మహిళల విషయంలో Kuwait సంచలన నిర్ణయం.. ఇకపై వారిని కూడా..

ABN , First Publish Date - 2021-10-13T14:02:39+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ మహిళల విషయంలో తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై వారి కూడా ఆర్మీలో పనిచేసేందుకు వీలు కల్పించింది. ఈ మేరకు మంగళవారం కీలక ప్రకటన చేసింది. కువైత్ నేషనల్ మిలిటరీ సర్వీస్‌లో మహిళల కోసం కూడా రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని ఆర్మీ అధికారులకు ఆ దేశ ఉప ప్రధాని, రక్షణ మంత్రి షేక్ హమద్ జాబెర్ అల్ అలీ అల్ సబా ఆదేశించారు.

మహిళల విషయంలో Kuwait సంచలన నిర్ణయం.. ఇకపై వారిని కూడా..

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ మహిళల విషయంలో తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై వారి కూడా ఆర్మీలో పనిచేసేందుకు వీలు కల్పించింది. ఈ మేరకు మంగళవారం కీలక ప్రకటన చేసింది. కువైత్ నేషనల్ మిలిటరీ సర్వీస్‌లో మహిళల కోసం కూడా రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని ఆర్మీ అధికారులకు ఆ దేశ ఉప ప్రధాని, రక్షణ మంత్రి షేక్ హమద్ జాబెర్ అల్ అలీ అల్ సబా ఆదేశించారు. కువైత్ మహిళలు జాతీయ సైనిక సేవలో చేరడానికి రిజిస్ట్రేషన్ తెరిచేందుకు మంగళవారం ఆయన మంత్రివర్గ నిర్ణయాన్ని జారీ చేశారు. కాగా, దరఖాస్తుదారులకు ప్రాథమిక దశలో వైద్య, సైనిక మద్దతు విభాగంలో సేవ చేసేందుకు అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.


"కువైత్ మహిళలు అనేక రంగాలలో తమను తాము నిరూపించుకున్నారు. అందుకే పురుషులతో పాటు మిలిటరీ కార్ప్స్‌లోకి ప్రవేశించడానికి మహిళలు ఆమోదం పొందారు" అని షేక్ హమద్ అన్నారు. ఆర్మీలో కూడా కువైత్ మహిళలు విజయవంతం అవుతారని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. సైన్యంలో పనిచేసే వారి కష్టాలను భరించే సామర్థ్యం కువైత్ మహిళలకు ఉందని ఆయన పేర్కొన్నారు. కువైత్ మహిళలు ఇటీవల తమ హక్కులలో గణనీయమైన పురోగతిని సాధించారనే చెప్పాలి. 2005లో కువైత్ మహిళలకు ఓటు హక్కుతో పాటు ఎన్నికైన కార్యాలయం కోసం పోటీ చేయడానికి ఒక బిల్లు ఆమోదించబడింది. నాలుగు సంవత్సరాలు తిరిగేసరికి సార్వత్రిక ఎన్నికల్లో అందుబాటులో ఉన్న యాభై స్థానాలలో నలభై మంది మహిళా అభ్యర్థులు పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నారు.


అటు న్యాయ, పోలీస్ శాఖల్లోనూ కువైటీ మహిళల సంఖ్య పెరుగుతోంది. 2008లో సాద్ అల్ అబ్దుల్లా అకాడమీ ఫర్ సెక్యూరిటీ సైన్సెస్ మహిళలు కువైట్ పోలీసు దళంలో చేరడానికి రిజిస్ట్రేషన్ తెరవాలని నిర్ణయించింది. దాంతో ఆ శాఖలో కూడా మహిళల ప్రాబల్యం పెరిగింది. ఇక మేలో ఏడుగురు కొత్త మహిళా న్యాయమూర్తులు ఎంపికవ్వడంతో ప్రస్తుతం కువైత్‌లో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 15కి చేరింది. ఇలా పలు కీలక రంగాల్లో రాణిస్తున్న మహిళలకు ఆర్మీలో కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో తాజాగా కువైత్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 

Updated Date - 2021-10-13T14:02:39+05:30 IST