అక్రమ మద్యం కేసులో మంత్రి జయరాం అనుచరుల అరెస్ట్

ABN , First Publish Date - 2021-08-18T21:49:48+05:30 IST

ఆలూరులో అక్రమ మద్యం కేసులో మంత్రి జయరాం అనుచనులను పోలీసులు అరెస్టు చేశారు.

అక్రమ మద్యం కేసులో మంత్రి జయరాం అనుచరుల అరెస్ట్

కర్నూలు జిల్లా: ఆలూరులో అక్రమ మద్యం కేసులో కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులను స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పటికే మంత్రి సోదరుడి కారు డ్రైవర్ అంజిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన నివేదిక ఆధారంగా మంత్రి అనుచరులు ఐదుగురిని అరెస్టు చేశారు. మద్యం కేసులో మంత్రి జయరాం అనుచరులు అరెస్టు కలకలం సృష్టిస్తోంది. వెలమకూరు రాము, తెర్నేకల్ గురుపాదం, కరివేముల వీరేష్, లంకదిన్నె తిరుమలేష్, కోటకొండ లక్ష్మన్నను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 4న ఆలూరు మండలం, కమ్మరచేడు దగ్గర గూడ్స్ ఆటోలో ఎరువుల మధ్య మద్యం బాటిళ్లు రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆటో డ్రైవర్ కృష్ణను అదుపులోకి తీసుకుని విచారిస్తే అక్రమ మద్యం రవాణా డొంక కదిలింది. మంత్రి అనుచరులు అరెస్టు ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాగా ఈ అరెస్టులపై అధికారులు నోరు మెదపడంలేదు.

Updated Date - 2021-08-18T21:49:48+05:30 IST