కుల్‌భూషణ్ జాదవ్‌ కేసు : అలా చేయకపోతే పాక్ చట్టం వృథా అంటున్న భారత్

ABN , First Publish Date - 2021-06-11T16:01:32+05:30 IST

భారత నావికా దళం మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌‌కు

కుల్‌భూషణ్ జాదవ్‌ కేసు : అలా చేయకపోతే పాక్ చట్టం వృథా అంటున్న భారత్

న్యూఢిల్లీ : భారత నావికా దళం మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌‌కు విధించిన మరణ శిక్షపై అపీలు చేయడానికి అవకాశం కల్పించడాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. పాకిస్థాన్ మిలిటరీ కోర్టు జాదవ్‌కు విధించిన శిక్షపై ఆ దేశంలోని ఏదైనా హైకోర్టులో అపీలు చేయడానికి వీలు కల్పిస్తూ పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ గురువారం ఓ బిల్లును ఆమోదించడం మంచి పరిణామమని తెలిపింది. అయితే ఆయనకు భారత దేశానికి చెందిన న్యాయవాదిని నియమించుకోవడానికి అవకాశం ఇవ్వాలని, లేదా, ఓ తటస్థ దేశానికి చెందిన న్యాయవాది ద్వారా న్యాయ సహాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఈ చట్టం అర్థరహితమవుతుందని పేర్కొంది. 


జాదవ్ తనకు పాకిస్థాన్‌ మిలిటరీ కోర్టు విధించిన మరణ శిక్షపై అపీలు చేసే అవకాశం కల్పించే బిల్లును పాకిస్థాన్ పార్లమెంటు గురువారం ఆమోదించింది. దీంతో ఆయన పాకిస్థాన్‌లోని ఏదైనా హైకోర్టులో అపీలు చేయడానికి మార్గం సుగమం అయింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పును అమలు చేస్తూ సమీక్ష, పునఃపరిశీలన చేయించే హక్కు ఈ బిల్లు ద్వారా ఆయనకు లభించింది. 


కుల్‌భూషణ్ జాదవ్‌ను 2016లో బలూచిస్థాన్‌లో అరెస్టు చేసినట్లు పాకిస్థాన్ చెప్తోంది. ఆయన గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ, పాకిస్థాన్ మిలిటరీ కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించింది. ఈ ఆరోపణలను భారత దేశం తీవ్రంగా ఖండించింది. వ్యాపారం నిర్వహిస్తున్న జాదవ్‌ను  పాకిస్థానీ ఆపరేటివ్స్ ఇరాన్‌లోని చాబహార్ పోర్టు నుంచి కిడ్నాప్ చేశారని పేర్కొంది. ఆయనకు విధించిన మరణ శిక్షను 2018లో ఐసీజే నిలిపేసింది. 


ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (రివ్యూ అండ్ రీకన్సిడరేషన్) యాక్ట్‌ను పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ గురువారం ఆమోదించింది. ఈ చట్టం పాకిస్థాన్ మొత్తానికి వర్తిస్తుంది. వెంటనే అమల్లోకి వచ్చింది. జాదవ్ కేసులో ఐసీజే తీర్పు దృష్ట్యా పాకిస్థాన్ ప్రభుత్వం గతంలో ఓ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. 


వియెన్నా కాన్సులర్ సంబంధాల ఒప్పందం ప్రకారం విదేశీయులకు లభించిన హక్కులకు సంబంధించి ఐసీజే ఏదైనా ఆర్డర్‌ను జారీ చేసినపుడు, లేదా, ఈ ఒప్పందం ప్రకారం లభించిన హక్కులకు సంబంధించి ఓ విదేశీయుడు బాధితుడైనపుడు సమీక్షించడానికి, పునఃపరిశీలన జరపడానికి హైకోర్టుకు అధికారం ఉందని ఈ బిల్లు చెప్తోంది.


Updated Date - 2021-06-11T16:01:32+05:30 IST