Kuppam చరిత్ర పుటల్లో చెరగని మచ్చ.. వైసీపీదే ఘన విజయం.. మరో కోణం ఏమిటంటే..!

ABN , First Publish Date - 2021-11-18T13:16:04+05:30 IST

ఎన్నికల మాయావిగా పేరుబడ్డ నాయకుడు తిష్ట వేసి చక్రం తిప్పిన తీరు చూసి విస్తుపోయారు...

Kuppam చరిత్ర పుటల్లో చెరగని మచ్చ.. వైసీపీదే ఘన విజయం.. మరో కోణం ఏమిటంటే..!

చిత్తూరు జిల్లా/కుప్పం : కుప్పం ప్రజలు ఓడిపోయారు.. బయటి నుంచి వచ్చిన దొంగ ఓటర్ల దండయాత్రతో దారుణ పరాజయానికి గురయ్యారు. బెదిరింపులు, ప్రలోభాలు, దాడులు, దౌర్జన్యాల ముందు తల ఒంచారు. దశాబ్దాల అభివృద్ధి ఎగతాళికి గురవుతూ ఉంటే  గుడ్ల నీరు కుక్కుకున్నారు. చంద్రన్న మీది తరగని అభిమానాన్ని అవమానిస్తూ ఉంటే అసహాయులుగా మిగిలిపోయారు. ఎన్నికల మాయావిగా పేరుబడ్డ నాయకుడు తిష్ట వేసి చక్రం తిప్పిన తీరు చూసి విస్తుపోయారు. అధికారానికి గులాములైన యంత్రాంగం, సలాములు చెబుతున్న పోలీసు వ్యవస్థ సహకారం.. కుప్పం చరిత్ర పుటల్లో చెరగని మచ్చను నమోదు చేశాయి. ప్రశాంత కుపాన్ని విధ్వంస రాజకీయాలతో కలుషితం చేశాయి. మున్సిపాలిటీగా అవతరించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల ఫలితాలతో కుప్పం కొత్త ప్రయాణం మొదలు పెట్టింది.


మరో కోణం ఏమిటంటే..!

కుప్పం మున్సిపాలిటీలో 14వ వార్డు ఏకగ్రీవం కాగా మిగిలిన 24 వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 18 వార్డుల్లో విజయం సాధించింది. కేవలం ఆరు వార్డులతో టీడీపీ సంతృప్తి పడాల్సి వచ్చింది. ఇలా చూస్తే, అధికార పార్టీది ఘన విజయమనే చెప్పొచ్చు. అయితే దీనికి మరో కోణం కూడా ఉంది. కుప్పం మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగిన 24 వార్డులకు కలిపి మొత్తం 37,664 మంది ఓటర్లున్నారు. వారిలో 28,808 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో వైసీపీకి 15,892 ఓట్లు, టీడీపీకి 12404 ఓట్లు పోలయ్యాయి. ఆ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం 3288 మాత్రమే. వంద లోపు స్వల్ప మెజారిటీతో గెలిచిన అధికార పార్టీ అభ్యర్థులు ఏడుగురున్నారు.


ఆత్మవంచనే..! 

వైసీపీ అభ్యర్థులు 21వ వార్డులో 07 ఓట్లు, 6వ వార్డులో 12, 24వ వార్డులో 50, 23వ వార్డులో 69, 9వ వార్డులో 77, 17వ వార్డులో 87 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టున పడ్డారు. ఈ లెక్కలు చూపుతున్న టీడీపీ శ్రేణులు, అత్యధిక శాతం వైసీపీ అభ్యర్థుల విజయం దొంగ ఓటర్ల ద్వారానే సాధ్యమైందని విశ్లేషిస్తున్నారు. అలాగని చెప్పి, తమ తప్పేమీ లేదనుకోవడం కూడా ఆత్మవంచనే అవుతుందని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ప్రజల్లో లేని, తమను పట్టించుకోని నేతలవల్ల కూడా తొలుత అసెంబ్లీ ఎన్నికల్లో, ఆపైన ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లో జరగరాని నష్టమే జరిగిందని ఆక్షేపిస్తున్నారు. కుప్పం టీడీపీలో పోస్టుమార్టం జరిగి ప్రక్షాళన దిశగా అధినేత చంద్రబాబు చర్యలు తీసుకోకుంటే మొదటికే మోసమొచ్చే ప్రమాదమున్నదని పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2021-11-18T13:16:04+05:30 IST