Abn logo
Aug 3 2021 @ 23:38PM

కుందూ పరవళ్లు

రాజోలి అనకట్టపై ప్రవహిస్తున్న నీరు

రాజోలి ఆనకట్టపై 6 వేల క్యూసెక్కుల ప్రవాహం

ఆదినిమ్మాయపల్లె వద్ద పెన్నాలో జల సవ్వడి

లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం

కేసీ కాలువకు నీటి విడుదలతో.. 

వరి నార్ల పెంపకానికి రైతులు సన్నద్ధం


(కడప-ఆంధ్రజ్యోతి): కుందూ పరవళ్లు తొక్కుతూ పరుగున వస్తోంది. ఎగువ నుంచి వరద నీరు రాజోలి, ఆదినిమ్మాయపల్లె ఆనకట్టకు చేరుతోంది. వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండడంతో పరిసర గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్ద జలసవ్వడి చేస్తోంది. దిగువ సోమశిల జలాశయం దిశగా పెన్నా పరుగులు పెడుతోంది. కేసీ కాలువకు నీటిని విడుదల చేయడంతో వరి నార్లు పెంచేందుకు కొందరు రైతులు సన్నాహాలు చేస్తే.. ఇప్పటికే బోరుబావుల దగ్గర వరి నార్లు వేసిన రైతులు నాట్లకు సిద్ధం అవుతున్నారు. కేసీ తీరం వరినాట్లతో సందడి చేయనుంది. 


జిల్లాలో ప్రధాన నీటి వనరులు పెన్నా, కుందూ నదులు. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా, తుంగభద్రకు వరద ఉధృతి గంటగంటకు పెరుగుతోంది. కర్నూలు జిల్లా సుంకేసుల బ్యారేజీ నుంచి కేసీ కాల్వకు 2 వేల క్యూసెక్కులు వదులు తున్నారు. శ్రీశైలం జలాశయానికి తుంగభద్ర నది సుంకేసుల బ్యారేజీ నుంచి 35,576 క్యూసెక్కులు, జూరాల నుంచి 2.44 లక్షలు కలిపి 2.80 లక్షల క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి సీమ ప్రాజెక్టుల అవసరాల కోసం 30 వేల క్యూసెక్కులు తీసుకోగా.. అందులో బానకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి సుమారుగా 5 వేల క్యూసెక్కులు కేసీ ఎస్కేప్‌ చానల్‌ ద్వారా కుందూకు విడుదల చేశారు. ఎగువ నుంచి వరద ఉధృతి పెరగడంతో రాజోలి, ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట దాటి సోమశిల వైపు కృష్ణా జలాలు పరుగులు పెడుతున్నాయి. వరద ఉధృతి దృష్ట్యా కుందూ తీర గ్రామాల రైతులు నదిలోకి వెళ్లవద్దని, తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పశువుల కాపరులు పశువుల మేపు కోసం నది ఒడ్డుకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. 


వరి నార్లు పెంపకానికి సన్నద్ధం

కేసీ కాలువకు రాజోలి ఆనకట్ట నుంచి 200-300 క్యూసెక్కులు విడుదల చేసినట్లు కేసీ కాలువ మైదుకూరు సబ్‌ డివిజన్‌ డీఈఈ బ్రహ్మారెడ్డి తెలిపారు. అలాగే.. ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట నుంచి కేసీ కడప బ్రాంచి కాలువకు 147 క్యూసెక్కులు విడుదల చేశారు. వరి నార్లు పెంపకానికి రైతులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే బోరుబావుల కింద వరినార్లు పెంచుకున్న రైతులు నాట్లు వేసేందుకు భూమిని సిద్ధం చేస్తున్నారు. కేసీ కెనాల్‌ పరిధిలో 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే.. జిల్లాలో మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప, కమలాపురం నియోజకవర్గాల పరిధిలో 92 వేల ఎకరాలకు సాగునీరు అందాలి. మరో 12-15 వేల ఎకరాల వరకు నాన్‌ అయకట్టు సాగులో ఉందని ఇంజనీర్లు అంటున్నారు. గత ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా ఆగస్టు ఒకటో తేదీన కేసీకి నీటిని విడుదల చేశారు. 


మొరాయిస్తున్న గేటు

ఆదినిమ్మాయపల్లె ఆనకట్టకు నదిలో నీటిని విడుదల చేసేందుకు 9 తూములు ఏర్పాటు చేశారు. బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన ఈ ఆనకట్ట తూములకు నాడు చెక్క షట్టర్లు ఏర్పాటు చేశారు. అవి పాడైపోవడంతో గత టీడీపీ ప్రభుత్వంలో రెండేళ్ల క్రితం ఐరన్‌ షట్టర్లు ఏర్పాటు చేశారు. అందులో ఒకటి పనిచేయడం లేదు. ఏడాదిగా మొరాయిస్తున్నా.. కనీసం మరమ్మతులు కూడా చేయలేదని స్థానిక రైతులు అంటున్నారు. కష్టకాలంలో ఎగువ నుంచి వచ్చే నీరంతా షట్టర్‌ మూసుకుని తూము ద్వారా దిగువ నదిలోకి వెళ్లిపోతే కేసీ ఆయకట్టు రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నదాతల ఆవేదన.