కులకచర్ల శ్రీరామలింగేశ్వర కళాశాల ఎత్తివేత?

ABN , First Publish Date - 2022-06-20T05:03:08+05:30 IST

కులకచర్లలోని శ్రీరామలింగేశ్వర కళాశాలను ఎత్తి వేయడానికి రంగం సిద్దమైంది? శ్రీరామలింగేశ్వర కళాశాల ఎగ్జిబిషన్‌ సొసైటీ, ఉస్మానియా గ్రాడ్యూయేట్స్‌ అసోషియన్‌ ఆధ్వర్యంలో కొనసాగుతోంది.

కులకచర్ల శ్రీరామలింగేశ్వర కళాశాల ఎత్తివేత?
కులకచర్లలోని శ్రీరామలింగేశ్వర కళాశాల

  • ఈ ఏడాది రెన్యూవల్‌ చేయకపోవడంపై అనుమానాలు

కులకచర్ల, జూన్‌19: కులకచర్లలోని శ్రీరామలింగేశ్వర కళాశాలను ఎత్తి వేయడానికి రంగం సిద్దమైంది? శ్రీరామలింగేశ్వర కళాశాల ఎగ్జిబిషన్‌ సొసైటీ, ఉస్మానియా గ్రాడ్యూయేట్స్‌ అసోషియన్‌ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. మండల పరిధిలోని ఆయా గ్రామాల ప్రజల సహకారంతో 1994లో పాత సొసైటీ భవనంలో డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. మొదట్లో బీఏ, బీకాం కోర్సులు ఏర్పాటు చేశారు. కరణం కేశవరావు 5 ఎకరాల భూమిని ఉచితంగా ఇవ్వగా.. ఎగ్జిబిషన్‌ సొసైటీ వారు 2.30 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 7 ఎకరాల 30 గుంటల భూమిలో కళాశాల భవనం, ప్రహరీ నిర్మించారు. కాగా, 1996వ సంవత్సరంలో నూనత భవనంలోకి కళాశాలను మార్చారు. 2005లో డిగ్రీతో పాటు ఇంటర్‌ కోర్సులను ప్రారంభించి ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ కోర్సులు ఏర్పాటు చేశారు. అప్పట్లో విద్యార్థులు రావడం లేదని డిగ్రీలోని బీకాం కోర్సును ఎత్తివేసి బీఏతోనే కొనసాగిస్తూ వచ్చారు. కళాశాలలో ఇంటర్‌, డిగ్రీతో పాటు అదనంగా ఒపెన్‌ డిగ్రీని చదివేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ ప్రాంతానికి చెందిన ఎంతోమంది నిరుపేద విద్యార్థులు కళాశాలలో ఇంటర్‌, డిగ్రీ చదివి ఆర్మీ, పోలీస్‌, ఉపాధ్యాయ, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలు సాధించడంతో పాటు ఒకరు ఏఆర్‌ సీఐగా కొనసాగుతున్నారు. కళాశాల అనుమతి కొరకు ప్రతీ ఏడాది ఏప్రిల్‌ చివరిలో రెన్యూవల్‌ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటివర కు రెన్యూవల్‌ చేయకపోవడం చూస్తే కళాశాలను ఎత్తి వేయడానికి ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇంటర్‌, డిగ్రీ కోర్సులతో ఫలితం లేదని, కొత్త కోర్సులు ఏర్పాటు చేద్దామని సాకు చూపుతున్నారు. ఈ విద్యా సంవత్సరం కళాశాల రెన్యూవల్‌ చేయకపోవడం వల్ల ఇంటర్‌, డిగ్రీల్లో మొదటి సంవత్సరంలో చేరడానికి విద్యార్థులకు అవకాశం కోల్పోవాల్సివస్తుంది. ఈ నేపథ్యంలో ఇంటర్‌ (ద్వితీయ), డిగ్రీ (ద్వితీయ, తృతీయ) సంవత్సరం విద్యార్థులు మాత్రమే కళాశాలలో చదువుకునే అవకాశం కన్పిస్తోంది.

  • కళాశాలను ఎత్తివేస్తే ఉద్యమిస్తాం

 రామలింగేశ్వర కళాశాలలో ఉన్న కోర్సులతో ఫలితం లేదు. వెంటనే కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలి. కళాశాలను ఎత్తివేయాలని ప్రయత్నిస్తే ఉద్యమిస్తాం. మండల ప్రజల సహకారంతో కళాశాల ఏర్పడింది. కళాశాలలో ఉన్న కోర్సులతో పాటు కొత్త కోర్సులు ఏర్పాటు చేసి కళాశాలను కొనసాగించాలి.

          -బీఎస్‌ ఆంజనేయులు, కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు

Updated Date - 2022-06-20T05:03:08+05:30 IST