కుమరం భీం ఆసిఫాబాద్‌ బస్‌స్టేషన్‌ విస్తరణ జరిగేనా?

ABN , First Publish Date - 2022-05-07T04:05:03+05:30 IST

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ఏర్పడిన తరువాత జిల్లా కేంద్రానికి ప్రయాణికుల తాకిడీ పెరిగింది. కానీ ఆ మేరకు వసతులు మాత్రం కరువయ్యాయి. జిల్లాలో ఉన్న ఏకైక బస్‌ డిపో ఆసిఫాబాద్‌. జిల్లా కేంద్రంలో ఉన్న ఈ బస్టాండ్‌లో రద్దీకి తగినంత సదుపాయాలు లేవు.

కుమరం భీం ఆసిఫాబాద్‌ బస్‌స్టేషన్‌ విస్తరణ జరిగేనా?

- పెరుగుతున్న రద్దీ.. సరిపోని ప్లాట్‌ఫాంలు
- ఐదేళ్లుగా సాగుతున్న సన్నాహాలు
- ప్రతిపాదనలకే పరిమితం
- అన్ని మండలాల నుంచి బస్సులు అందని ద్రాక్షే

ఆసిఫాబాద్‌, మే 6: కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ఏర్పడిన తరువాత జిల్లా కేంద్రానికి ప్రయాణికుల తాకిడీ పెరిగింది. కానీ ఆ మేరకు వసతులు మాత్రం కరువయ్యాయి. జిల్లాలో ఉన్న ఏకైక బస్‌ డిపో ఆసిఫాబాద్‌. జిల్లా కేంద్రంలో ఉన్న ఈ బస్టాండ్‌లో రద్దీకి తగినంత సదుపాయాలు లేవు. జిల్లా ఏర్పడిన మొదట్లో రాకపోకల పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా ప్రస్తుతం ప్రజలు తమ వ్యక్తిగత అవసరాల కోసం జిల్లా కేంద్రాన్ని సందర్శిస్తుండడంతో బస్టాండ్‌లో రద్దీ పెరిగింది. అయితే బస్‌ స్టేషన్‌లో కేవలం ఐదు ప్లాట్‌ఫాంలు మాత్రమే ఉండడంతో ప్రయాణికులకు రద్దీ సమయాల్లో నీడ కల్పించలేని పరిస్థితి నెలకొంది. బస్‌స్టేషన్‌ విస్తరణకు ఐదేళ్లుగా ఆర్టీసీ యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క అంగుళం కూడా ముందుకు కదల లేదు. ఉద్యోగులకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలు లేక పోవడం, నివాస సదుపాయం దొరకక పోవడం లాంటి పరిస్థితుల్లో వందలాది మంది ఉద్యోగులు మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మరీ ముఖ్యంగా మంచిర్యాల-ఆసిఫాబాద్‌ మార్గం ఉద్యోగులకు ఎంతో కీలకమైంది. ఉన్నత ఉద్యోగులు, శాఖాధిపతులు చాలామంది ఆ ప్రాంత నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. 67కిలోమీటర్ల దూరానికి రెండున్నర గంటల సమయం తీసుకుంటోంది. ఫలితంగా మంచిర్యాల నుంచి వచ్చే ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరు కాలేకపోతున్నారు. ఇదంతా ఒకేత్తు అయితే జిల్లా ఏర్పడి ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ అన్ని మండల కేంద్రాల నుంచి బస్‌ సర్వీసులను ఏర్పాటు చేయక పోవడం ఆర్టీసీ నిర్లక్ష్యానికి నిదర్శనం.
15మండలాల నుంచి పెరుగుతున్న రద్దీ
గతంలో ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు బెజ్జూరు, కౌటాల వంటి మారుమూల మండలాలకు చెందిన ప్రజలు తమ వ్యక్తిగత అవసరాల కోసం ఆదిలాబాద్‌కు వెళ్లేందుకు కాగజ్‌నగర్‌ మీదుగా మంచిర్యాల వెళ్లి అక్కడి నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లేవారు. అయితే ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రం కావడంతో ఆదిలాబాద్‌కు రద్దీ భారీగా పడిపోయినట్లు ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. అదే సమయంలో ఆసిఫాబాద్‌కు క్రమంగా రద్దీ పెరుగుతున్నందున డిపో ఆదాయంలోనూ వృద్ధి కనిపిస్తున్నట్లు సమాచారం. కొత్త జిల్లాగా మారిన తరువాత అన్ని మండలాల నుంచి ప్రజలు ప్రభుత్వపరమైన కార్యకలాపాల కోసం జిల్లా కేంద్రానికి తరలివస్తున్నారని చెప్పవచ్చు.
మరీ ముఖ్యంగా సోమ, మంగళ, బుధవారాల్లో రద్దీ అధికంగా ఉన్నట్లు ఆర్టీసీ సిబ్బంది మాటలను బట్టి అర్థమవుతోంది. ఆసిఫాబాద్‌ డిపో నుంచి ఆర్టీసీ యజమాన్యం ప్రతి రోజు 33రూట్లలో 77షెడ్యూళ్లతో 400గ్రామాలు, శివారు గ్రామాలకు బస్సు సర్వీసులు నడుపుతోంది. సగటున ప్రతి రోజు 30,000 కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు సేవలు అందిస్తుండగా ఇందులో 20వేల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రతిరోజు డిపోకు రూ.9లక్షల ఆదాయం సమకురుతోంది.
ప్రతిపాదనలకే పరిమితం
ఆర్టీసీ బస్టాండులో ప్లాట్‌ఫాంల పెంపు ప్రక్రియ ప్రతిపాదనలకే పరిమి తమయింది. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఐదు ప్లాట్‌ ఫాంలు కలుపుకొని మరో నాలుగు ప్లాట్‌ఫాంల నిర్మాణం చేపట్టాలని ఆర్టీసీ యాజమాన్యం సన్నాహలు చేపట్టింది. ఐతే అయిదేళ్లు గడిచినా నేటికి అది కార్యరూపం దాల్చలేదు. నిత్యం రద్దీ పెరుగుతుండడంతో అందుకు సరిపడా వసతులు కల్పించడంపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించడంలేదు. ప్లాట్‌ ఫాంలను పెంచి వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
వసతులు పెరగలేదు
భట్టుపెల్లి సంతోష్‌, ఆసిఫాబాద్‌

జిల్లా కేంద్రంగా ఏర్పడి ఐదేళ్లు గడిచినా బస్టాండులో కనీస వసతులు మెరుగుపడలేదు. దూరప్రాంతాల నుంచి నిత్యం వేల సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. బస్టాండు విస్తరించి మౌలిక సదుపాయాలు కల్పించకపోతే సమస్యలు మరింత పెరిగే ఆవకాశం ఉంది.
బస్‌ స్టేషన్‌ను ఆధునికీకరించాలి
చిరంజీవి, ఆసిఫాబాద్‌

ఆసిఫాబాద్‌ ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ను ఆధునికీకరించాలి. ఆసిఫాబాద్‌ నుంచి కాగజ్‌నగర్‌, మంచిర్యాల రూట్లలో బస్సుల సంఖ్యను పెంచాలి. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సరిపడా బస్సులను ఆయా రూట్లలో నడపాలి.

Read more