కువైత్‌లో స్థిరపడ్డ భారత సంతతి వ్యక్తికి.. యూఏఈలో అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2022-02-15T14:26:11+05:30 IST

కువైత్‌లో స్థిరపడ్డ భారత సంతతి వ్యక్తి, భారతీయ విద్యా భవన్ ఛైర్మన్ ఎన్‌కే రామచంద్ర మీనన్‌కు యూఏఈ‌లో అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం నుండి ఆయన తాజాగా ప్రతిష్టాత్మక గోల్డెన్ వీసా అందుకున్నారు. కువైత్ నేషనల్ బ్యాంకులో బ్యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన రామచంద్ర.. 1969 నుంచి కువైత్‌లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో 2000లో...

కువైత్‌లో స్థిరపడ్డ భారత సంతతి వ్యక్తికి.. యూఏఈలో అరుదైన గౌరవం

కువైత్ సిటీ: కువైత్‌లో స్థిరపడ్డ భారత సంతతి వ్యక్తి, భారతీయ విద్యా భవన్ ఛైర్మన్ ఎన్‌కే రామచంద్ర మీనన్‌కు యూఏఈ‌లో అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం నుండి ఆయన తాజాగా ప్రతిష్టాత్మక గోల్డెన్ వీసా అందుకున్నారు. కువైత్ నేషనల్ బ్యాంకులో బ్యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన రామచంద్ర.. 1969 నుంచి కువైత్‌లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో 2000లో ఆయనకు మిడిల్ ఈస్ట్ దేశాల్లో విద్యా సంస్థలు ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. దాని నుంచి వచ్చిందే భారతీయ విద్యా భవన్. దీనిలో భాగంగా 2006లో కువైత్‌లో తొలి పాఠశాల 'ఇండియన్ ఎడ్యుకేషన్ స్కూల్' ప్రారంభించారు. ఆ తర్వాత వరుసగా 2010లో అబుదాబిలో 'ప్రైవేట్ ఇంటర్నెషనల్ ఇంగ్లీష్ స్కూల్', 2014 సెప్టెంబర్‌లో అల్ ఐన్‌లో 'అల్ సాద్ ఇండియన్ స్కూల్', 2016 సెప్టెంబర్‌లో కువైత్‌లో 'స్మార్ట్ ఇండియన్ స్కూల్', 2018లో అజ్మాన్‌లో 'వైజ్ ఇండియన్ అకాడమీ', 2019 ఏప్రిల్‌లో అల్ ఐన్‌లో భవన్స్ పెరల్ విజ్డమ్ స్కూల్ (బీపీడబ్ల్యూఎస్), 2020 ఏప్రిల్‌లో దుబాయ్‌లో భవన్స్ పెరల్ విజ్డమ్ స్కూల్ (బీపీడబ్ల్యూఎస్) స్థాపించారు.


ఇక 2019లో యూఏఈ ప్రభుత్వం ఈ దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ యూఏఈలో విదేశీయులకు నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనంకు ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అలాగే 100శాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. ఇక యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసా 10, 5ఏళ్ల కాలపరిమితో ఉంటుంది. అంతేగాక ఆటోమెటిక్‌గా పునరుద్ధరించబడుతుంది. పెట్టుబడిదారులు(కనీసం రూ. 20.50కోట్లు), పారిశ్రామికవేత్తలు, సైన్స్, నాలెడ్జ్, స్పోర్ట్స్ రంగంలోని నిపుణులు, ప్రత్యేక ప్రతిభావంతులకు గోల్డెన్ వీసా ఇస్తారు. ఇప్పటికే భారత్‌కు చెందిన పలువురు సినిమా స్టార్లు, బిజినెస్ టైకూన్స్‌కు యూఏఈ గోల్డెన్ వీసాలు మంజూరు చేసింది. షారూఖ్ ఖాన్, సంజయ్ దత్, సునీల్ శెట్టి, మమ్ముట్టీ, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, బోనీ కపూర్ ఫ్యామిలీ, గాయని చిత్ర, త్రిషా, రాంచరణ్ సతీమణి  ఉపాసన తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. అయితే, ఈ వీసా అందుకున్న కువైత్‌లో స్థిరపడిన తొలి భారత సంతతి వ్యక్తి మాత్రం ఎన్‌కే రామచంద్రన్. 

Updated Date - 2022-02-15T14:26:11+05:30 IST