహిష్కరించడం జరుగుతోంది. ఇలా 2021లో కువైత్ ఏకంగా 18వేల మంది విదేశీయులను దేశం నుంచి పంపించి వేసింది.
ఇవి కూడా చదవండి