ఇంక మూడు రోజులే..!

ABN , First Publish Date - 2020-11-17T05:30:00+05:30 IST

తుంగభద్ర పుష్కర ఏర్పాట్లపై అధికారులు కుస్తీ..

ఇంక మూడు రోజులే..!
కర్నూలు నగరంలో జరుగుతున్న పనులు

పూర్తికాని పుష్కర ఏర్పాట్లు

ప్రారంభ కార్యక్రమానికి సీఎం జగన్‌

అదే రోజు ఎయిర్‌ పోర్టు ప్రారంభోత్సవం


కర్నూలు(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర పుష్కర ఏర్పాట్లపై అధికారులు కుస్తీ పడుతున్నారు. పనులు పూర్తి చేసేందుకు పది రోజుల ముందే గడువు ముగిసింది. ఇప్పటికీ పూర్తి కాలేదు. మరో మూడు రోజుల్లో పుష్కరాలు మొదలవుతాయి. జిల్లా అధికార యంత్రాంగం ఒత్తిడికి లోనవుతోంది. పుష్కరాల ప్రారంభోత్సవంలో సీఎం జగన్‌ పాల్గొంటున్నారు. అదే రోజు ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ఈ పనుల్లో మునిగింది. కలెక్టర్‌, ఎస్పీ, వివిధ శాఖల అధికారులు సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. 


23 ఘాట్లు

మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, నందికొట్కూరు, కర్నూలు ప్రాంతాలలో మొత్తం 23 పుష్కర ఘాట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్ల వద్ద పిండ ప్రదానం, పూజా కార్యక్రమాల కోసం 350 మంది పురోహితులను రప్పిస్తున్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకు  భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఈ-టికెట్‌ విధానం అమలు చేస్తున్నారు. ప్రత్యేక కంట్రోల్‌ రూం, స్విమ్మర్లు, బస్సు సర్వీసులు, అన్నదానం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సమన్వయం చేసుకునేందుకు సహాయక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సంకల్‌భాగ్‌లో ఒక ప్రత్యేక యాగశాలను ఏర్పాటు చేస్తున్నారు. పది మంది వేదపండితులతో 12 రోజుల పాటు యాగాలు చేయించాలని నిర్ణయించారు. 


కర్నూలు నగరంలో.. 

కర్నూలు నగరంలో 8 ఘాట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆరు వాహనాల పార్కింగ్‌ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. నగరంలో ఇప్పటివరకు 80 శాతం పనులు పూర్తి చేసినట్లు నగర పాలక సంస్థ అధికారులు తెలిపారు. ఫుట్‌పాత్‌లు, ఫుట్‌బోర్డులు, ఫ్లెక్సీలు, ఘాట్ల వద్ద మురుగునీరు మళ్లించే పైపులైన్ల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. సంకల్‌భాగ్‌, పెద్దమార్కెట్‌, మునగాలపాడు, మామిదాలపాడు ప్రాంతాల్లో రోడ్లు, చిన్న చిన్న మరమ్మతులు పనులు చేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యలంలో పనులను గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. 


జిల్లా వ్యాప్తంగా పుష్కర ఘాట్లు

కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం.. 

- మాసామసీద్‌ (పంప్‌ హౌస్‌), పుష్కర ఘాట్‌, కర్నూలు

- సంకల్‌భాగ్‌ ఫుష్కర ఘాట్‌, కర్నూలు.

- నాగసాయి ఆలయం పుష్కరఘాట్‌, కర్నూలు

- రాంబోట్ల దేవాలయం పుష్కర ఘాట్‌

- కొత్తపేట ఫుష్కర ఘాట్‌

- రాఘవేంద్ర స్వామి మఠం పుష్కరఘాట్‌, కర్నూలు

- షిరిడీ సాయిబాబా దేవాలయం పుష్కరఘాట్‌, కర్నూలు

- నగరేశ్వరస్వామి దేవాలయం పుష్కరఘాట్‌, కర్నూలు


కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం

- గంగమ్మ పుష్కర ఘాట్‌, గుండ్రేవుల గ్రామం

- గంగమ్మ ఆలయం, పుష్కరఘాట్‌, పంచలింగాల గ్రామం

- మునగాలపాడు గ్రామం పుష్కరఘాట్‌ (రోడ్‌ బ్రిడ్జ్‌ డౌన్‌ స్ర్టీమ్‌)

- గొందిపర్ల శివాలయం దగ్గర పుష్కర ఘాట్‌


మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం

- ఎన్‌ఏపీ పంప్‌ హౌస్‌ సమీపంలో పుష్కర ఘాట్‌, మంత్రాలయం మఠం

- సంత మార్కెట్‌ దగ్గర పుష్కర ఘాట్‌, మంత్రాలయం మఠం

- వినాయక పుష్కర ఘాట్‌, మంత్రాలయం

- రామలింగేశ్వరర స్వామి ఆలయం పుష్కర ఘాట్‌, రాంపురం గ్రామం, మంత్రాలయం

- రామలింగేశ్వర స్వామి ఆలయం పుష్కర ఘాట్‌, మైలిగనూరు గ్రామం, కౌతాళం

- రైల్వేబ్రిడ్జి సమీపంలో పుష్కరఘాట్‌, కాచపురం గ్రామం. మంత్రాలయం 

- వీవీఐపీ-1 పుష్కర ఘాట్‌, (మఠం వెనుక వైపు), మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయం

- వీవీఐపీ-2 పుష్కర ఘాట్‌, (మఠం వెనుక వైపు), మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయం


ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం

- నాగులదిన్నె వంతెన సమీపంలో పుష్కర ఘాట్‌, నాగులదిన్నె గ్రామం, నందవరం మండలం

- రామలింగేశ్వ, ఆలయం వద్ద పుష్కర ఘాట్‌, గురజాల గ్రామం, నందవరం మండలం


నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం

- సంగమేశ్వరం వద్ద పుష్కరఘాట్‌, కొత్తపల్లి

నగరంలో ఏర్పాట్లు చేయబడిన పార్కింగ్‌ ప్రదేశాలు

- పంప్‌హౌస్‌ పుష్కరఘాట్‌కు వెళ్లేవారు.. సంజీవని హాస్పిటల్‌ పక్కన మరియు వసంత రెసిడెన్సి పక్కన పొలాల్లో వాహనాలు పార్కింగ్‌ చేయాలి. వీఐపీల వాహనాలను ఘాట్‌కు కుడి పక్కన వాహనాలను పార్కింగ్‌ చేయాలి.

- మునగాలపాడు దగ్గర పుష్కర ఘాట్‌కు వెళ్లేవారు.. తిప్పమ్మ కొట్టం దగ్గర పార్కింగ్‌ చేయాలి.

- నాగసాయి టెంపుల్‌ పుష్కరఘాట్‌కు వెళ్లేవారు మరియు సాయిబాబా టెంపుల్‌ పుష్కర ఘాట్‌కు వెళ్లేవారు.. ఓల్డ్‌ సాయిబాబా టాకీసు దగ్గర వాహనాలను పార్కింగ్‌ చేయాలి.

- సంకల్‌భాగ్‌ పుష్కర ఘాట్‌కు వెళ్లేవారు.. ఎస్టీబీసీ కళాశాలలో వాహనాలను పార్కింగ్‌ చేయాలి.

- నగరేశ్వర పుష్కర ఘాట్‌, రాఘవేంద్ర స్వామి మఠం ఘాట్‌, రాంబోట్ల పుష్కరఘాట్లకు వెళ్లేవారు.. మున్సిపల్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండులో వాహనాలను పార్కింగ్‌ చేయాలి.

- రాంభొట్ల పుష్కర ఘాట్‌కు వెళ్లే టూవీలర్స్‌ వాహనదారులు జమ్మిచెట్టు వద్ద పార్కింగ్‌ చేయాలి. 


పుష్కరాలకు పటిష్ఠ భద్రత

కర్నూలు: ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే తుంగభద్ర పుష్కరాలకు పటిష్ఠమైన బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పక్కీరప్ప తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పుష్కరాలకు 5 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాతో పాటు అనంతపురం, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల అదనపు పోలీసు బలగాలను కూడా కేటాయించామన్నారు. ముగ్గురు అడిషినల్‌ ఎస్పీలు, 14 మంది డీఎస్పీలు, 46 మంది సీఐలు, 99 మంది ఎస్‌ఐలు, 413 మంది ఏఎస్‌ఐలు, 927 మంది కానిస్టేబుల్స్‌, 84 మంది మహిళా పోలీసులు, 9 స్పెషల్‌ పార్టీ బృందాలు (450 మంది పోలీసులు), 2 ఏఆర్‌ ఫ్లటూన్స్‌, 4 ఏపీఎస్పీ ఫ్లటూన్స్‌, 34 యాక్సెస్‌ కంట్రోల్‌ టీమ్స్‌, 4 డాగ్‌ స్క్వాడ్స్‌ బృందాలు, 24 మంది బాంబ్‌ డిస్పోజబుల్స్‌ బృందం పుష్కరాల విధుల్లో పాల్గొంటారన్నారు. 


20న  సీఎం రాక

కర్నూలు: తుంగభద్ర పుష్కరాల ప్రారంభోత్సవానికి  సీఎం జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 20న  జిల్లాకు రానున్నట్లు కలెక్టర్‌ జి. వీరపాండియన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై  కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో కలెక్టర్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 20న  తుంగభద్ర పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం వస్తున్న సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను అదేశించారు. ఏ ఒక్క చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హెలిప్యాడ్‌ నుంచి సీఎం వెళ్లే రహదారి పొడవునా ప్రతి వంద మీటర్లకు ఒక అధికారిని నియమించి ప్రజల నుంచి అర్జీలను తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. సీఎం పర్యటనలో జెడ్‌ ప్లస్‌ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చూడాలని పోలీసులను  ఆదేశించారు.  


ముఖ్యమంత్రి కాన్వాయ్‌, సేఫ్‌ రూం, ఆంబులెన్స్‌లు కాన్వాయ్‌ వెంట ఉండేలా చూడాలన్నారు. నగరంలో పుష్కర పనులన్నీ పూర్తి చేయాలన్నారు. వివిధ  శాఖల అధికారులకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. పాత్రికేయులకు ప్రెస్‌ పాసులను ఇవ్వాలని   పౌర సంబంధాల శాఖ అధికారిని ఆదేశించారు. శానిటైషన్‌పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కర్నూలు నగర సంస్థ కమిషనర్‌ డీకే బాలాజీని ఆదేశించారు. విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలని ఎస్పీడీసీఎల్‌ అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో ఎస్పీ ఫకీరప్ప, జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి, సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్‌, నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి, డీఆర్వో పుల్లయ్య, ఆర్‌డీవోలు, జడ్పీ సీఈవో వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు.  


పుష్కర స్నానాలకు అనుమతి లేదు: కలెక్టర్‌ జి. వీరపాండియన్‌

కర్నూలు: కొవిడ్‌ నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా తుంగభద్ర పుష్కరాల్లో స్నానాలకు అనుమతి ఇవ్వడం లేదని, భక్తులు నదీ స్నానాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ జి. వీరపాండియన్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కర్నూలు నగరంలోని సంకల్‌ బాగ్‌ పుష్కర ఘాట్‌,  పంచలింగాల పుష్కర ఘాట్లలో జరుగుతున్న పనులను జేసీ రామసుందర్‌రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్‌తో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. కొవిడ్‌-19 నిబంధనల దృష్ట్యా తుంగభద్ర పుష్కర నదీ స్నానాలకు అనుమతి లేదన్నారు. భక్తులు నదీలో ఒక మెట్టు దిగి మాత్రమే పూజా ద్రవ్యాలు వదిలి సంప్రోక్షణ చేసుకునేలా చూడాలన్నారు. పుష్కర ఘాట్ల వద్ద దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం, సీసీ కెమెరాలు, బస్టాండ్‌, విద్యుత్‌, కమాండ్‌  కంట్రోల్‌ రూము వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పుష్కర ఘాట్ల ఇన్‌చార్జులు, జడ్పీ సీఈవో వెంకట సుబ్బయ్య, ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి  పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-17T05:30:00+05:30 IST