డైలమా?

ABN , First Publish Date - 2020-10-30T10:40:32+05:30 IST

కురుమూర్తి.. పేదల తిరుపతిగా పేరుగాంచింది. ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తరువాతే, ఉమ్మడి..

డైలమా?

 కురుమూర్తి జాతర నిర్వహణపై సందిగ్ధం

వచ్చే నెల 21న ఉద్దాలోత్సవం

నేటికీ ఎలాంటి ప్రకటన చేయని అధికార యంత్రాంగం


చిన్నచింతకుంట, అక్టోబరు 29 : కురుమూర్తి.. పేదల తిరుపతిగా పేరుగాంచింది. ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తరువాతే, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మల్దకల్‌ తిమ్మప్ప, మన్యంకొండ వెంకన్న, గద్వాల చెన్నకేశవ స్వామి జాతర, కందూరు రామలింగేశ్వరుడి జాతరలు జరుగుతాయి. కానీ, ఈ ఏడాది కురుమూర్తి బ్రహ్మోత్సవాల నిర్వహణపై సందిగ్ధం నెలకొన్నది. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అలంకారోత్సవం, ఉద్దాల ఉత్సవానికి లక్షల్లో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో, బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారా? లేదా అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.


మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌ సమీపంలో కురుమూర్తి క్షేత్రం ఉంది. ప్రతి ఏడాది దీపావళి అమావాస్య నుంచి ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. వచ్చే నెల 19న అలంకారోత్సవం, 21న ఉద్దాలోత్సవం జరుగనుంది. అనంతరం జాతర ప్రారంభమై నెల రోజుల పాటు కొనసాగుతుంది. అయితే, ఈ ఏడాది ఇంత వరకు జాతరకు సంబంఽధించిన ఎలాంటి సందడి కనిపించడం లేదు. అయితే, కొవిడ్‌-19 నిబంధనలు అమలులో ఉండటంతో ఉన్నతాధికారులు జాతరకు అనుమతి ఇస్తారా? లక్షల్లో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో, వారిని కట్టడి చేయడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కరోనా ప్రభావం లేకుంటే ఇప్పటికే జాతరకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యేవి. కానీ, నేటి వరకు ఎలాంటి టెండర్లు జరుగలేదు. అలాగే జాతరలో దుకాణాల ఏర్పాటుకు అనుమతులు ఇస్తారా? లేదా? అన్నది అనుమానంగానే ఉన్నది. దేవాదాయ శాఖాధికారులు మాత్రం కలెక్టర్‌ నిర్ణయం మేరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, రెండు రోజుల్లో కలెక్టర్‌ను కలిసి పరిస్థితిని వివరిస్తామని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వర స్వామికి జరిగిన బ్రహ్మోత్సవాల మాదిరిగానే, కురుమూర్తి బ్రహ్మోత్సవాలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 

Updated Date - 2020-10-30T10:40:32+05:30 IST