ఐదో రోజూ అంతే..!

ABN , First Publish Date - 2020-11-25T05:52:53+05:30 IST

తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమై ఐదు రోజులైనా ఘాట్ల వద్ద భక్తుల సందడి కనిపించడం లేదు.

ఐదో రోజూ అంతే..!
కర్నూలులో భక్తులు లేక వెలవెలబోతున్న రాంభొట్ల ఘాట్‌

  1. కర్నూలు ఘాట్లలో కనిపించని భక్తులు
  2. సంగమేశ్వరంలో తగ్గిన తాకిడి
  3. మంత్రాలయంలో పెరిగిన రద్దీ


తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమై ఐదు రోజులైనా ఘాట్ల వద్ద భక్తుల సందడి కనిపించడం లేదు. కొవిడ్‌ కారణంగా ప్రభుత్వం స్నానాలను నిషేధించింది. ఘాట్ల వద్ద అధికారులు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం, రవాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు. ఘాట్ల వద్ద భక్తుల కంటే సిబ్బందే అధికంగా కనిపిస్తున్నారు. మంగళవారం మంత్రాలయం, గురజాల, పంచలింగాల, గుండ్రేవుల, కర్నూలులోని సంకల్‌భాగ్‌ వద్ద భక్తుల సందడి నెలకొంది. 


కర్నూలు(న్యూసిటీ), ఎడ్యుకేషన్‌, గూడూరు, జూపాడుబంగ్లా, నందికొట్కూరు రూరల్‌, ఎమ్మిగనూరు టౌన్‌, మంత్రాలయం, నందవరం, ఆత్మకూరు, కొత్తపల్లి, నవంబరు 24: కర్నూలులోని రాంభొట్ల, రాఘవేంద్ర మఠం ఘాట్లలో మంగళవారం కొద్దిమంది భక్తులు మాత్రమే స్నానాలు ఆచరించారు. మరికొందరు పిండప్రదానాలు చేశారు. ఈ రెండు ఘాట్లలో గంట సేపు వలంటీర్లు లేక అధికారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 


నగర శివారులోని పంప్‌హౌస్‌ పుష్కరఘాట్‌ భక్తుల కంటే ఉద్యోగులు, సిబ్బంది అధికంగా కనిపించారు. కొంతమంది ఉద్యోగులు కునుకుపాట్లు తీశారు. 


సుంకేసుల పుష్కర ఘాట్‌లో మంగళవారం భద్రాచలం సీతారాముల దేవస్థానం అర్చకుడు అమరవాది మురళీస్వామి పుష్కర స్నానం ఆచరించి పూజలు నిర్వహించారు. అనంతరం గూడూరు ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్‌ కటకం రమేష్‌ స్వగృహంలో ఆతిథ్యం స్వీకరించి అహోబిళం బయలుదేరి వెళ్లారు. 


రాఘవేంద్రమఠం పుష్కరఘాట్‌ వద్ద భక్తులు అంతంత మాత్రమే కనిపించారు. మహిళలు నదిలో కార్తీకదీపాలు వదలడానికి ఇబ్బందులు పడుతుండటంతో ప్రత్యేక కొలను ఏర్పాటు చేశారు.

 

మునగాలపాడు పుష్కరఘాట్‌లో మెడికల్‌ క్యాంపును వైద్యశాఖ జిల్లా కో ఆర్డినేటర్‌ హేమలత తనిఖీ చేశారు.


ఎగువన డ్యాం నుంచి 3500 క్యుసెక్కుల నీరు నదికి విడుదల చేశారు. దీంతో మంత్రాలయం వద్ద ఉన్న పుష్కర ఘాట్ల వద్దకు నీరు చేరుకుంది. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


 మంత్రాలయం మఠం కళా ప్రాంగణంలో పుట్టపర్తికి చెందిన అనూరాధ నిర్వహించిన సంగీత విభావరి, మక్తల్‌కు చెందిన రాఘవేంద్రచార్‌, మంత్రాలయానికి చెందిన వేణుగోపాల్‌చార్‌ ప్రసంగాలు, బెంగళూరుకు చెందిన హుస్సేన్‌సాబ్‌ నిర్వహించిన దాసవాణి కార్యక్రమాలు అలరించాయి. 


 అడిషనల్‌ డీఎంఅండ్‌హెవో వెంకటరమణ మంత్రాలయం, రాంపురం, కాచాపురం ఘాట్లలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరాలను ఆయన 

పరిశీలించారు. 


గురుజాలలో పుష్కర స్నానాలకు భక్తులు అధికంగా వచ్చారు. అయితే స్నానాలకు అవకాశం లేకపోవడంతో నిరాశకు గురయ్యారు.

 

 ఘాట్ల దగ్గర పారిశుధ్య పనులు సక్రమంగా లేవని డీఎల్‌పీవో నూర్జహాన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. నాగలదిన్నె, గురుజాల పుష్కర ఘాట్ల వద్ద పారిశుధ్య పనులను పరిశీలించారు.

 

 సంగమేశ్వర క్షేత్రానికి మంగళవారం భక్తుల తాకిడి తగ్గింది. ఘాట్లలో నీటినిల్వలు అడుగంటిపోవడంతో పాటు పిండప్రదానాలు చేయడంతో జలాలు కలుషితమయ్యాయని భక్తులు షవర్ల వద్దే స్నానం ఆచరించారు. ఉదయం లలితాసంగమేశ్వర స్వామివార్ల ఉత్సవ విగ్రహాలకు ఆలయ ప్రధాన పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ పుష్కర జలాలచే అభిషేకించారు. సాయంత్రం 6గంటల సమయంలో పుష్కర జలాలకు సంధ్యాహారతిని నివేదించారు. మహిళలు సప్తనదీ జలాల్లో దీపాలు వదిలి వాయనాలను సమర్పించారు. 700 మంది భక్తులు క్షేత్రానికి తరలివచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. సీఐ సుదర్శనప్రసాద్‌, కొత్తపల్లి, పాములపాడు ఎస్‌ఐలు నవీన్‌బాబు, రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు చేపట్టారు. 


 ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌ నిర్వహణను నంద్యాలకు చెందిన వారు టెండర్‌లో దక్కించుకున్నారు. వీరికి రెస్టారెంట్‌ నిర్వహణతో పాటు నదీజలాల్లో పర్యాటకులకు బోట్‌ షికార్‌ చేయించేందుకు అనుమతి ఉంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యాటకులకు బోట్‌ షికార్‌కు అనుమతించారు. ఆ తర్వాత పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెస్టారెంట్‌ నిర్వాహకులు స్పీడ్‌ బోటును వెనక్కి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.


రాఘవుడి సన్నిధిలో రద్దీ

 తుంగభద్ర పుష్కరాల్లో పాల్గొనేందుకు వచ్చిన భక్తులతో మంత్రాలయం క్షేత్రంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తున్నారు. పుష్కర వేడుకల్లో ఐదోరోజు చాలామంది కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. మఠం ఘాట్‌, సంత మార్కెట్‌ ఘాట్‌, వినాయక ఘాట్‌ వద్ద షవర్ల కింద పుణ్యస్నానాలు చేశారు. అనంతరం పితృ దేవతలకు పిండప్రదానం చేశారు. నదీమతల్లికి సారె సమర్పించి దీపాలను వెలగించి నీటిలో వదిలారు. నదికి నీటి ఉధృతి పెరగడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. నదిలోకి వెళ్లి స్నానాలు చేసేందుకు ప్రయత్నించినవారిని వలంటీర్లు అడ్డుకున్నారు. పుష్కర స్నానాల అనంతరం పలువురు భక్తులు గ్రామదేవత మంచాలమ్మను, రాఘవేంద్రస్వామి మూల బృందా వనాన్ని దర్శించుకున్నారు. భక్తులను పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు ఆశీర్వదించారు. పీఠాధిపతి తుంగభద్ర జలాలలో స్వామి బృందావానాన్ని అభిషేకించి విశేష పూజలు నిర్వహించారు. 

Updated Date - 2020-11-25T05:52:53+05:30 IST