కుందేరు కబ్జా.!

ABN , First Publish Date - 2021-08-06T05:38:18+05:30 IST

అధికారుల అలసత్వంతో కోట్ల విలువైన యేటి పోరంబోకు అన్యాధీనం అవుతోంది. కుందేరు చీరాల, వేటపాలెం మండలాల పరిధిలో విస్తరించి ఉంది. గతంలో కుందేరు వెడల్పుగా ఉండి నీటిపారుదల వనరుగా ఉండేది. అయితే ప్రస్తుతం అది కేవలం మురుగు నీరు, వర్షపునీరు పారుదలకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో కుందేరు పరివాహక ప్రాంతాన్ని పలుచోట్ల కబ్జాదారులు ఆక్రమించారు.

కుందేరు కబ్జా.!
చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలో కుందేరు పోరంబోకులోకి చొచ్చుకు వచ్చిన ఓ ప్రహరీ నిర్మాణం

 చీరాల నడిబొడ్డున ఇష్టారీతిన

ఆక్రమిస్తున్న కన్నెత్తి చూడని అధికారులు

శాఖల మధ్య సమన్వయలోపం..

అక్రమార్కుల పాలిట వరం

పేదలది అవసరం...పెద్దలది స్వార్థం

కోట్ల విలువైన స్థలం పరాధీనం

చీరాల, ఆగస్టు 5 :

కబ్జాలకు కాదేది అనర్హం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అది ప్రభుత్వ భూమా, ప్రైవేటుదా, యేటి పోరంబోకా.. అని చూడటం లేదు చీరాల నియోజకవర్గంలో కొందరు పెద్దలు. ఏకంగా కుందేరునే అప్పనంగా కాజేస్తున్నారు. కొందరి నిర్వాకంతో కుందేరు కుచించుకుపోతోంది. పరివాహక ప్రదేశం కబ్జా కోరల్లో చిక్కుకుంటోంది. రెవెన్యూ, డ్రైయినేజి శాఖల మధ్య నెలకొన్న సమన్వయలోపం అక్రమార్కుల పాలిట వరంగా మారింది. ఒకరిని చూచి మరొకరు ఆక్రమణలకు తెగబడుతున్నారు. వీటిని నియంత్రించాల్సిన రెవెన్యూ, డ్రైనేజి అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.


 అధికారుల అలసత్వంతో కోట్ల విలువైన యేటి పోరంబోకు అన్యాధీనం అవుతోంది. కుందేరు చీరాల, వేటపాలెం మండలాల పరిధిలో విస్తరించి ఉంది. గతంలో కుందేరు వెడల్పుగా ఉండి నీటిపారుదల వనరుగా ఉండేది. అయితే ప్రస్తుతం అది కేవలం మురుగు నీరు, వర్షపునీరు పారుదలకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో కుందేరు పరివాహక ప్రాంతాన్ని పలుచోట్ల కబ్జాదారులు ఆక్రమించారు. ఒకరిని చూచి మరొకరు ఆక్రమణలకు తెగబడుతున్నారు. కుందేరుకు ఇరువైపులా ఈ పరిస్ధితి ఉంది. చీరాల మండలపరిధిలో ఈపురుపాలెం, చీరాల పట్టణ పరిధిలో ఎల్‌బీఎ్‌సనగర్‌ ప్రాంతంలో ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో కొందరు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు కేవలం ఆక్రమణలే లక్ష్యంగా అడుగులు వేశారు. 


ఆక్రమణలపై రెవెన్యూకు ఫిర్యాదు

వేటపాలెం మండల పరిఽధిలోని కొత్తపేట పంచాయతీ పరిధిలో ఓ బడాబాబు కుందేరు పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి ప్రహరీ నిర్మాణం చేశారు. ప్రహరీ లోపల కూడా కుందేరు భూమి ఉందని స్థానికులు చెబుతున్నారు. అందులో ఏర్పాటు చేసిన ఖార్ఖానా నుంచి వచ్చే వ్యర్థాలతో కుందేరు కలుషితం అవుతుంది. ఏకేపీకే కళాశాల సమపంలో కూడా ఓ ఖార్ఖానా పరిస్థితి ఇదే పంధాలో ఉంది. అలానే చల్లారెడ్డిపాలెం పరిధిలో ఓ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన  ఖార్ఖానా ప్రహరీ కుందేరు పరివాహక ప్రదేశంలోకి చొచ్చుకొచ్చింది. ప్రహరీ లోపల కూడా కుందేరు స్థలం కొన్ని ఎకరాలు ఉంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందుకు సంబంధించి పలువురు ఇటీవల రెవన్యూ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే తదుపరి  చర్యలు చేపట్టటంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. 


నోటీసులతో సరి..

 కొత్తపేటలో కుందేరులోకి చొచ్చుకు వచ్చిన నిర్మాణం కూడా సదరు నిర్మాణానికి సంబంధించి వ్యక్తిదే కావటం విశేషం. కొత్తపేటలోని నిర్మాణం మొదటి నుంచి నిబంధనలకు విరుద్ధంగానే జరిగింది. పలుమార్లు అధికారులు నోటీసులు జారీచేశారు. దాంతో కొంతమేర క్రమబద్ధీకరించుకున్నారు. అయితే ఆక్రమణలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టలేదని రెవెన్యూ, పంచాయతీ అధికారులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. చల్లారెడ్డిపాలెంలో చేపట్టిన నిర్మాణంలో రంగులకు సంబంధించిన పని జరుగుతోంది. అందులో వచ్చే వ్యర్థజలం కుందేరులో కలిపేందుకు పైప్‌లైన్‌ ఏర్పాటుచేశారు. రంగుల వ్యర్థాలు ప్రమాదభరితంగా ఉంటున్నాయని, గతంలో కొన్ని ఖార్ఖానాలను అధికారులు మూయించారు. అయితే ప్రస్తుతం చేపట్టబోయే నిర్మాణాలకు, ఖార్ఖానాకు నిబంధనల మేరకు అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశాన్ని అధికారుల పరిశీలనలో వెల్లడి కావల్సి ఉంది. 


ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ..

కుందేరు పరివాహక ప్రాంతంలో ఆక్రమణల పరంపర కొనసాగుతోంది. అందులో బడాబాబులు రూ.కోట్ల విలువచేసే భూములను ఉద్దేశపూర్వకంగా ఆక్రమిస్తున్నారు. అయితే ఆక్రమణలు నియంత్రణకు సంబంధించి ఇటు రెవన్యూ, అటు డ్రైనేజి శాఖల అధికారుల మధ్య నెలకొన్న సమన్వయలోపం ఆక్రమణదారులకు వరంగా మారింది. ఆక్రమణలు జరిగాయనేది, జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యమే. అయితే వాటిపై చర్యలు చేపట్టాల్సిన బాధ్యత తమది కాదంటే తమది కాదని రెవెన్యూ, పంచాయతీ, డ్రైనేజి శాఖల అధికారులు చెప్పటం విస్మయం కలిగిస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎవరు చర్యలు చేపట్టాలో వారే చెప్తే బాగుంటుందని అంటున్నారు.

కుందేరు ఆక్రమణలు డ్రైనేజి పరిధిలోకి వస్తాయి :

-మహ్మద్‌ హుస్సేన్‌, తహసీల్దార్‌, చీరాల మండలం

కుందేరు పరివాహక ప్రాంతం డ్రైనేజి పరిధిలో ఉంటుంది. అందుకు సంబంధించిన కార్యకలాపాలు వారి పరిధిలో ఉంటాయి. అందులో మా ప్రమేయం ఉండదు.


ఆక్రమణలు 

మా దృష్టికి వచ్చాయి 

కొన్నిచోట్ల కుందేరులో ఆక్రమణలు మాదృష్టికి వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆర్‌బీకేలకు సంబంధించిన స్ధలసేకరణ, పరిశీలనలో ఉన్నాం. అవి పూర్తయ్యాక ఆక్రమణలపై దృష్టిపెట్టి తగిన చర్యలు తీసుకుంటాం.

- సంధ్యశ్రీ, తహసీల్దార్‌,  వేటపాలెం మండలం

అది రెవెన్యూ, పంచాయితీ అధికారుల బాధ్యత :

- రాజగోపాల్‌, డీఈ, డ్రైనేజి శాఖ, చీరాల

కుందేరు మా పరిధిలోనే ఉంటుంది. అయితే అందులో ఆక్రమణలకు సంబంధించి రెవెన్యూ, పంచాయతీ వారికి లెటర్లు రూపేణా తెలియజేశాం. ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి, సర్వే చేయించి చర్యలు చేపట్టాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులు, పంచాయతీ సెక్రటరీలది.




Updated Date - 2021-08-06T05:38:18+05:30 IST