ఒకే ఏడాది 18వేల మంది ప్రవాసుల దేశ బహిష్కరణ!

ABN , First Publish Date - 2022-01-02T13:54:16+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతేడాది వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన 18వేలకు పైగా మందిని దేశం నుంచి బహిష్కరించింది. ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం 2021లో మొత్తం 18,221 మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించినట్లు తెలిసింది.

ఒకే ఏడాది 18వేల మంది ప్రవాసుల దేశ బహిష్కరణ!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతేడాది వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన 18వేలకు పైగా మందిని దేశం నుంచి బహిష్కరించింది. ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం 2021లో మొత్తం 18,221 మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించినట్లు తెలిసింది. వీరందరూ వలసదారుల విషయమై చేసిన వివిధ చట్టాలను ఉల్లంఘించినట్లు మంత్రిత్వశాఖ తన నివేదికలో పేర్కొంది. ఇక దేశ బహిష్కరణకు గురైన 18,221 మంది ప్రవాసుల్లో 11,177 మంది పురుషులు, 7,044 మంది మహిళలు ఉన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలను వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం సూచనల మేరకు బహిష్కరణకు పాల్పడినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా జనరల్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.


విదేశీ ప్రయాణాలపై విదేశాంగ శాఖ కీలక సూచన..

కరోనా నేపథ్యంలో కువైత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ దేశ పౌరులు, నివాసితులకు కీలక సూచన చేసింది. దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లాలనుకునేవారు కొన్ని రోజుల పాటు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో విదేశీ ప్రయాణాలను మానుకోవడం మంచిదని కోరింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ ఇన్‌ఫెక్షన్ వల్ల ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపింది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు కర్ఫ్యూలు, విమానాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. అందుకే విదేశాలకు వెళ్లి ఇక్కట్లు పడకుండా ముందు జాగ్రత్తగా విదేశాంగ ఈ సూచన చేసింది. 

Updated Date - 2022-01-02T13:54:16+05:30 IST