ప్రతి అకౌంట్ నుంచి రెండ్రూపాయల చొప్పున 6 వేల కోట్ల దోపిడీ: కుమారస్వామి

ABN , First Publish Date - 2021-11-12T23:49:01+05:30 IST

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ కుమార

ప్రతి అకౌంట్ నుంచి రెండ్రూపాయల చొప్పున 6 వేల కోట్ల దోపిడీ: కుమారస్వామి

బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ కుమార స్వామి సంచలన ఆరోపణలు చేశారు. బిట్‌కాయిన్ కుంభకోణం నిందితులు జన్ ధన్ ఖాతాల నుంచి రూ.6,000 కోట్లు కొట్టేశారన్నారు. ప్రతి ఖాతా నుంచి రూ.2 చొప్పున బదిలీ చేసుకున్నారన్నారు. బిట్‌కాయిన్ కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానం కలుగుతోందని చెప్పారు.


జేడీఎస్ నిర్వహించిన జనతా పర్వ 1.0 వర్క్‌షాప్ సందర్భంగా విలేకర్లతో కుమార స్వామి మాట్లాడుతూ, ప్రతి జన్‌ ధన్ ఖాతా నుంచి రూ.2 చొప్పున మళ్ళిస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. ఈ చట్ట విరుద్ధ లావాదేవీ వెనుక ఎవరు ఉన్నదీ తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కూడా ఈ విషయం తెలిసే ఉంటుందని, అందుకే దీనిని తీవ్రంగా పరిగణించి ఉంటారని అన్నారు. 


బిట్‌కాయిన్ కుంభకోణం కేసు సూత్రధారి, హ్యాకర్ శ్రీకృష్ణ వురపు శ్రీకి ఓ హోటల్‌లో ఘర్షణకు సంబంధించిన కేసులో బెయిలు పొందగలిగారని చెప్పారు. ఆయనకు పూచీకత్తు ఇచ్చి ఎవరు బయటపడేశారని, ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది పాత్ర ఏమిటని ప్రశ్నించారు. 2017-18లో కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకుని ఉంటే, ఈ కుంభకోణం ఇంత తీవ్రంగా ఉండేది కాదన్నారు. 


కాంగ్రెస్, బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండటంతో, వీరిలో ఎవరిని నమ్మాలో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ అద్దాల మేడలో ఉంటూ ఇతరులపైకి రాళ్ళు విసురుతోందన్నారు. చివరికి ఆ పార్టీ నేతల పేర్లు కూడా బయటకు వచ్చాయన్నారు. ఈ కుంభకోణంపై దర్యాప్తు జరపాలని పోలీస్ కమిషనర్ కమల్ పంత్ 2021 మార్చి-ఏప్రిల్‌లోనే దర్యాప్తు సంస్థలకు లేఖ రాశారని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్న సమయంలో ఈ కుంభకోణం గురించి ఆయన దృష్టికి వెళ్ళిందని తెలిపారు. దేశం పరువు, ప్రతిష్ఠలను కాపాడటం కోసం కొందరు నాయకుల పేర్లను బయటపెట్టడంలేదన్నారు. 


ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకం (పీఎంజేడీవై)ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. జీరో బ్యాలెన్స్‌తో బ్యాంకు ఖాతా తెరిచేందుకు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు అవకాశం కల్పించింది. పీఎంజేడీవై పోర్టల్ వెల్లడించిన వివరాల ప్రకారం, 2021 నవంబరు 11నాటికి 43.81 కోట్ల జన్ ధన్ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వీటిలో మొత్తం రూ.1,48,935.05 కోట్లు నిల్వ ఉంది.


Updated Date - 2021-11-12T23:49:01+05:30 IST