రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తా!

ABN , First Publish Date - 2021-03-02T06:40:50+05:30 IST

‘నేను చెప్పినట్లు నామినేషన్‌ విత్‌డ్రా చేసుకో. లేకుంటే ఇబ్బందులు తప్పవు. కేసులు పెడతాం. రౌడీషీట్‌ కూడా ఓపెన్‌ చేస్తాం’... నగరంలోని ఓ పోలీసుస్టేషన్‌ అధికారి విపక్ష అభ్యర్థులను ఇలా బెదిరిస్తున్నారు.

రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తా!

  1. విత్‌డ్రా చేసుకోకపోతే కేసులు పెడతా
  2. ఓ పోలీసుస్టేషన్‌ అధికారి హుకుం
  3. టీడీపీ అభ్యర్థులే టార్గెట్‌గా బెదిరింపులు
  4. బైండోవర్‌కు నాయకుల జాబితా సిద్ధం


కర్నూలు, ఆంధ్రజ్యోతి: ‘నేను చెప్పినట్లు నామినేషన్‌ విత్‌డ్రా చేసుకో. లేకుంటే ఇబ్బందులు తప్పవు. కేసులు పెడతాం. రౌడీషీట్‌ కూడా ఓపెన్‌ చేస్తాం’... నగరంలోని ఓ పోలీసుస్టేషన్‌ అధికారి విపక్ష అభ్యర్థులను ఇలా బెదిరిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులను టార్గెట్‌గా చేసుకుని ఇలా చేస్తున్నారు. ఉదయం మొదలు రాత్రి వరకు ప్రచారంలో పాల్గొనే ప్రతి కార్యకర్త వివరాలు తనకు ఇవ్వాల్సిందేనని, తాను చెప్పిన పేర్ల ప్రకారం నాయకులను బైండోవర్‌ కింద అప్పగించాలని హుకుం జారీ చేస్తున్నారు. అభ్యర్థుల నివాసాలకు పోలీసులను పంపించి ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. దీంతో ఎనిమిది మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసుకున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. 8వ వార్డు అభ్యర్థిని కూడా ఇదే తరహాలో బెదిరించారు. దీంతో రాతపూర్వకంగా ఇస్తే తప్పకుండా ఉపసంహరించుకుంటానని ఆ అభ్యర్థి సమాధానమిచ్చారు.


జిల్లాలో కర్నూలు నగరపాలకసంస్థ, ఏడు మునిసిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 2వ తేదీ నుంచి ఉపసంహరణ ప్రక్రియ ఉండడంతో బెదిరింపుల పర్వానికి తెరలేసింది. కార్పొరేషన్లో బలవంతపు ఏకగ్రీవాల కోసం అధికార పార్టీ బరితెగిస్తోంది. అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి విత్‌ డ్రా చేసుకోవాలని బేరాసారాలకు దిగడం, వినకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని, వ్యాపారాలపై నిఘా పెడతామని భయాందోళనకు గురిచేయడం జరుగుతోంది. 


ఆ పోలీసుస్టేషన్‌ అధికారి తీరుతో..

కొందరు అధికారపార్టీ నాయకులు నగరంలోని ఓ పోలీసుస్టేషన్‌ అధికారిని వాడుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే ఆ అధికారిని ఉన్నతాధికారులు హెచ్చిరించినా ఎలాంటి మార్పూ రాలేదు. పైగా ఫిర్యాదు చేసిన అభ్యర్థులపై మరింత విరుచుకుపడుతున్నారు. రెండ్రోజులుగా ఆయన 9 డివిజన్ల అభ్యర్థులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. 52వ డివిజన్లోని ఓ అభ్యర్థితో బేరసారాలకు దిగగా.. తాను విత్‌ డ్రాకు అంగీకరింబోనని తెగేసి చెప్పారు. దీంతో ఆ అధికారి అభ్యర్థిపై కేసులు బనాయించే పనిలో పడ్డారు. అలాగే 48వ డివిజన్లోని మరో అభ్యర్థిని విత్‌ డ్రా చేసుకోకుంటే రౌడీ షీట్‌ తెరుస్తానని, బైండోవర్‌ కేసులు పెడతానని భయపెట్టారు. 50, 51 డివిజన్లోని అభ్యర్థులను వేధిస్తున్నట్లు సమాచారం. రోజూ ఇంటి ముందు వాహనాలు నిలిపి, ప్రచారానికి వెళ్లొచ్చే కార్యకర్తల పేర్లు నమోదు చేసుకుంటున్నారు. కొందరు కింది స్థాయి అధికారులను ఆ అభ్యర్థుల ఇళ్లకు పంపి బెదిరిస్తున్నారు.46వ డివిజన్‌లోని ఓ మహిళా అభ్యర్థి తండ్రిపై, 43, 52, 13 డివిజన్లలోని అభ్యర్థులపై కూడా ఇదే తరహాలో వేధింపులకు గురి చేస్తున్నారని టీడీపీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గలాటాలు తదితర రౌడీ చరిత్ర ఉంటే అరెస్ట్‌ చేసుకోవాలని అభ్యర్థులే పోలీసులకు చెబుతున్నారు. ఇందుకు అంగీకరించని పోలీసులు అభ్యర్థుల ఇళ్ల వద్దే నిఘా పెట్టారు. వాస్తవానికి రౌడీ షీటర్లు, మట్కా, పేకాటరాయుళ్లు తదితర కేసుల్లో ఉన్న వ్యక్తులు అధికార పార్టీ తరఫున ప్రచారాల్లో పాల్గొంటున్నారని, అలాంటి వారిని కనీసం స్టేషన్‌కు పిలిపించడం లేదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 


కాంగ్రెస్‌కూ తప్పని తిప్పలు

కాంగ్రెస్‌ పార్టీ తరపున 20 మంది నామినేషన్లు వేయగా ఒక నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. 19 మంది బరిలో నిలవాల్సి ఉంది. ఈనెల 3న ఉపసంహరణకు గడువు ఉండటంతో మిగిలిన వారూ పోటీలో ఉండకూడదంటూ వైసీపీ నాయకులు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 8 మంది అభ్యర్థులు పార్టీ పెద్దలకు అందుబాటులో లేరని హైకమాండ్‌కు సమాచారం అందించారు. సోమవారం 8వ డివిజన్‌ అభ్యర్థి జీషన్‌ ఆలీని అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు బెదించారని, ఆ తర్వాత అతను ఇంట్లో ఉండగా వచ్చిన పోలీసులు నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ జాబితాలో డీసీసీ ఉపాధ్యక్షులు పెద్డారెడ్డి ఉండటం గమనార్హం. 46, 47, 12 డివిజన్ల అభ్యర్థులు మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్నారు. వారిపై కూడా వైసీపీ నాయకుల ప్రభావం ఉండొచ్చనే అంశంపై పార్టీలో చర్చలు సాగుతున్నాయి.


ఒత్తిళ్లు వాస్తవమే

8వ డివిజన్‌లో పోలీసుల నుంచి ఫోన్‌ రావడంతో నామినేషన్‌ ఉపసంహరించుకునేది లేదని స్పష్టం చేశాను. వారం క్రితం నాతో పాటు నా తండ్రి, సోదరులను ఓ నాయకుడు తన కార్యాలయానికి పిలిపించుకుని నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని కోరారు. పైగా వార్డులో అందరికి తాను ఉపంసంహరించుకున్నట్లు ప్రచారం చేయించారు. నేను అందుకు ఒప్పుకోకపోవడంతో సోమవారం మధ్యాహ్నం పోలీసులను పంపి బెదిరించారు. కానీ నేను ఒప్పుకోలేదు.

 -జీషన్‌ అలీ, 8 వార్డు అభ్యర్థి 


కేసులు పెట్టిస్తామంటున్నారు

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులను వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారు. కేసుల పేరుతో భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల బరిలో ఉండకుండా చేయాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కాదు. ఈ విషయాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తా.

-అహ్మద్‌ అలీఖాన్‌,డీసీసీ అధ్యక్షుడు

Updated Date - 2021-03-02T06:40:50+05:30 IST