ఆహ్లాదం ఆవిరి

ABN , First Publish Date - 2022-01-17T06:10:31+05:30 IST

ఖమ్మం జిల్లా స్వాగత ద్వారం.. అహ్లాదానికి మారు పేరు.. అదే పాలేరు పార్కు.. ఇంతటి పేరున్న పార్కు నేడు సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతోంది.

ఆహ్లాదం ఆవిరి
పనిచేయని ఫౌంటేన్‌

ఆనవాళ్లు కోల్పోయిన పాలేరు పార్కు

మందుబాబులకు నిలయంగా మారిన వైనం

కూసుమంచి, జనవరి 16: ఖమ్మం జిల్లా స్వాగత ద్వారం.. అహ్లాదానికి మారు పేరు.. అదే పాలేరు పార్కు.. ఇంతటి పేరున్న పార్కు నేడు సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతోంది. పార్కు నిర్వహకులు, పర్యాటక శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పచ్చదనం కనుమరుగై పోయింది. పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన ఆట వస్తువులు, పరికరాలు శిధిలమై మట్టిలో కలిసిపొయ్యాయి. అహ్లాదాన్ని పంచే లైటింగ్‌ వ్యవస్ధ పాడైపోయింది. రంగురంగులుగా నీటిని చిమ్మే ఫౌంటెన్‌లు మూలనపడి అందాలు కానరావడం లేదు. పాలేరు జలాశయంలో విహరించేందుకు ఏర్పాటు చేసిన బోట్లు సైతం మూలనపడ్డాయి. ఇటీవల సుమారు రూ.5లక్షలు వెచ్చించి తీసుకవచ్చిన బోటుసైతం మూలనపడింది. అందమైన విలువైన పూల మొక్కలు స్ధానంలో పిచ్చిమొక్కలు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం పార్కు మందుబాబులకు, కొందరి వ్యభిచారులకు నెలవుగా మారింది.  కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన పర్యాటక ప్రాంతం ఆనవాళ్లు కరువై దరిద్రంగా, దుర్భరంగా తయారయింది. దీంతో పార్కుకు వచ్చే సందర్శకులు అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకశాఖ నిర్లక్ష్యం వల్లే ఈదుస్దితి నెలకొందని బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరుతున్నారు. కనీసం బోటింగ్‌ సౌకర్యమైన కల్పించాలని కోరుతున్నారు. స్ధానిక గ్రామపంచాయతీకి అప్పగిస్తే పర్యవేక్షణ వల్ల కొంత ఉపయోగం ఉంటుందని పర్యాటకులు సూచిస్తున్నారు. కలెక్టరు చొరవతీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు.


Updated Date - 2022-01-17T06:10:31+05:30 IST