కర్నూలు: పన్ను కట్టలేదని షాపుల ముందు చెత్త డంపింగ్

ABN , First Publish Date - 2022-03-17T18:38:42+05:30 IST

పన్ను కట్టలేదంటూ షాపుల ముందు మున్సిపల్ అధికారులు చెత్త డంప్ వేయడంపై తీవ్ర నిరసన...

కర్నూలు: పన్ను కట్టలేదని షాపుల ముందు చెత్త డంపింగ్

కర్నూలు: చెత్త పన్ను కట్టలేదంటూ షాపుల ముందు మున్సిపల్ అధికారులు చెత్త డంప్ వేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మున్సిపల్ అధికారుల తీరుపై షాపుల యజమానులు మండిపడుతున్నారు. కర్నూలులోని అనంత కాంప్లెక్స్ ఎదురుగా మున్సిపల్ సిబ్బంది చెత్తను డంప్ చేశారు. ఈ సందర్భంగా షాపుల యజమానులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు వచ్చి ఒక్కో షాపు రూ. 2 వందలు కట్టాలని చెప్పారని, అయితే తమ అసోషియేషన్‌తో మాట్లాడి కడతామని చెప్పామన్నారు. దీంతో మునిసిపల్ సిబ్బంది షాపుల ముందు చెత్త వేసి వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మాట్లాడుతున్నా.. పట్టించుకోకుండా వెళ్లిపోయారని, ఇది చాలా దారుణమన్నారు. తాము అన్ని పన్నులు కడుతున్నామని, మళ్లీ ఈ చెత్త పన్ను ఏంటో అర్థం కావడంలేదన్నారు.


కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది నిర్వాకం అందరినీ షాక్‌కు గురిచేసింది. చెత్త పన్ను కట్టలేదని షాపుల ముందు చెత్త వేశారు. నగరపాలక సంస్థ సిబ్బంది చేసిన పనికి దుకాణాదారులు అందరూ విస్తుపోయారు. ఇప్పటికే ఆస్తి, నీటి పన్నుతో పాటు దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్‌ల రుసుం చెల్లిస్తున్నామన్నారు. ఏ రాష్ట్రంలోనూ చెత్త పన్ను వసూలు చేయడం లేదని షాపుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు రూ.200 చెత్త పన్ను కట్టలేమని అంటున్నారు. చెత్త పన్ను విషయంలో సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-03-17T18:38:42+05:30 IST