ఆడబిడ్డల ఊరు!

ABN , First Publish Date - 2020-02-29T06:33:53+05:30 IST

ఆడకూతురు ఇబ్బందులు పడి, అత్తగారి ఊరిలో పరిస్థితులు అనుకూలంగా లేని సందర్భాలలో గ్రామానికి తిరిగి వస్తే, ఇదే గ్రామంలో వారిని అక్కున చేర్చుకొని అన్ని విధాలుగా...

ఆడబిడ్డల ఊరు!

ఆడకూతురు ఇబ్బందులు పడి, అత్తగారి ఊరిలో పరిస్థితులు అనుకూలంగా లేని సందర్భాలలో గ్రామానికి తిరిగి వస్తే, ఇదే గ్రామంలో వారిని అక్కున చేర్చుకొని అన్ని విధాలుగా సహకరిస్తారు. ఆ విధంగా 1000 మందికి పైగా ఆడపడుచులు ఇక్కడకు వచ్చి తమ జీవనాన్ని సాగిస్తున్నారు.


అది ఆడబిడ్డల ఊరు... ఆడబిడ్డలు కష్టాల్లో ఉంటే ఊరు ఊరు కదిలొస్తుంది. ఆదుకుని అక్కున చేర్చుకుంటుంది. ఆ ఊరి ఆడబిడ్డ ఎవరైనా అత్తగారి ఊరిలో సమస్యలొస్తే... ఏ మాత్రం ఆలోచించకుండా కుటుంబంతో సహా పుట్టింటికి వచ్చేస్తారు. ఏ ఇంటి ఆడపడుచు అయినా సరే... కులమతాలకు అతీతంగా, అందర్నీ ఆదరించి... వారికి నీడ, ఉపాధి కల్పించి తమ పెద్ద మనసు చాటుకుంటారు ఈ  గ్రామ ప్రజలు. ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న ఆ ఊరి పేరు ‘కుందారం’. 


మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలంలో ఉన్న ఈ చిన్న గ్రామానికి 300 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. కాకతీయులలో ప్రసిద్ధి చెందిన గణపతి దేవుడు, ఆయన సామంత రాజు నతవాడి వంశీయుడైన రుద్రుడికి తన సోదరి అయిన కుందమాంబను ఇచ్చి పెళ్లి చేశారు. ఆమె శివాలయాలు, చెరువులు ఏర్పాటు చేస్తూ అక్కడ పలు శాసనాలు వేయించింది. క్రమంగా కుందమాంబ పేరుమీదనే కుందారం గ్రామం ఏర్పాటయ్యిందని చెబుతారు. 


గ్రామ ప్రత్యేకత ఇదే...

కుందారం గ్రామంలో... అక్కడే పుట్టి పెరిగిన వారితో పాటు, బతుకుదెరువు కోసం ఆ గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళి తిరిగి వచ్చి జీవిస్తున్నవారూ ఉన్నారు. ఇక్కడ ఆడపిల్లలను ఆదరిస్తారు. పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళిపోయిన ఆడకూతురు ఇబ్బందులు పడి, అత్తగారి ఊరిలో పరిస్థితులు అనుకూలంగా లేని సందర్భాలలో గ్రామానికి తిరిగి వస్తే, ఇదే గ్రామంలో వారిని అక్కున చేర్చుకొని అన్ని విధాలుగా సహకరిస్తారు. గ్రామంలోని బంధువులు, అన్నదమ్ములు ఆడబిడ్డకు ఆస్తిలో వాటా ఇచ్చి బతుకుదెరువు చూపుతారు. ఆ విధంగా 1000 మందికి పైగా ఆడపడుచులు ఇక్కడకు వచ్చి తమ జీవనాన్ని గడుపుతున్నవారే ఉన్నారు. ఆడపిల్ల పేరిట వెలసిన గ్రామంలో ఆడపిల్లలకు ఆదరణ లభించడం గొప్ప విషయంగా చెప్పవచ్చు. ‘‘మా అత్తగారి ఊరు క్రోటపల్లి మండలం బొబ్బర్లంక. చేపలు పట్టేటోళ్ళం. అక్కడ అప్పుల పాలై, అనేక ఇబ్బందులు పడ్డాం. బతకడానికే కష్టమైంది. దాంతో పుట్టిన ఊరికి కుటుంబంతో సహా వచ్చేసిన. 9 ఏండ్ల నుంచి ఇక్కడనే నివాసం. ఊరు మమ్మల్ని ఆదుకుంటోంది’’ అని ఈ గ్రామానికి చెందిన పెన్నం మహేశ్వరి చెబుతారు. 


భార్యలతో పాటు భర్తలు కూడా ‘కుందారం’ గ్రామానికే వచ్చి ఏదో ఒక ఉపాధి వెదుక్కుని ఉంటున్నారు. బిడ్డలు సుఖంగా ఉండాలని కోరుకునే ఈ గ్రామవాసులు అల్లుళ్లను కూడా అదే తరహాలో ఆదరిస్తారు. ‘‘నా భార్య పేరు ఖాజాబీ. నా భార్య ఇక్కడనే పుట్టింది. నా సొంత గ్రామం మంథని దగ్గర ఉప్పట్ల. అక్కడ కూలీ పనిచేసుకునేటోళ్ళం. ఇక్కడకు వచ్చి 20 ఏళ్లవుతోంది. నాకొక బిడ్డ, కొడుకు ఉన్నారు. గ్రామంలో కుల, మతాలతో సంబంధం లేకుండా ఆడబిడ్డగా నా భార్యను ఆదరించిండ్రు. కూలీ పనిచేసుకొని బతుకుతున్నాం. ఇక్కడ ఎలాంటి ఇబ్బందుల్లేవు. ఇలాంటి గ్రామం మరొకటి ఉండదేమో’’ అన్నారు ఎండి.మహబూబ్‌. ఈయనలాగే ఎంతోమంది తమ భార్యతో ఇక్కడికి వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. అందర్నీ తమ కుటుంబసభ్యుల్లాగే చూసుకుంటారు కుందారం ప్రజలు. ఇదే గ్రామానికి చెందిన శంకరమ్మ పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్లిన తర్వాత అక్కడ ఇబ్బందులు ఎదురయ్యాయి. గత్యంతరం లేక తన భర్త దండవేని శంకర్‌తో పుట్టింటికి తిరిగొచ్చింది. ఆమెకు నలుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. 15 ఏళ్ల క్రితం వచ్చిన శంకరమ్మ భర్త ప్రస్తుతం మేకలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆమె కొడుకులు వ్యవసాయం చేస్తున్నారు. ‘‘నాకు 90 ఏండ్లు ఉన్నయ్‌. మా అమ్మ, నా బిడ్డ ఇక్కడనే నివాసముంటరు. వాళ్ళ పిల్లలు ఇక్కడనే ఉన్నరు. మూడు తరాల నుంచి ఈ ఊరి జనాలు ఆడబిడ్డలను ఆదుకుంటండ్రు. అందరం సంతోషంగనే ఉన్నం. ఎవరికీ ఏమీ కష్టాలు లేవు. కూలీ నాలీ చేసుకుంట కూడా సుఖంగా ఉంటున్నం. మా ఊరి మీదకు ఏ ఊరు సాటి రాదు’’ అంటోంది జక్కం లచ్చక్క అనే ముసలావిడ. ఈ మాటలంటున్నప్పడు ఆవిడ కళ్లల్లో ఊరిజనాల ప్రేమ, ఆప్యాయత స్పష్టంగా కనిపిస్తుంది. ఆ భరోసా చాలు ఈ ఊరి ఆడబిడ్డలకు.   

- ఎం.డి.మునీర్‌, మంచిర్యాల

Updated Date - 2020-02-29T06:33:53+05:30 IST