Omicron ఎఫెక్ట్.. తొమ్మిది దేశాలకు విమాన సర్వీసులు రద్దు చేసిన Kuwait

ABN , First Publish Date - 2021-11-28T14:01:23+05:30 IST

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమైక్రాన్(B.1.1.529) ప్రపంచ దేశాలను మరోసారి భయం గుప్పిట్లోకి నెట్టేసింది.

Omicron ఎఫెక్ట్.. తొమ్మిది దేశాలకు విమాన సర్వీసులు రద్దు చేసిన Kuwait

కువైత్ సిటీ: దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమైక్రాన్(B.1.1.529) ప్రపంచ దేశాలను మరోసారి భయం గుప్పిట్లోకి నెట్టేసింది. శరవేగంగా ప్రబలుతున్న ఈ వేరియంట్ ఇప్పటికే 7 దేశాలకు పైగా వ్యాప్తి చెందినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన పలు దేశాలు ఆఫ్రికన్ దేశాలతో పాటు మరికొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి.  అటు గల్ఫ్ దేశాలు కూడా ఒక్కొక్కటిగా విమాన సర్వీసులను నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే సౌదీ అరేబియా, యూఏఈ ఏడు ఆఫ్రికన్ కంట్రీస్‌కు విమాన సర్వీసులను క్యాన్సిల్ చేయడంతో పాటు తమ దేశ పౌరులను ఆయా దేశాలకు వెళ్లకుండా ఆంక్షలు విధించాయి. తాజాగా ఈ జాబితాలోకి కువైత్ చేరింది. తొమ్మిది ఆఫ్రికన్ దేశాలకు కువైత్ విమాన సర్వీసులు నిలిపివేసింది. ఈ మేరకు కువైటీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శనివారం కీలక ప్రకటన చేసింది. 


దక్షిణాఫ్రికా, నమీబియా, బోత్స్వానా, జింబాబ్వే, మొజాంబిక్, లెసోతో, ఈశ్వతిని, జాంబియా, మాలావికు విమాన సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు ప్రకటించింది. అయితే, కువైత్ నుంచి ఆయా దేశాలకు వెళ్లే కార్గో విమాన సర్వీసులకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. అలాగే ఈ దేశాల నుంచి వచ్చే కువైత్ పౌరులకు 7 రోజుల ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్(సంస్థాగత నిర్బంధం) తప్పనిసరి చేసింది. అలాగే వారికి దేశంలో దిగగానే పీసీఆర్ టెస్టు కూడా ఉంటుంది. దీంతో పాటు క్వారంటైన్‌లో ఉన్నప్పుడు ఆరో రోజున రెండోసారి పీసీఆర్ టెస్టు చేయించుకోవాలి. అలాగే ప్రస్తుత కరోనా కొత్త వేరియంట్ విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కువైత్ పౌరులు కొన్ని రోజుల పాటు ఆఫ్రికన్ దేశాలకు ప్రయాణాలు పెట్టుకోవద్దని అధికారులు కోరారు. ఇక ఈ తొమ్మిది దేశాల నుంచి వచ్చే వలసదారులకు కువైత్‌లో ప్రవేశం లేదు. 


ఒకవేళ కువైత్ రావాలనుకుంటే ఆంక్షలు విధించని వేరే దేశంలో కనీసం 14 రోజులు స్టే చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొత్త వేరియంట్ నేపథ్యంలో బయటి దేశాల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కువైత్ హెల్త్ అథారిటీ సూచన మేరకు ఈ నిబంధనలు విధిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా, ఒమైక్రాన్ నేపథ్యంలో ఇలా పలు ఆంక్షలు విధిస్తున్నప్పటికీ దేశ విమానాశ్రయాన్ని, సరిహద్దులను  మూసివేయబోమని కువైత్ ఉప ప్రధాని, రక్షణ మంత్రి షేక్ హమద్ జాబర్ అల్ అలీ హామీ ఇచ్చారు. ఇదిలాఉంటే.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), బహ్రెయిన్, జోర్డాన్, ఈజిప్ట్, మొరాకో, టర్కీ కూడా కొత్త కరోనా వైరస్ B.1.1.529 నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఆఫ్రికన్ దేశాల నుండి రాకపోకలను నిషేధించాలని శుక్రవారం నిర్ణయించాయి.   

Updated Date - 2021-11-28T14:01:23+05:30 IST