Kurnool జిల్లా: మంత్రి గుమ్మనూరు Jayaramకు చుక్కెదురు

ABN , First Publish Date - 2022-07-06T19:30:03+05:30 IST

ఆదోని (Adoni)లో మంత్రి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram)కు చుక్కెదురైంది.

Kurnool జిల్లా: మంత్రి గుమ్మనూరు Jayaramకు చుక్కెదురు

కర్నూలు (Kurnool) జిల్లా: ఆదోని (Adoni)లో మంత్రి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram)కు చుక్కెదురైంది. మంగళవారం ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) పర్యటన సందర్భంగా జయరాం అనుచరుడు లక్ష్మినారాయణ (Lakshminarayana) పాస్‌ల కోసం రోడ్డుపై పరుగెత్తాడు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌ (Police Station)కు తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి జయరాం.. లక్ష్మినారాయణను విడిచిపెట్టాలని పోలీసులకు ఫోన్ చేశారు. అయితే పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటన తర్వాత మంత్రి జయరాం స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. డీఎస్పీతో మాట్లాడి తన అనుచరుడిని విడిపించుకుపోయారు. మంత్రి ఫోన్‌లో చెప్పినా... పోలీసులు వినలేదన్న విషయాన్ని తెలుసుకున్న కార్యకర్తలు ఆశ్చర్యపోయారు.


పూర్తి వివరాలు...

జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సీఎం కర్నూలు జిల్లా ఆదోనికి వచ్చిన సందర్భంలో మంత్రి గుమ్మనూరు జయరాంకు పరాభవం ఎదురైంది. సీఎం సభకోసం గుమ్మనూరు జయరాం తన నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు వీఐపీ పాసులు ఏర్పాటు చేశారు. సీఎంకు స్వాగతం చెప్పేందుకు హెలిప్యాడ్‌ వద్దకు మంత్రి గుమ్మనూరు జయరాం వెళ్లారు. ఆయన తమ్ముడు నారాయణస్వామి ప్రత్యేక వాహనంలో హెలిప్యాడ్‌ వద్దకు వెళ్తుండగా నిల్మిల్‌ థియేటర్‌ దగ్గరకు రాగానే వీఐపీ పాస్‌ల విషయం తెలిసింది. వాహనంలో ఉన్న లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని వీఐపీ పాసుల కోసం పంపించారు. ఆ వ్యక్తి హడావుడిగా వెళ్తుండగా టూటౌన్‌ పోలీసులకు అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌లో కూర్చోబెట్టారని తెలుసుకున్న మంత్రి తమ్ముడు నారాయణస్వామి సీఐ గుణశేఖర్‌బాబుకు ఫోన్‌ చేసి వీఐపీ పాసుల కోసం పంపించానని, వదిలేయాలని ఆదేశించారు. విచారణ చేసి వదిలేస్తామని ఆయన సమాధాన మిచ్చారు. సీఎం సమావేశం ముగిసినా లక్ష్మీనారాయణను పోలీసులు విడిచి పెట్టలేదు. దీంతో వారు మంత్రి జయరాంకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన మంత్రి వెంటనే డీఎస్పీకి ఫోన్‌ చేసి తన అనుచరుడిని వదిలేయాలని ఆదేశించారు. ఎంతసేపటికి వదలకపోవడంతో చేసేది లేక సీఎం పర్యటన ముగిసిన వెంటనే మంత్రి గుమ్మనూరు జయరాం టూటౌన్‌ వద్ద కాన్వాయ్‌ను ఆపారు. వాహనం నుంచి దిగిన మంత్రి నేరుగా టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ‘నా అనుచరుడని చెప్పినా ఎందుకు వదిలేయలేద’ని పోలీసు లను ప్రశ్నించారు. వీఐపీ పాసుల కోసం వెళ్లిన వ్యక్తిని ఎలా అదుపులోకి తీసుకుంటారంటూ చిర్రుబుర్రులాడారు. ఎస్పీకి ఫోన్‌ చేస్తానంటూ నంబర్‌ డయల్‌ చేస్తుండగానే... అక్కడికి చేరుకున్న డీఎస్పీ వెంకటరామయ్య సర్దిచెప్పారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి నుంచి సంతకం తీసుకుని వదిలేశారు. మంత్రి స్టేషన్‌లోకి వెళ్లగానే ఏం జరుగుతుందోనని ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.  

Updated Date - 2022-07-06T19:30:03+05:30 IST