కష్టాల ఖరీఫ్‌

ABN , First Publish Date - 2021-05-13T05:54:49+05:30 IST

జిల్లాలో పత్తి పంటను 2.49 లక్షల హెక్టార్లలో సాగు చేయనున్నారు.

కష్టాల ఖరీఫ్‌
ఏపీ సీడ్స్‌ సేకరించిన వేరుశనగ

కర్నూలు (కల్చరల్‌), మే 12: జిల్లాలో పత్తి పంటను 2.49 లక్షల హెక్టార్లలో సాగు చేయనున్నారు. వేరుశనగ 91 వేల హెక్టార్లలో, మొక్కజొన్న 33,053 హెక్టార్లలో, వరి 73,120 హెక్టార్లలో, కొర్ర 10,127 హెక్టార్లు, కందులు 68,660 హెక్టార్లు, ఆముదం 23,409 హెక్టార్లులో సాగు చేస్తారని అంచనా. ఉల్లి 21,145 హెక్టార్లు, మిరప 17,269 హెక్టార్లులో సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా పత్తి జిల్లాలో సాగు చేస్తారు. నాణ్యమైన విత్తనాల కోసం వ్యాపారులపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వం పత్తి విత్తనాల అమ్మకాలపై ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టడం లేదు. వ్యాపారులు ఇప్పటికే నాసిరకం విత్తనాలను గోదాముల్లో నిల్వ చేసుకున్నారు. ప్రభుత్వం నిషేధించిన బీటీ-3 పత్తి విత్తనాలను రైతులకు అంటగట్టేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. 


వేరుశనగ విత్తనాల కోసం కూడా రైతులు వ్యాపారులపైనే ఆధారపడే పరిస్థితి. దాదాపు లక్షన్నర క్వింటాళ్ల విత్తనాలు అవసరం. ప్రభుత్వం 58 వేల క్వింటాళ్లు మాత్రమే రాయితీపై పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఇప్పటికే తక్కువ ధరకు నాణ్యత లేని వేరుశనగను కొని గోదాముల్లో నిల్వ చేశారు. 


 వరి, మొక్కజొన్న, కందులతో పాటు ఆముదం, ఉల్లి విత్తనాలు రైతులకు అందుబాటులో లేవు. ఉద్యానవన శాఖ జిల్లా రైతులకు అవసరమైన ఉల్లి విత్తనాలను సిద్ధం చేయలేకపోతోంది. ధర ఇంకా నిర్ణయం కాకపోవడం వల్ల వ్యాపారులు ఉల్లి విత్తనాలను మార్కెట్లోకి తేలేదు. ప్రభుత్వం ధరను నిర్ణయించిన తర్వాత విత్తనాలను అమ్మాలని వ్యాపారులు నిర్ణయించారని ఉద్యానవనశాఖ అధికారులు అంటున్నారు. 


పత్తి రైతుపై రూ.7 కోట్ల భారం


బీటీ పత్తి విత్తన ధరలను పెంచాలని ప్రైవేటు కంపెనీల యజమాన్యాలు తెచ్చిన ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది. దీనివల్ల రాష్ట్రంలోనే పత్తి సాగులో మొదటి స్థానంలో ఉన్న కర్నూలు జిల్లా రైతులపై తీవ్ర భారం పడనుంది. జిల్లాలో 2.49 లక్షల హెక్టార్లలో పత్తి సాగు అవుతుంది. ఎకరానికి 3 ప్యాకెట్ల విత్తనాలను వినియోగిస్తారు. గతంలో 450 గ్రాముల విత్తనం ప్యాకెట్‌ ధర  రూ.730 ఉండేది. ప్రస్తుతం రూ.767కి పెంచారు. జిల్లాకి 19.29 లక్షల పత్తి ప్యాకెట్లు అవసరం అవుతుంది. ఈ మొత్తం విత్తనాలపై రైతులపై అదనంగా రూ.7 కోట్లకు పైగా భారం పడనుంది. 


పెట్టుబడికి అవస్థలు


ఖరీఫ్‌ సాగుకు పెట్టుబడి డబ్బులు సమకూర్చుకునేందుకు రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. హెక్టారుకు కనీసం రూ.25 వేలు అవసరమని అంటున్నారు. ఈ ఖరీఫ్‌లో రూ.5,859 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకు అధికారులు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. గత సంవత్సరం తీసుకున్న రుణాలను రెన్యువల్‌ చేసేందుకు బ్యాంకర్లు సిద్ధమవుతున్నారు. అందుకే కొత్త రుణాలు అందించే అవకాశం లేదని అంటున్నారు. గత ఖరీఫ్‌లో తీసుకున్న రుణాలకు వడ్డీని వసూలు చేసుకోవాలని బ్యాంకర్లకు ప్రభుత్వం ఆదేశాలు అందాయి. దీని వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటిదాకా ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఈసారి రైతుల నుంచి వసూలు చేసుకోవాలని, తాము నిధుల లభ్యతను బట్టి రైతుల బ్యాంకు ఖాతాలకు నిధానంగా జమ చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. 


అండగా ఉంటాం..


జిల్లాలోని 7 లక్షల మంది రైతులు ఖరీఫ్‌లో సాగు చేస్తారు. కార్యాచరణ రూపొందించాం. 58వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను రాయితీ కింద ఇస్తాం. పత్తి విత్తనాల కొరత లేకుండా చేశాం. డీలర్ల వద్ద దాదాపు 14 లక్షల ప్యాకెట్ల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. 


- ఉమామహేశ్వరమ్మ, జేడీఏ 



చెప్పేదొకటి.. చేసేదొకటి.. 


పందిపాడులో 9 ఎకరాలు గుత్తకు తీసుకున్నాను. ఎకరా రూ.10 వేలు చెల్లిస్తున్నా. గతేడాది పత్తి, కంది సాగు చేసినా సరైన ధర అందలేదు. అధిక వర్షాలతో దిగుబడి తగ్గింది. తెగుళ్లతో నష్టం జరిగింది. అప్పు తప్ప ఏమీ మిగల్లేదు. మళ్లీ గుత్తకు తీసుకుని సాగు చేయాలంటేనే భయంగా ఉంది. సాగు తప్ప మరో పని చేయలేను. ప్రభుత్వం బ్యాంకు రుణం అందిస్తామని చెప్పడం తప్ప ఆచరణలో పెట్టలేదు. విత్తనాలు, ఎరువులు, రైతు భరోసా తదితర పథకాలు కౌలు రైతులకు సక్రమంగా అందడం లేదు. ప్రభుత్వ సాయం అందకుంటే పంట సాగు కష్టమే. 

- వేణుబాబు, రైతు పందిపాడు


చేతిలో చిల్లి గవ్వ లేదు..


గత ఖరీఫ్‌లో కొవిడ్‌ కారణంగా పత్తి దిగుబడి అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. క్వింటం రూ.3,500లకు వ్యాపారులకు ఇచ్చేశాను. గులాబి రంగు పురుగు కారణంగా సగం పంట దెబ్బతినింది. పెట్టుబడి కూడా తిరిగిరాలేదు. ఇప్పుడు ఖరీఫ్‌ సాగుకు చేతిలో చిల్లి గవ్వ లేదు. దిక్కుతోచడం లేదు. 

- పెద్ద పెద్దయ్య, సింగవరం, రైతు

Updated Date - 2021-05-13T05:54:49+05:30 IST