ఉన్నత విద్య కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు.. Italy లో తెలుగు యువకుడు మృతి

ABN , First Publish Date - 2022-06-12T17:12:13+05:30 IST

ఆ తల్లిదండ్రుల కలల ప్రపంచం కూలిపోయింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన కుమారుడి అకాల మరణం వాళ్లను దుఃఖసాగరంలో ముంచేసింది. కర్నూలుకు చెందిన సి. దిలీప్‌ ఇటలీలోని మాంతార్సో బీచ్‌లో విహార యాత్రకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటన ఈనెల 10న చోటుచేసుకుంది. మృతుడి స్నేహితుల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.

ఉన్నత విద్య కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు.. Italy లో తెలుగు యువకుడు మృతి

కుమారుని మృతదేహం కోసం తల్లిదండ్రుల ఎదురు చూపు

కర్నూలు(ఎడ్యుకేషన్‌), జూన్‌ 11: ఆ తల్లిదండ్రుల కలల ప్రపంచం కూలిపోయింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన కుమారుడి అకాల మరణం వాళ్లను దుఃఖసాగరంలో ముంచేసింది. కర్నూలుకు చెందిన సి. దిలీప్‌ ఇటలీలోని మాంతార్సో బీచ్‌లో విహార యాత్రకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటన ఈనెల 10న చోటుచేసుకుంది. మృతుడి స్నేహితుల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కర్నూలు నగరంలోని బాలాజీనగర్‌లో నివసిస్తున్న సి.శ్రీనివాసరావు, శారద దంపతుల పెద్ద కుమారుడు దిలీప్‌. రెండో కుమారుడు రేవంత్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేరు ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. శ్రీనివాసరావు చిన్న వ్యాపారి. శారద నగరంలోని ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలు. దిలీప్‌ స్థానిక రవీంద్ర పాఠశాలల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు చదివాడు. విజయవాడలో ఇంటర్‌ చదివాడు. పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీలో అగ్రికల్చర్‌ బీఎస్సీ చదివాడు.


ఉన్నత విద్య కోసం ఇటలీ వెళ్లి మీలానోలో ఎంఎస్‌సీ అగ్రికల్చర్‌ పూర్తి చేశాడు. విశ్వవిద్యాలయానికి సెలవులు ప్రకటించడంతో స్వదేశానికి బయలుదేరాడు. మిత్రులతో కలిసి మాంతార్సో బీచ్‌ (ఫెజీనా)కు విహారయాత్రకు వెళ్లాడు. బీచ్‌లో ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. స్నేహితులు సముద్రం నుంచి బయటికి తీసి చికిత్స అందిస్తుండగా.. మృతి చెందాడని తల్లిదండ్రులకు 10వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు సమాచారం అందింది. ఈ వార్త విని తల్లిదండ్రులు, బంధువులు దుఖసాగరంలో మునిగిపోయారు. విదేశాల్లో ఉన్నత విద్య చదివి గొప్ప ఉద్యోగం చేస్తాడని కలలు కంటున్న తల్లిదండ్రులు ఈ విషాద వార్తతో తల్లడిల్లిపోయారు. దిలీప్‌ 2020-21 ఆగస్టులో ఇండియాకు వచ్చి ఇటలీ వెళ్లిపోయాడు. కర్నూల్‌లో తల్లిదండ్రులు కొత్త ఇల్లు నిర్మించుకొని ఈ నెల 6న గృహప్రవేశం చేశారు. ఒక వారం రోజుల్లో స్వదేశానికి వస్తుండటంతో ఈ కార్యక్రమానికి దిలీప్‌ రాలేకపోయాడు. 


తమ కుమారుడి మృతదేహాన్ని ఇండియాకు తీసుకు వచ్చేందుకు కలెక్టర్‌, ఎస్పీ, ఎంపీ డా.సంజీవకుమార్‌ చొరవ తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. వారు ఎంపీ డా.సంజీవ్‌కుమార్‌ను కలిసి శనివారం వినతిపత్రం సమర్పించారు. వీలైనంత త్వరగా మృతదేహాన్ని ఇండియాకు  తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఎంపీ డా.సంజీవకుమార్‌ హామీ ఇచ్చారు. దిలీప్‌ మృతదేహాన్ని కర్నూలుకు తీసుకువచ్చేందుకు కనీసం 15 రోజుల సమయం పడుతుందని అంచనా. 

Updated Date - 2022-06-12T17:12:13+05:30 IST