కుమార్ విశ్వాస్‌కు భద్రతపై కేంద్రం సమీక్ష

ABN , First Publish Date - 2022-02-18T20:40:47+05:30 IST

ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ మాజీ నేత కుమార్ విశ్వాస్‌‌కు..

కుమార్ విశ్వాస్‌కు భద్రతపై కేంద్రం సమీక్ష

న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ మాజీ నేత కుమార్ విశ్వాస్‌‌కు భద్రత కల్పించే విషయాన్ని కేంద్రం సమీక్షిస్తోంది. సెంట్రల్ ఏజెన్సీలతో కుమార్ విశ్వాస్‌కు కేంద్రం భద్రత కల్పించే అవకాశం ఉందని అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి. కేజ్రీవాల్ ఖలిస్థాన్ అనుకూలవాది అని ఒక ఇంటర్వ్యూలో కుమార్ విశ్వాస్ ఇటీవల ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలో కుమార్ విశ్వాస్ ప్రాణాలకు ముప్పు తలెత్తే అవకాశాలపై సమీక్ష జరిపి, ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఆయనకు భద్రత కల్పించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.


కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవిని కోరుకుంటున్నారని, అది కుదరకపోతే ఖలిస్థాన్ ప్రధాన మంత్రి అవాలనుకుంటున్నారని కుమార్ విశ్వాస్ ఇటీవల ఆరోపించారు. దీంతో కేజ్రీవాల్‌పై కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్‌పై కుమార్ విశ్వాస్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని పంజాబ్ సీఎం చన్నీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, వీరంతా పంజాబ్‌ను విభజించాలని కలలుగంటున్నారని, అధికారంలో కొనసాగటం కోసం వేర్పాటువాదులతో చేతులు కలపడానికి సైతం వీరు సిద్ధమేనని ఆరోపించారు. వారి ఎజెండాకు, పాకిస్థాన్ ఎజెండాకు తేడా లేదన్నారు. కాగా, కుమార్ విశ్వాస్ చేసిన ఆరోపణలను ఆప్ నేత రాఘువ చద్దా ఖండించారు. విశ్వాస్ ఆరోపణలన్నీ కట్టుకథలను, బురదచల్లే ప్రయత్నమని అన్నారు. ఎన్నికలకు ఒక రోజు ముందే ఈ విషయాలు ఆయనకు (విశ్వాస్) గుర్తొచ్చాయా అని నిలదీశారు. కేజ్రీవాల్ ఉగ్రవాదనుకుంటే సెక్యూరిటీకి, దర్యాప్తు సంస్థలకు ఆయన తెలియజేశారా అని నిలదీశారు. ఇంతవరకూ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాజ్యసభ సీటు ఇవ్వలేదనే అక్కసుతోనే ఆయన ఇలాంటి దుష్ప్రచారానికి దిగారని అన్నారు. ఈనెల 20న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

Updated Date - 2022-02-18T20:40:47+05:30 IST