Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 02 Dec 2021 02:45:00 IST

కుంగిన కొండదారి..

twitter-iconwatsapp-iconfb-icon
కుంగిన కొండదారి..

 • తిరుపతి-తిరుమల మార్గంలో భారీ బండరాళ్ల అలజడి
 • 4 ప్రాంతాల్లో జారిన 5 టన్నుల రాళ్లు
 • రెండో ఘాట్‌రోడ్‌లో బీభత్సకాండ
 • మనిషెత్తు రాళ్లు, విరిగిన కొమ్మలతో
 • భీతావహంగా మారిన రహదారి
 • భారీ వర్షాలకు బాగా నానిన చరియలు  
 • 50 అడుగుల ఎత్తునుంచి జారిపడ్డ రాళ్లు
 • అదేసమయంలో అటుగా ఆర్టీసీ బస్సు
 • దూరంగా శబ్దాలు విని నిలిపేసిన డ్రైవర్‌
 • నేడు అన్నమయ్య డ్యాంకు సీఎం
 • రెండు రోజులు వరద ప్రాంతాల్లో పర్యటన


తిరుమల, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ప్రశాంతంగా ఉండే పవిత్ర కొండదారి బండరాళ్ల అలజడితో కంపించిపోయింది.  ఒక్కొక్కటి ఐదు టన్నులు ఉన్న బండరాళ్లు పెను శబ్దం చేస్తూ.. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండోఘాట్‌రోడ్డుపైకి జారిపడ్డాయి. ఇటీవలి వర్షాలకు నానిన కొండచరియలు బుధవారం వేకువజాము 5.37 గంటలకు 15వ కిలోమీటరు వద్ద రోడ్డుపై పడ్డాయి. సుమారు 50 అడుగుల ఎత్తునుంచి వేగంగా పడి అక్కడి క్రాష్‌ బ్యారియర్‌ను ఢీకొట్టింది. భారీ బరువు కలిగిన అవి పల్టీ కొట్టుకుంటూ 15వ కిలోమీటరు వద్ద ఆగకుండా దిగువకు దూసుకుపోయాయి. 14, 13, 12కిలోమీటర్ల వద్ద రోడ్డు, రక్షిత గోడలను ఢీకొట్టి ధ్వంసం చేశాయి. కొన్ని రోడ్లపై పడిపోగా...మరికొన్ని దొర్లుకుంటూ లోయలోకి జారిపోయాయి. ఆ దారుల్లోని పెద్దపెద్ద చెట్ల కొమ్మలు పెళపెళమని విరిగిపడ్డాయి. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా దుమ్ము కమ్ముకుపోయింది.


30 ఏళ్లలో ఇదే తొలిసారి..

గత ముప్పై ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల తిరుపతి- తిరుమలల్లో భారీగా వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలో కొద్దిరోజుల నుంచి కొండలపై నుంచి దిగువకు వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో కొండచరియలు బాగా నానిపోయి బండరాళ్లకు మధ్య ఉండే మట్టి తొలగిపోతుండడంతో పలుసందర్భాల్లో కొండచరియలు విరిగిపడుతూనే ఉన్నాయి. టీటీడీ కూడా ఎప్పటికప్పుడు వాటిని తొలగించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటోంది. అయితే ఎన్నడూ లేనివిధంగా బుధవారం బరువైన బండరాళ్లు కొండపై నుంచి పడ్డాయి. ఈ క్రమంలో రెండవ ఘాట్‌రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో రెండోఘాట్‌రోడ్డును మూసివేశారు. అయి తే, ఈ ఘటన వల్ల భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. రెండో ఘాట్‌రోడ్డులో నిలిచిపోయిన వాహనాలను లింక్‌రోడ్డు ద్వారా తిరుమలకు మళ్లించారు.


బస్సు ముందుగా దొర్లుకుంటూ..

30 మంది ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సు పెనుప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. ఏపీ 03 జడ్‌ 5562 నెంబరు గల ఆర్టీసీ బస్సు ఉదయం 5 గంటలకు అలిపిరి నుంచి తిరుమలకు బయలుదేరింది. 5.37 గంటలకు 15వ భాష్యకార్ల సన్నిధి దాటగానే డ్రైవర్‌కు భారీగా శబ్దాలు వినిపించాయి. బస్సుకు సుమారు ఐదు మీటర్ల ముందు చెట్లకొమ్మలు విరిగిపడుతూ తీవ్రస్థాయిలో దుమ్ము కనిపించింది. దీంతో డ్రైవర్‌ రవీంద్ర వెంటనే బస్సును నిలిపివేయడంతో పాటు కొంతదూరం వెనక్కి వచ్చి బస్సును ఆపాడు. అంతలోనే మనిషి ఎత్తు బండరాళ్లు తన వాహనం ముందుగా వెళ్లడాన్ని గమనించాడు.


దాదాపు 29 ఏళ్లుగా ఘాట్‌రోడ్డులో బస్సు ను నడుపుతున్న అనుభవం కలిగిన డ్రైవర్‌ రవీంద్ర అప్రమ త్తం కాకుండా ఉంటే భారీ ప్రమాదం చోటుచేసుకుని ఉండేది. ఎంతో పటిష్ఠంగా ఉండే క్రాష్‌ బ్యారియర్స్‌ సైతం బండరాళ్లు ఢీకొనడంతో ధ్వంసమయ్యాయి. ఒకవేళ ఆ బండరాళ్లు బస్సు ను ఢీకొని ఉంటే భారీగా ప్రాణనష్టం వాటిల్లి ఉండేది. ‘1992 నుంచి ఘాట్‌రోడ్డులో బస్సును నడుపుతున్నా. ఎప్పుడూ ఇలాంటి శబ్దాలు వినలేదు అనుమానం వచ్చిన వెంటనే బస్సును నిలిపి సైడ్‌ మిర్రర్‌లో చూస్తూ వెనక్కి తీసుకువచ్చా. స్వామి దయవల్ల అందరం సురక్షితంగా బయటపడ్డాం’’ అని డ్రైవర్‌ రవీంద్ర ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. కుంగిన కొండదారి..

ప్రయాణాలు వాయిదా వేసుకోండి : టీటీడీ చైర్మన్‌

కొండచరియలు విరిగిపడిన విషయాన్ని తెలుసుకున్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి... జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో గోపీనాథ్‌, చీఫ్‌ ఇంజనీర్‌ నాగేశ్వరరావుతో కలిసి ఘట నా ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. ‘‘గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా వర్షా లు కురవడంతో కొండచరియలు విరిగి పడుతున్నాయి. అప్‌ ఘాట్‌రోడ్డులో మరో ఐదారు ప్రదేశాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నట్టు గుర్తించాం. యుద్ధప్రాతిపదికన దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు పూర్తిచేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. మరమ్మతులు పూర్తయ్యేవరకు మొదటి ఘాట్‌రోడ్డులోనే రాకపోకలు ఉంటాయి’’ అని తెలిపారు.


ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు బుక్‌ చేసుకుని వాహనాల ద్వారా తిరుమలకు వచ్చే భక్తులు భారీ వర్షాల కారణంగా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే రానున్న ఆరు నెలల్లోగా దర్శన తేదీని మార్చుకునే అవకాశం కల్పిస్తామన్నారు. మూడో ఘాట్‌రోడ్డు ఏర్పాటుపై టీటీడీ బోర్డులో చర్చించి సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే.. అంతకుముందు మాట్లాడిన  ఈవో జవహర్‌రెడ్డి మాత్రం తిరుమలకు ప్రయాణించేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేదని ప్రకటించడం గమనార్హం.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.