తరలింపు సాధ్యమేనా !

ABN , First Publish Date - 2022-05-18T06:03:06+05:30 IST

వర్షాకాలం సమీపిస్తుందంటే పోలవరం ముంపు గ్రామాల్లో అలజడి, ఆందోళన మొదలవు తుంది.

తరలింపు సాధ్యమేనా !
కుక్కునూరు మండలం కివ్వాక పునరావాస కాలనీ

పరిహారం చెల్లించనిదే
కదిలేది లేదంటున్న నిర్వాసితులు
ఇప్పటికే గుర్తించిన గ్రామాలు 44
నిర్వాసిత కుటుంబాలు 12 వేలకుపైబడే
వరద బూచి చూపెడుతున్న అధికారులు
వరదలకు ముందే కాలనీలకు తరలించే యోచన
ముంపు గ్రామాల్లో అలజడి



వర్షాకాలం సమీపిస్తుందంటే పోలవరం ముంపు గ్రామాల్లో అలజడి, ఆందోళన మొదలవు తుంది. వరద ముంపు ఎదురయ్యే ప్రమాదం ఉన్న మూడు మండలాల్లోని 130కుపైగా గ్రామాల్లో నిర్వాసితులను నిర్వాసిత కాలనీలకు తరలించాలని ఇప్పటికే అధికారులు యోచిస్తున్నారు. అయితే పూర్తి పరిహారం చెల్లించనిదే తాము కదిలేదిలేదని ఇప్పటికే గిరిజన, గిరిజనేతరులు తేల్చిచెప్పారు. చెల్లించాల్సిన పరిహారం ఈ నెలాఖరునాటికల్లా పూర్తిచేసిన తరువాతే నిర్వాసిత కుటుంబాలను తరలించాలని భావిస్తుండగా ఇప్పటికీ ఏ సాయం అందని గిరిజనేతరులు ఒకింత ఆందోళన, ఆవేదనలో ఉన్నారు. ప్రాజెక్టు పరిధిలో ప్రతీ ఏటా మే, జూన్‌ రెండు మాసాలు అత్యంత కీలకం. ఆ తదుపరి గోదావరిలో వచ్చే వరదలతో ప్రాజెక్టు పనులకు ఆటంకమే కాకుండా ముంపు గ్రామాలకు వరదల వలన పెను ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నది. గడిచిన మూడేళ్ళుగా నిర్వాసిత కాలనీలకు తరలించాలన్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూనే వచ్చాయి. ఈసారి ఏం చేయబోతు న్నారేదే అందరిలోనూ ఉత్కంఠ నెలకొన్నది.



(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : పోలవరం ప్రాజెక్టు కాంటూరు 41.15 పరిధిలోకి వచ్చే ముంపు గ్రామాలన్నింటినీ తొలుత ఖాళీ చేయించాలని రెండేళ్ళ క్రితమే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారమే కుక్కునూరు, వేలేరుపాడు పోలవరం మండలా ల పరిధిలో దాదాపు 44 గ్రామాలు ముంపుకు గురవుతాయని ఇప్పటికే గుర్తించారు. వాస్తవానికి ఈ మూడు మండలాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన దాదాపు 130కుపైగా గ్రామాలు పూర్తిగా ముంపుకు గురవుతాయి. వీటిలో ఈ గ్రామాల్లోని దాదాపు 34 వేల మందికిపైగా నిర్వాసితులవుతారు. వీరి కోసమే బుట్టాయి గూడెం, పోలవరం, జీలుగుమిల్లి వంటి మండలాల్లో పునరావాస కాలనీలను నిర్మించారు. ఇప్పుడు తాజాగా 41.15 కాంటూరు పరిధిలోని గ్రామాలను ఖాళీ చేయిం చాలంటే వీటి పరిధిలో ఉన్న దాదాపు 13 వేల మందికిపైగా నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పించి కాలనీలకు తరలించాల్సి ఉంటుంది. ఇంతకుముందు జల వనరుల శాఖా మంత్రిగా వ్యవహరించిన అనిల్‌కుమార్‌ 2021 జూన్‌ నాటికే నిర్వాసితులందరినీ కాలనీలకు తరలించే ప్రక్రియ పూర్తిచేస్తామని ప్రకటించారు. ఆ తదుపరి ప్రాజెక్టు నిర్మాణంలోనే ఒకింత జాప్యం జరగడం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ చెల్లింపుల్లో ప్రభుత్వం వెనుకంజ వేయడంతో ఈ ప్రక్రియ కాస్తా దాదాపు నిలిచిపోయి నట్టయ్యింది. కానీ పోలవరం కాంటూరు పరిధిని 41 మీటర్లలోపే ఉన్న గ్రామాల నిర్వాసితులను మాత్రమే కాలనీలకు తరలించాలని ఇంతకుముందు ప్రతిపాదిం చారు. ఇప్పుడు దాని కోసం మరోమారు అధికార యంత్రాంగం తన ప్రయత్నాలను ఆరంభించింది. వాస్తవానికి నిర్వాసితుల తరలింపు వ్యవహారం కాస్తా పరిహారం చెల్లింపుతో ముడిపడి ఉంది. ఈ అంశంపైనే గిరిజనులు, గిరిజనేతరులు నేరుగా పట్టుపడడం, వీరికి ఆయా పార్టీలు మద్దతుగా నిలవడంతో అధికార పక్షం సైతం నిస్సహాయతలో పడింది. ప్రతీ ఏటా వర్షాకాలం ముందే అధికారులు హడావుడి చేయడం, నిర్వాసితులను గ్రామాలు ఖాళీ చేసే విధంగా సన్నద్ధంకావాలని కోరడం గడిచిన మూడేళ్ళల్లో సర్వ సాధారణమైంది. ఇప్పటిదాకా నిర్దేశించిన నిర్వాసితుల్లో ఆరు వేల మంది వరకు మాత్రమే ఆయా కాలనీల వైపు మొగ్గుచూపుతూ  వచ్చారు. మిగతా వారు మాత్రం గత ఏడాది గోదావరికి వరద వచ్చినప్పుడు కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో ఆయా గ్రామాల్లోని నిర్వాసితులు  తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కొండలెక్కారు. అక్కడే గుడారాలు వేసుకుని కొంతకాలం గడిపి వరద తగ్గిన తరువాత తిరిగి ఆయా గ్రామాల్లో తమ   నివాసాల్లో అడుగు పెట్టారు.

పరిహారమే అసలు సమస్య
పోలవరం ప్రాజెక్టు పరిధిలో గడిచిన పదేళ్ళుగా పరిహారం చెల్లించే విషయంలో అనేక ఆటంకాలు ఎదురవుతూ వచ్చాయి. వేల నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించడం ప్రభుత్వం చాలాసార్లు తికమకపడింది. మధ్యలో దళారులు రంగ ప్రవేశం చేశారు. ఇష్టానుసారం దోపిడీ జరిగింది. భూమికి భూమి, కాలనీల నిర్మాణం, వ్యక్తిగత పరిహారంలో అనేక గమ్మతులు జరిగాయి. వీటన్నింటినీ అధికారులు ఖండిస్తూ వచ్చారు. ఇప్పటికే పోలవరంలో 19 గ్రామాలు, వేలేరుపాడులో 17, కుక్కునూరులో ఎనిమిది చొప్పున తరలించాల్సి ఉంది. ఈ మూడు మండలాల్లో దాదాపు 13 వేల మందికి పూర్తిగా పరిహారం అందించి ముంపు గ్రామాల నుంచి పునరావాస కాలనీలకు రప్పించాల్సి ఉంది. అయితే ఇప్పటికే ముందుగా ప్రకటించిన విధంగా గిరిజన కుటుంబాల్లో ఒక్కొక్కరికి 6 లక్షల 85 వేలు, గిరిజనేతరులకైతే 6 లక్షల 35 వేలు చొప్పున ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద పరిహారం చెల్లించాల్సి ఉంది. కాని ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం గిరిజన కుటుంబాల్లో దాదాపు 90 శాతం పైగానే పరిహారం అందుకోగా, గిరిజనేతరుల్లో మాత్రం చాలా కుటుంబాలకు ఇంకా పరిహారమే దక్కలేదు. దీనికితోడు పరిహారం పెంచుతామంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఇంకా అమలే కాలేదు. ఇలాంటి తరుణంలో నిర్వాసితుల తరలింపు ప్రక్రియ ముంపు గ్రామాల్లో అలజడి రేపుతుంది. అంతకంటే మించి వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. ఎందుకనంటే పరిహారం సంపూర్తిగా అందించలేకపోవడం ఒక ఎత్తయితే, మరోవైపు ఇప్పటికే తాము నివసిస్తున్న ఇళ్ళకు నష్టపరిహారం అంచనా కట్టి నివేదించారని, కాని పరిహారం మాత్రం తమ చేతికిచ్చే ప్రయత్నమే చేయడంలేదనేది నిర్వాసిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాని గిరిజన, గిరిజనేతర కుటుంబాల మధ్య పరిహారం చెల్లింపులోనూ కాస్త జాప్యం చోటు చేసుకోవడం కూడా ఆయా కుటుంబాల్లో ఆగ్రహం నింపుతుంది. మరోవైపు ప్రాజెక్టు మొదటి ఫేజ్‌ కింద తరలించే కుటుంబాల సంఖ్య, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, కొందరు లేవనెత్తుతున్న అభ్యంతరాలన్నింటిపై తాజాగా అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటికే స్పందన కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్‌తోపాటు తహసీల్దార్లు, ఆర్డీవో, ఐటీడీఏ పీవోలకు వినతులు అందించారు. వీటన్నింటిలోనూ పరిహారం విషయం అత్యధికులు లేవనెత్తారు. ఈసారి పోలవరం ముంపు గ్రామాల్లో నిర్వాసిత కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయిస్తారా, లేదంటే ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించిన తరువాతే ఒడ్డెక్కిస్తారా అనేది తేలాల్సి ఉంది. ముంపు గ్రామాల్లో ప్రస్తుతం ఈ అంశమే అలజడి రేపుతుంది.

 వరదల భయంతో తరలివెళ్లాం
కుక్కునూరు ఎ–బ్లాక్‌లో ఉన్న తమ కాలనీకి ప్రతీ ఏడాది గోదావరి ముంపు భయం ఉంది. ఇటీవల పునరావాస పరిహారం చెల్లించారు. అధికారుల ఆదేశం, గోదావరి భయంతో చేసేది లేక పునరావాస కాలనీకి తరలివచ్చాం. తమ ఇంటి పరిహారం కూడా చెల్లించాలని కోరుతున్నాం.
– శ్రీరాముల వెంకటమ్మ
కుక్కునూరు గిరిజన నిర్వాసితురాలు


ఇంటి పరిహారం చెల్లించండి
పోలవరంతో తాము కోల్పోతున్న ఇంటికి మూడున్నర లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే వ్యక్తిగత పరిహారం మాకు జమ అయ్యింది. ఇంటి పరిహారం కూడా జమ చేస్తేనే మాకు న్యాయం చేసిన వారు అవుతారు. ఈనెలాఖరుకు నిర్వాసితుల కాలనీకి మా కుటుంబం తరలివెళ్తుంది.
– ఎన్‌.వెంకటరమణ, నిర్వాసితుడు

 అన్ని వివరాలు సేకరిస్తున్నాం
ముంపు గ్రామాలన్నింటిలోనూ గ్రామాలన్నింటినీ స్వయంగా పరిశీలిస్తున్నాం. ఆయా కుటుంబాల వద్దకు వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నాం. స్పందన కార్యక్రమంలో ఇచ్చిన విజ్ఞాపనలను, వాటిలో ఉన్న అంశాలను పరిశీలనలోకి తీసుకుంటున్నాం. అన్నిటికంటే మించి వీటన్నింటిపైనా సమగ్ర నివేదికను కలెక్టర్‌కు అందిస్తాం. ముందు నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నాం. ఆ తరువాతే నిర్ణయం.
–  ఎం.ఝాన్సీరాణి, ఆర్డీవో, జంగారెడ్డిగూడెం

Updated Date - 2022-05-18T06:03:06+05:30 IST