కైరుప్పల గ్రామంలో చారిత్రక వేడుక
రెండు వర్గాల మధ్య పోటాపోటీ
వేలాదిగా తరలివచ్చిన ప్రజలు
ఆదోని, ఏప్రిల్ 3: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పలలో పిడకల సమరం ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. సంప్రదాయం ప్రకారం.. గ్రామస్థులు రెండువర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకోవడం అందరినీ అలరించింది. ఏటా ఉగాది మరుసటి రోజు పిడకల సమరం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా తొలుత.. కారుమంచి గ్రామం నుంచి పెద్దరెడ్డి వంశస్థుడైన నరసింహారెడ్డి గుర్రంపై మందీమార్బలం, తప్పెట్లు మేళతాళాలతో కైరుప్పల గ్రామానికి ఆదివారం సాయంత్రం వచ్చారు. వీరభద్రస్వామి, కాళికాదేవి ఆలయంలో పూజలు చేసి వెనుదిరగగానే పిడకల సమరం మొదలైంది. అక్కడ గుమిగూడిన జనం వీరభద్రస్వామి, భద్రకాళి వర్గీయులుగా విడిపోయారు. తమను తాము రక్షించుకుంటూ ఎదుటి వారిపై పిడకలు విసురుకున్నారు. సమరం ముగిసిన తర్వాత గ్రామ పెద్దలు పంచాయితీ చేసి దేవతామూర్తుల వివాహానికి అంగీకారం తెలిపారు. కాగా, ఈ వేడుక చూడ్డానికి చుట్టుపక్క గ్రామాల భక్తులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు.
ఇదీ నేపథ్యం..
ప్రచారంలో ఉన్న కథ ప్రకారం వీరభద్రస్వామి, కాళికాదేవి ప్రేమించుకుంటారు. పెద్దల అంగీకారంతో పెళ్లి కుదురుతుంది. అయితే పెళ్లి విషయంలో వీరభద్రస్వామి ఆలస్యం చేయడంతో కాళికాదేవి ఆగ్రహిస్తుంది. వీరభద్రుడు సేదదీరేందుకు హంద్రీనది ఒడ్డుకు వస్తుండగా కాళికాదేవి వర్గీయులు ఆయనపై పిడికలతో దాడికి దిగుతారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామ దేవతలైన కార్తికేయ, గిడ్డి ఆంజనేయస్వామి.. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి పెళ్లి జరిపిస్తారు. అప్పటి నుంచి పిడకల సమరం ఆనవాయితీగా వస్తోందని పెద్దలు చెబుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున వీరభద్రస్వామి, కాళికాదేవి పెళ్లిని అంగరంగ వైభవంగా జరపనున్నారు.